-లాక్‌డౌన్‌ దెబ్బకు ఆగిన ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజనం
– మూడోవంతుకు పడిపోయిన పథకాల అమలు
– గోడౌన్లలో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు
– సరుకు రవాణాపై సరైన ప్రణాళిక లేకపోవటం వల్లే : రాజకీయ విశ్లేషకులు
– 14కోట్లమంది పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం

దేశవ్యాప్తంగా గోడౌన్లలో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయి. వీటిని సమీకృత బాలల అభివృద్ధి పథకం, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలకు సరఫరా చేయాలి. తద్వారా మనదేశంలోని పేదలు, అణగారిన వర్గాల పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుంది. 1నుంచి 8వ తరగతి చదువుకునే దాదాపు 12కోట్లమంది లబ్దిపొందుతున్నారు. అయితే మార్చి 24న కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఈ వ్యవస్థలన్నీ తారుమారయ్యాయి. కోట్లాదిమంది బాలలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. వివిధ పథకాల్లో ఆహారధాన్యాల వినియోగం మూడోవంతుకు పడిపోయిందని సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి.

న్యూఢిల్లీ : ఎలాంటి ప్రణాళిక లేకుండా, హఠాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌ దేశంలోని పేదలు, అణగారిన వర్గాల పిల్లలకు పౌష్టికాహారాన్ని దూరం చేసింది. ఐసీడీఎస్‌(సమీకృత బాలల అభివృద్ధి పథకం), మధ్యాహ్న భోజనం…పథకాల కింద అమలుజేయాల్సిన అనేక కార్యక్రమాలు నిలిచిపో యాయి. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. కేటాయింపులు ఉన్నప్పటికీ ఆహార ధాన్యాల్ని గమ్యానికి చేర్చడంపై కేంద్రం దృష్టిసారించ లేదని, సరుకు రవాణాకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు చిన్న ప్రయత్నం కూడా జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు నెలల్లో (ఏప్రిల్‌, మే) చోటుచేసుకున్న అనూహ్య పరిణామలు 12కోట్లమంది బాలలపై దుష్ప్రభావం చూపింది. వారికి పౌష్టికాహారాన్ని దూరం చేసింది. గర్భిణీ స్త్రీలు, ప్రసవ మహిళలు, బాలలకు సంబం ధించి వివిధ ప్రభుత్వ పథకాలు నిలిచిపోయాన్న సంగతి… ‘ఆహార ధాన్యాల సరఫరా, ప్రజా పంపిణీ’ కి సంబంధించి కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలే చెబుతున్నాయి.

లోపం ఎక్కడ..?
ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీలకు ఆహార ధాన్యాల సరఫరా కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే హఠాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయింది. రైల్వేలు ఆగిపోయాయి. రాష్ట్రాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. దీనిపై ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులుగానీ, ఆపైన ఉన్న కేంద్ర మంత్రులుగానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పథకాల అమలులో కీలకపాత్ర పోషించే అంగన్‌వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు సర్వేలు, క్వారంటైన్‌ల నిర్వహణ..మొదలైన పనులు అప్పజెప్పారు. ఒక్క కేరళలో మాత్రం అంగన్‌వాడీ కార్యకర్తలను లబ్దిదారుల ఇంటికి పంపి ఆహార ధాన్యాల్ని అందజేశారు. ఐసీడీఎస్‌ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తపడ్డారు.

మూడోవంతుకు పడిపోయిన వినియోగం
ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకాలు… ప్రపంచంలోనే అతిపెద్ద బాలల పౌష్టికాహార కార్యక్రమాలు. వీటికి ఈ ఏడాది కేటాయించిన ఆహార ధాన్యాలు లాక్‌డౌన్‌ కారణంగా చేరలేదు. బియ్యం, గోధుమలు, ఇతర ముతక ధాన్యాలు గత ఏడాదితో పోల్చితే సగం కూడా సరఫరా కాలేదు. ఒక్క మధ్యాహ్న భోజన పథకం కింద 12 కోట్లమంది బాలలు లబ్దిదారులుగా ఉన్నారు. గత ఏడాది (2019) మార్చి-ఏప్రిల్‌ రెండు నెలల కాలంలో మధ్యాహ్న భోజన పథకానికి 3.35లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వినియోగించగా, ఈ ఏడాది లాక్‌డౌన్‌ వల్ల వినియోగం కేవలం 1.09లక్షల టన్నులకు పడిపోయింది. ఇందులో ఆహార ధాన్యాల వినియోగం మూడోవంతుకు తగ్గింది.

14 కోట్లమంది పిల్లలపై ప్రభావం
అప్పుడే పుట్టిన శిశువు దగ్గర్నుంచి ఆరేండ్ల వయసు పిల్లాడి వరకు పౌష్టికాహారం, ఆరోగ్య సం రక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాల్ని అంగన్‌ వాడీలు నిర్వహిస్తున్నాయి. వీటిద్వారా సుమారుగా 14 కోట్ల మంది పేద కుటుంబాల పిల్లలకు పౌష్టికా హారం అందుతున్నది. అంగన్‌వాడీల ద్వారా గత ఏడాది మార్చి-ఏప్రిల్‌ రెండు నెలల కాలంలో 2.38 లక్షల టన్నుల ఆహార ధాన్యాల వినియోగం జరగగా, ఈ ఏడాది అది కేవలం 97వేల టన్నులకు పడిపో యింది. అలాగే గర్భిణీ, ప్రసవ మహిళలకు పౌష్టికా హార పంపిణీ నిలిచిపోయింది. ఈ గణాంకాల్ని కేం ద్రంలోని ‘ఆహారం, ప్రజా పంపిణీ విభాగాలు’ విడుద లచేసిన నెలవారీ బులెటిన్‌లో పొందుపర్చారు.

పథకాల అమలు నిలిచిపోరాదు..
ఐదేండ్ల లోపున్న శిశువులు, సరైన బరువులేని పిల్లలు, రక్తహీనత సమస్య ఉన్నవారిని దృష్టిలో ఉం చుకొని అంగన్‌వాడీల ద్వారా ఐసీడీఎస్‌ అనేక పథకా ల్ని అమలుజేస్తున్నది. గర్భిణీ స్త్రీలు, ప్రసవ మహిళ లు, శిశువుల్లో పౌష్టికాహార సమస్య తలెత్తకుం డా చూడటమే ఈ పథకాల లక్ష్యం. ఈ కార్యక్రమాలు సజావుగా సాగకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుంది. పేదలు, అణగారిన కుటుంబాల ఆదాయం పడిపో యినవేళ పథకాల అమలు నిలిచిపోరాదని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల సంరక్షణలో విఫలం
ప్రతిఏటా పెరుగుతున్న లైంగిక, భౌతిక దాడులు, మానసికహింస
బాధితులు వందకోట్ల మంది చిన్నారులు: ఐక్యరాజ్యసమితి

న్యూయార్క్‌ : వందకోట్లమంది బాలలు ప్రతిఏటా లైంగిక వేధింపులు, భౌతికదాడులు, మానసికహింస.. మొదలైనవాటికి గురవుతున్నా రని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ఒకటి తేల్చింది. 2017లో జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 40వేలమంది చిన్నారులు బాధితులుగా మిగిలిపోయారని, బాలలపట్ల సంరక్షణ చర్యలు చేపట్టడంలో అనేక దేశాలు విఫలమవుతున్నాయని ‘ప్రివెంటింగ్‌ వాయలెన్స్‌ అగెయినెస్ట్‌ చిల్డ్రన్‌ 2020’నివేదికలో ఐరాస తెలిపింది. ఇందులో పేర్కొన్న మరికొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాలల జనాభా సుమారుగా 200కోట్లు ఉంటే, అందులో సగభాగం (100 కోట్లు) ప్రతిఏటా ఏదో ఒకరక మైన(లైంగిక, భౌతికదాడులు, జాతి వివక్ష, మానసిక హింస.. మొదలైనవి) హింసకు గురవుతున్నారని నివేదిక తెలిపింది. ఈ నివేదిక విడుదల సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గేబ్రియెసెస్‌ మాట్లాడుతూ.. ”బాలలపై హింసను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదు. దీనిని అడ్డుకునేం దుకు మనకు అనేక మార్గాలున్నాయి. ఈ మార్గాల్లో చర్యలు చేపట్టాలని అనేక దేశాల్ని మేం కోరుతున్నాం. చిన్నారుల ఆరోగ్యం, మంచి వాతావ రణంలో పెరగటం…ఇవి రెండూ అత్యంత ప్రధానమైనవి” అని అన్నారు.

లాక్‌డౌన్‌ కూడా ఒక కారణం:హెన్రీటా ఫోరె, యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
అనేక దేశాల్లో లాక్‌డౌన్‌లు అమల్లో ఉన్నాయి. పాఠశాలలు మూసేశారు. ఎక్కడికి కదలనివ్వకుండా పిల్లలపై కఠిన నిబంధనల విధించారు. ఈనేపథ్యంలో అనేకమంది చిన్నారులు తోటివారి నుంచి దూషణలు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో సామాజిక సేవా సంస్థల సహకారంతో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసి రక్షణ చర్యలు తీసుకోవాలి.

Courtesy Nava Telangana