ప్రమాదకరంగా మారిన ఎండ వేడి
వలస కుటుంబాల్లోని చిన్నారుల పరిస్థితి

హైదరాబాద్‌: ‘40 డిగ్రీల సెల్సియస్‌ ఎండ. వడగాడ్పులు. ఇళ్లలో ఉన్నవారే వేడికి అల్లాడి పోతుండగా.. సొంత రాష్ట్రాలకు బయలుదేరిన వలస కూలీల కుటుంబాల్లోని చిన్నారులు రహదారులపై డస్సి పోతున్నారు. పలు జిల్లాలు, నగరం నుంచి సొంత రాష్ట్రాలకు తరలిపోతున్న వలస జీవులకు వారి పిల్లల రక్షణ సవాలుగా మారింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపైకి (మేడ్చల్‌, కండ్లకోయ కూడళ్లకు) వచ్చిన కుటుంబాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

కొందరిని ఫంక్షన్‌హాళ్లకు తరలించగా మరికొందరు లారీల్లో తరలిపోయారు. వాహనాలను పోలీసులు మధ్యలో ఆపేస్తుండటం, కూలీలను పంక్షన్‌ హాళ్లకు తరలిస్తుండటంతో చిన్నారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. త్వరగా తమ రాష్ట్రాలకు చేరుకునేలా సహకరించాలంటూ చిన్నారుల తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు కూలీలు ఉమ్మడిగా ఒక్కో లారీకి రూ.1.30 లక్షల వరకు చెల్లించి.. సొంతూళ్లకు బయలుదేరుతున్నారు.

Courtesy Eenadu