– చినజీయర్‌ ట్రస్ట్‌కు కేటాయింపులో ఆసక్తికర విషయాలు
హద్దురాళ్లుగా కాషాయ జెండాలు
రిజిస్ట్రేషన్‌ మరుసటిరోజే డాక్యుమెంట్‌ విడుదల
ధ్రువపత్రాలు ఇప్పించేందుకు వచ్చిన డీఐజీ
యాదాద్రిలో చినజీయర్‌ స్వామి ట్రస్టుకు ప్రభుత్వం భూముల కేటాయింపులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్‌కు, డాక్యుమెంట్లు ఇప్పించేందుకు ఏకంగా హైదరాబాద్‌ నుంచి అధికారులు తరలిరావడం చూస్తుంటే ఎంత ఆగమేఘాల మీద ఈ తతంగం జరిగిందో అర్థమవుతున్నది. ఇంత అత్యవసరంగా, రహస్యంగా కారు చౌకగా భూములు కేటాయింపు ఎందుకు చేయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లక్ష్మి నర్సింహ్మస్వామి దేవాలయం అభివృద్ధి కోసమని రైతుల నుంచి భూసేకరణ చేసిన రూ.10 కోట్ల విలువైన 2.30 ఎకరాల భూమిని ప్రభుత్వం చినజీయర్‌ ట్రస్టుకు రూ.16.50 లక్షలకు కట్టబెట్టడంపై విమర్శలను ఎదుర్కొంటోంది. యాదగిరిగుట్టకు చినజీయర్‌ స్వామికి సంబంధం ఏముందనీ, విలువైన భూమిని అప్పగించడం వెనుక ఉన్న మతలబు ఏంటనీ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ స్థల పురాణం మొదలైనప్పటి నుంచి ఈ గుడి వానమాములై పీఠాధిపతుల పరిధిలో ఉందని పండితులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ విస్తరణ గురించి ఇప్పటివరకు వారితో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని తెలుస్తోంది. కానీ, యాదగిరిగుట్టకు సంబంధం లేని చినజీయర్‌ను ఆధ్మాతిక గురువుగా, ఆయన పర్యవేక్షణలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేయడం వెనుక సీఎం కేసీఆర్‌కు ఏదో పెద్ద ప్రయోజనమే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకనే సీఎం కేసీఆర్‌ చినజీయర్‌ మెప్పుకోసం విలువైన భూమిని ధారాదత్తం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హద్దు రాళ్లను పాతితే భూమిని కొనుగోలు చేసిన విషయం వెలుగులోకి వస్తోందన్న ముందుచూపుతో ఆ భూమి చుట్టూ కాషాయ జెండాలు పాతినట్టు తెలుస్తోంది.
పథకం ప్రకారమే భూమి అప్పగింత
యాదాద్రి భూముల కేటాయింపు ఒక పథకం ప్రకారంగా జరిగినట్టు అర్ధమవుతోంది. జూలై 30న సీఎం కేసీఆర్‌ మై హోం అధినేత రామేశ్వర్‌రావును వెంటబెట్టుకొని శంషాబాద్‌ సమీపంలోని చిన జీయర్‌ ట్రస్టుకు వెళ్లారు. ఆగస్ట్‌ 14న చిన జీయర్‌స్వామి తన ట్రస్టుకు యాదాద్రిలో 4ఎకరాల స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్ట్‌ 17న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ యాదాద్రిని సందర్శించారు. సెప్టెంబర్‌ 05న 2.30ఎకరాల భూమిని వైటీడీఏ ఇన్‌చార్జీ సెక్రటరి చినజీయర్‌ ట్రస్టుకు రిజిస్ట్రేషన్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్‌ను సీరియల్‌ నెంబర్‌ ప్రకారం స్కానింగ్‌ చేసి కొనుగోలు దారుడికి ఇచ్చేందుకు సుమారు 20 రోజులు పడుతుంది. కానీ సీరియల్‌ నెంబర్‌తో నిమిత్తం లేకుండా స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ముఖ్య అధికారి ఈ నెల 6న యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి ఆగమేఘాల మీద డాక్యుమెంట్‌ను స్కానింగ్‌ చేయించారు. దగ్గరుండి అప్పగించడం వెనుక సీఎంవో ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలను చూస్తే చినజీయర్‌ ట్రస్టుకు భూములు కేటాయించడానికి సీఎం యాదాద్రి పర్యటనకు వచ్చినట్టు అర్ధమవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఎకరానికి రూ.4.50లక్షల నష్టం..
జీయర్‌ ఇంటిగ్రేటేడ్‌ వేదిక్‌ అకాడమీ(జీవా) ముఖ్యప్రేరక్‌ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామన్నారయణ రామోజు చిన జీయర్‌ స్వామి పేరిట వైటీడీఏ అధికారులు ఎకరానికి రూ.4.50లక్షల నష్టం భరిస్తూ 2.30 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. 2014లో దేవస్థానం అభివృద్ధి పేరిట భూసేకరణ చేశారు. సర్వే నెంబర్‌ 172/అ నుంచి 172/లు వరకు మొత్తం 13 మంది రైతుల నుంచి 19.28 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరానికి రూ.10.50లక్షల చొప్పున ఈ సర్వే నెంబర్‌లోని రైతులకు చెల్లించారు. ఇదే భూమిని వైటీడీఏ అధికారులు ఎకరానికి రూ.6లక్షల చొప్పున చినజీయర్‌ ట్రస్టుకు కట్టబెట్టారు. దీనివల్ల వైటీడీఏకు ఎకరానికి రూ.4.50లక్షల చొప్పున మొత్తంగా రూ.12లక్షల37వేల ఐదువందల నష్టం వాటిల్లింది.
సీపీఐ(ఎం) బృందం పరిశీలన..
చినజీయర్‌ ట్రస్టుకు కేటాయించిన యాదాద్రి భూములను సీపీఐ(ఎం) జిల్లా బృందం గురువారం పరిశీలించింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ మాట్లాడుతూ ఆధ్మాతిక ముసుగులో సాగుతున్న భూదందాను అరికట్టేందుకు అన్ని పార్టీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యాదాద్రికి వచ్చిన సీఎం 8గంటల పాటు నిర్వహించిన రహస్య సమావేశం వెనుక యాదాద్రి భూముల విక్రయం దాగి ఉందన్న విషయం అర్ధమవుతున్నదన్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం సేకరించిన భూములను అందుకోసమే ఉపయోగించాలనీ, ఆధ్యాత్మిక ముసుగులో కార్పొరేట్‌ అధిపతులకు విక్రయిస్తే సహించబోమన్నారు. తక్షణమే చిన్నజీయర్‌కు విక్రయించిన భూములను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయన వెంట పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేముల మహేందర్‌, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ ఉన్నారు.

Courtesy Navatelangana…