చిన్మయానంద్‌ కేసులో సిట్‌ దర్యాప్తును తప్పుపట్టిన బృందాకరత్‌
షాజహాన్‌పూర్‌ : చిన్మయానంద్‌ కేసులో సిట్‌ దర్యాప్తు న్యాయం కోరుకునే ప్రతీ మహిళకూ తప్పుడు సంకేతాలనిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ విమర్శించారు. బాధితురాలు, ఆమె కుటుంబసభ్యుల నైతిక బలాన్ని నీరుగార్చేవిధంగా, వారిని నిరుత్సాహపరిచే విధంగా సిట్‌ దర్యాప్తు ఉందన్నారు. చిన్మయానంద్‌పై లైంగికదాడి ఆరోపణలు చేసిన లా విద్యార్థినిని షాజహాన్‌పూర్‌ జిల్లా కేంద్ర కారాగారంలో బృందాకరత్‌, సుభాషిణి అలీ, ఐద్వా నేతలు గురువారం పరామర్శించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ సభ్యులను కలిసి వినతిపత్రం అందచేశారు. చిన్మయాంద్‌, అతని సిబ్బందిపై వెంటనే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 201కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని సిట్‌ బృందాన్ని కోరారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బృందాకరత్‌ మాట్లాడారు. ‘లైంగికదాడి నిందితులకు మద్దతివ్వటం బీజేపీ మానుకోవాలి. యూపీలో ఉన్నావో లైంగికదాడి ఘటన తర్వాత ఇది రెండో కేసు. బాధితులను బెదిరించటానికీ, వారి కుటుంబసభ్యులను వేధించటానికి నిందితులు అధికారబలాన్ని ఉపయోగిస్తున్నారు. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను సిట్‌ దర్యాప్తు నిరుత్సాహపరుస్తున్నది. అంతేకాదు, దేశవ్యాప్తంగా న్యాయం కోరుతున్న ప్రతి మహిళకూ ఇది తప్పుడు సంకేతాలు పంపుతున్నది’ అని కరత్‌ అన్నారు. ‘చిన్నయానంద్‌ను రక్షించేందుకు సిట్‌ అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నది. చిన్మయానంద్‌ను కాపాడేందుకే అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. యూపీ ప్రభుత్వం, పాలనాయంత్రాంగం, పోలీసులు, దర్యాప్తు సంస్థలన్నీ నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటు. బాధితురాలిని జైలుకు ఈడ్చారు. ఇది పూర్తిగా అమానవీయం’ అని బృందా కరత్‌ అన్నారు. సిట్‌ దర్యాప్తుపై అలహాబాద్‌ హైకోర్టు సంతృప్తిని వ్యక్తంచేయటంపై ఆమె మాట్లాడుతూ.. ‘హైకోర్టును నేను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిందితుడిపై సిట్‌ ‘లైంగికదాడి ఎఫ్‌ఐఆర్‌’ నమోదుచేయలేదని కోర్టుకు తెలిసిందా? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ఒక మహిళ లైంగికదాడి ఫిర్యాదుచేస్తే.. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి, దర్యాప్తు చేపట్టాలి..’ అని బృందాకరత్‌ తెలిపారు. సుభాషిణీ అలీ మాట్లాడుతూ.. ‘ఈ కేసులో బాధితురాలికన్నా, నిందితుడు రాజకీయంగా, ఆర్థికంగా చాలా శక్తిమంతుడు. పలు విద్యా సంస్థలను నడుపుతున్నాడు. అందుకే మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఆయనకు మద్దతు ఇస్తున్నారు’ అని విమర్శించారు.

Courtesy Nava telangana..