గృహహింస, వరకట్న వేధింపుల తర్వాత పిల్లలపై అఘాయిత్యాలే అధికం
మహిళా సహాయ కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నదిదే

హైదరాబాద్‌: కామాంధుల కబంధ హస్తాల్లో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. మాయమాటలు చెప్పి, బహుమతులు ఆశగా చూపించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడిస్తున్నట్లు నటిస్తూ శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆపదలోని మహిళలకు సత్వర సహాయం చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సహాయ కేంద్రాన్ని (181 నంబరును) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి రోజూ దాదాపు 800కి పైగా కాల్స్‌ వస్తున్నాయి. ఈ కేసులను పరిశీలించి సత్వర సహాయం కోసం సంబంధిత విభాగాలను అప్రమత్తం చేస్తోంది. బాధితులకు సఖి కేంద్రాల్లో తాత్కాలిక వసతి కల్పిస్తోంది. ఫిర్యాదు తీవ్రత ఆధారంగా కేసులు నమోదు అవుతున్నాయి.

మూడు నెలల్లో పెరిగిన కేసులు…

మహిళా హెల్ప్‌లైన్‌ 2017 డిసెంబరులో ప్రారంభమైంది. రెండేళ్లలో సహాయం కోరుతూ దాదాపు 6 లక్షల కాల్స్‌ వచ్చాయి. ఇటీవల కేసుల సంఖ్య పెరిగింది. మూడు నెలల క్రితం 9,526 కేసులు ఉంటే… ఇప్పుడు ఆ సంఖ్య 11,259కి పెరిగింది. ఇందులో గృహ హింస కేసులు, వరకట్న వేధింపులు ఎక్కువ. సాధారణంగా ఇలాంటి కేసులు ఎప్పుడూ ఎక్కువే. దీని తర్వాత చిన్నారులపై అఘాయిత్యాలు, అత్యాచారాలు అధికం. రెండేళ్లలో రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల కేసులు 250 ఉంటే మహిళలపై అత్యాచార ఘటనలు 235 నమోదయ్యాయి.

Courtesy Eenadu