– బాలు

భూమండలం మీద ఏ దేశంలోనైనా, పిల్లలు జాతి సంపద. అంతర్జాతీయంగా నవజాత శిశువుల మరణాల్లో 27 శాతానికి, అయిదేళ్లలోపు పిల్లల మృత్యువాతలో 21 శాతానికి నెలవైన భారత గడ్డపైన బాల్యానిది నిరంతర వ్యధ! ‘కోటా’ విషాద ఉదంతాల పరంపరే అందుకు తాజా రుజువు. ఇటీవలిదాకా రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి లోక్‌సభాపతి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంగా పేరుండేది. నేడది శిశు మరణాలు పెచ్చరిల్లి ప్రజారోగ్య పరిరక్షణలో స్వీయ బాధ్యతకు ప్రభుత్వ యంత్రాంగం తలకొరివి పెడుతున్న కొత్త చిరునామాగా భ్రష్టుపడుతోంది!

రాజస్థాన్‌, కోటాలోని జేకేలాన్‌ ఆస్పత్రికి పరిసర ప్రాంతాల నుంచి అత్యవసర చికిత్సకు పెద్దయెత్తున పిల్లల్ని తరలిస్తుంటారు. అటువంటి చోట ఒక్క    డిసెంబరు నెలలోనే సుమారు వంద మంది శిశువులు అసువులు బాసిన సమాచారం గగ్గోలు పుట్టిస్తోంది. విమర్శలు పెనుదుమారం రేపిన తరుణంలో జాతీయ శిశు హక్కుల సంఘం అక్కడ పర్యటించింది. 2019 సంవత్సరం మొత్తానికి 940 మంది వరకు పిల్లలు ఆ సర్కారీ దవాఖానాలో ప్రాణాలు కోల్పోయారన్న లెక్కలు వెలుగు చూసిందప్పుడే. ఒక గీతను చెరపకుండా చిన్నదిగా చేయడమెలాగో మహబాగా ఒంటపట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆత్మరక్షణలో కొత్తపుంతలు తొక్కింది. గత ఆరేడేళ్లలోనూ ఈ సంఖ్యే చిన్నదంటూ ఒక్క ఏడాదిలోనే అక్కడ 13 వందలు,    14 వందలు, 15 వందల మంది చిన్నపిల్లలు కడతేరిపోయిన ఉదంతాలు నమోదైనప్పుడు నేడు ఇంతగా ఆందోళన చెందాల్సిన పనేముందని స్వయంగా ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ వివరణ దయచేశారు. కొన్నేళ్లుగా అక్కడ ఏటా వెయ్యిమందికి పైగా శిశువుల మరణాలు వరసగా సంభవిస్తుంటే పాలన వ్యవస్థ కరి కళేబరంలా ఎందుకు చచ్చుపడి పోయిందో చెప్పడానికి నేతాగణానికి నోరు పెగలడం లేదు.

జాతీయ శిశు హక్కుల సంఘం పర్యటన పుణ్యమా అని జేకేలాన్‌ ఆస్పత్రి స్థితిగతులు, పరిసర ప్రాంతాల దుస్థితి లోకానికి వెల్లడైంది. శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా నిలిపి ఉంచే వార్మర్లు, నెబ్యులైజర్లు, వెంటిలేటర్లు సహా అత్యంత కీలక వైద్య పరికరాల్లో యాభైశాతానికిపైగా పనిచేసే స్థితిలో లేవని శిశు హక్కుల సంఘం నిగ్గు తేల్చింది. ఆస్పత్రి కిటికీలు, తలుపులు, గేట్లు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రాంగణంలోనే పందులు యథేచ్ఛగా షికారు చేస్తుండటం పరికించి కమిషన్‌ ప్రతినిధులు బిత్తరపోయారు. శిశు మరణాలపై ఆస్పత్రి పెద్దలు ఆదరాబాదరా కొలువుతీర్చిన కమిటీ- ఎక్కడా ఎటువంటి నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు తావేలేదని కొట్టిపారేసింది. వైద్య పరికరాలు భేషుగ్గా పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఏదీ సవ్యంగా లేని దురవస్థ మూలాన పిల్లల ప్రాణాలు పోతేపోయాయి…. ఆస్పత్రి ప్రతిష్ఠకు అణుమాత్రమైనా భంగం వాటిల్లనివ్వరాదన్న విపరీత ఆరాటం ఆ కమిటీ స్పందనలో ప్రస్ఫుటమవుతూనే ఉంది!

గుండెల్ని పిండేసే కథనాలపై తనంత తానుగా స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ తాజాగా నోటీసు జారీ చేసింది. ఏటా సుమారు వెయ్యిమంది నిస్సహాయంగా నేల రాలుతుండటం, వైద్య పరికరాల్లో సగానికిపైగా మొరాయిస్తుండటం నిజమే అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లినట్లేనంటున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ సముఖానికి గెహ్లోత్‌ సర్కారు ఏమేమి వివరాలు నివేదిస్తుందో చూడాలి. కమిటీ పేరిట ఆస్పత్రి వర్గాలు విమర్శకుల ఆరోపణలన్నీ వట్టి ఆసత్యాలుగా ఎంత దబాయించ చూసినా- ఈ బాగోతం మూసిపెడితే మాసిపోతుందా?

మొన్నీ మధ్య బిహార్‌లో ఎన్‌కెఫలైటిస్‌ విజృంభణ, యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిన ఘటనలు వందలాది కుటుంబాల్ని శోకసముద్రంలో ముంచేసి ప్రభుత్వ చికిత్సాలయాల దుస్సహ పరిస్థితుల్ని పతాక శీర్షికలకు ఎక్కించాయి. జన వ్యవహారంలో మెదడువాపు వ్యాధిగా చలామణీలో ఉన్న ఏఈఎస్‌ (ఎక్యూట్‌ ఎన్‌కెఫలైటిస్‌ సిండ్రోమ్‌) తొలుత ముజఫర్‌పూర్‌ ప్రాంతానికే పరిమితమైనా, ఆరు నెలలక్రితం అది బిహార్‌లోని 18 జిల్లాలకు విస్తరించి ఎందరో తల్లిదండ్రులకు గర్భశోకం రగిలించింది. పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా ఆస్పత్రుల వాస్తవిక స్థితిగతులు చెక్కుచెదరని దురవస్థే ఇప్పుడు రాజస్థాన్‌లోనూ కళ్లకు కడుతోంది.

సుమారు నాలుగేళ్లక్రితం ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేలా రాష్ట్రాలు తమ వ్యూహాలకు పదును పెట్టాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పిలుపిచ్చింది. అప్పుడే కన్ను తెరిచిన బిడ్డ పిడికిళ్లు విప్పకుండానే కుళ్లు లోకంలో ఇమడలేనంటూ అమ్మానాన్నల్ని హతాశుల్ని చేస్తున్న విషాద ఘట్టాలు నిలిచిపోయాయా? లేనేలేదు! మౌలిక వసతులు, పరికరాలు, అత్యవసర ఔషధాలు, వైద్య సిబ్బంది… అన్నింటికీ కొరత వెక్కిరిస్తున్న ఆస్పత్రులు నవజాత శిశువులకు, ప్రాణాలమీదకొచ్చి శరణుజొచ్చిన చిన్నపిల్లలకు బలిపీఠాలవుతున్న దుస్థితి ఏ ఒక్క నగరానికో, రాష్ట్రానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. పోషకాహార లోపాలు, నెలలు నిండకముందే కాన్పులు, రక్తహీనత, అత్యవసర సేవల విషయంలో ఘోరవైఫల్యాలు చికిత్సాలయాల్లో మానవ హక్కుల్ని క్రూరంగా చిదిమేస్తున్నాయి. ఆ మధ్య కేంద్రమే అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం- బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోమ్‌లకు చెందిన 115 జిల్లాల్లోనే 50 శాతం శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రేపటి తరాన్ని కాపాడుకోవడంలో ఇది కచ్చితంగా జాతీయ వైఫల్యమే. వైద్యసేవల నాణ్యత, వాసిలో చైనాతో పాటు శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌ల సరసనా భారత్‌ వెలాతెలాపోవడం ఇంతటి సువిశాల దేశానికే తలవంపులు. ప్రభుత్వాల ప్రాథమ్య క్రమంలో జనారోగ్య రక్షణ అట్టడుగుకు పడిపోతే సర్కారీ వైద్యం కరి మింగిన వెలగపండు కాకుండా ఉంటుందా?

దేశంలో మహిళలు, శిశువుల సముద్ధరణకంటూ ‘జాతీయ ఆరోగ్య మిషన్‌’ ఏర్పాటైంది. దానికింద ఎంతో చేస్తున్నామనడంలో ఔచిత్యం ఏమిటని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ని గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిగ్గదీసింది. లెక్కకుమిక్కిలి గ్రామీణ ఆరోగ్య మిషన్లు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల స్వస్థ సలహాలు, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు… ఏదీ ఎక్కడా సక్రమంగా సంతృప్తికరంగా లేని వైనం అడుగడుగునా ప్రస్ఫుటమవుతోంది. నగరాల్లోకన్నా పల్లెల్లో బతికి బట్టకట్టే పిల్లల సంఖ్య తక్కువని, బాలలతో పోలిస్తే బాలికలు మృత్యువాత పడే అవకాశం రెట్టింపు అని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. దేశం నలుమూలలా వైద్యులు, నర్సులు, మంత్రసానులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది అందరిలో 54 శాతందాకా సరైన అర్హతలు లేనివారేనన్నది ఇటీవలి అధ్యయన నివేదిక సారాంశం. కోటా, గోరఖ్‌పూర్‌, ముజఫర్‌పూర్‌ తరహా బాగోతాలు వెలుగు చూసినప్పుడు కమిటీల ఏర్పాటు, విచారణానంతరం చర్యలపై భరోసా ప్రకటనలతోనే పరిస్థితి కుదుటపడదు. తగినంతమంది వైద్య సిబ్బంది నియామకాలు, ఆస్పత్రి పడకల విస్తరణతోపాటు మౌలిక వసతుల పరిపుష్టీకరణ, సమధికంగా ఆరోగ్య నిధుల కేటాయింపులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ చికిత్సాలయాల వరకు ప్రతి అంచెలోనూ జవాబుదారీతనం… జరూరుగా కావాలిప్పుడు. మార్పు ఎందమావిని తలపిస్తున్నంతకాలం శిశుమరణాల ఉరవడికి భారత్‌ చెరగని చిరునామాగా చలామణీ కావడానికి ఢోకాలేదు, ఉండదు. ఏమంటారు?

(Courtesy Eenadu)