న్యూఢిల్లీ : ఐదేళ్లలోపు పిల్లలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కరోనా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్‌-19 విజృంభణతో తలెత్తిన సామాజిక ఆర్థిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా 67 లక్షల మంది చిన్నారులు బక్కచిక్కిపోయే ప్రమాదమున్నదని యునిసెఫ్‌ హెచ్చరించింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే, ఎదుగుదల సమస్యతో బాధపడుతున్న పిల్లల సంఖ్య అంతర్జాతీయంగా ఏడాదిలో దాదాపు 5.4 కోట్లకు చేరుకుంటుందని అని పేర్కొంది.

మన దేశంలోని ఐదేళ్ల లోపు చిన్నారుల్లో రెండు కోట్ల మంది ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నారని యునిసెఫ్‌ వెల్లడించింది. ఏడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి పిల్లలకు ప్రధాన ముప్పుగా పరిణమించిందని యునిసెఫ్‌ ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ అభిప్రాయపడ్డారు.

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2019 ప్రకారం.. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 2008-12లో 16.5 శాతంగా ఉంది. 2014-18లో ఈ సంఖ్య 20.8 శాతానికి పెరగడం ఆందోళన కలిస్తోంది. గతేడాదిలో ప్రపంచవ్యాప్తంగా 4.7 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం బయటపడింది.