– ఐదేండ్లలోపు చిన్నారుల్లో 68శాతానికి పైగా మరణాలు
– బీహార్‌లో అత్యధికం..
– కేరళలో అత్యల్పం : ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

న్యూఢిల్లీ : భారతదేశంలో పౌష్టికాహార లోపం ఆందోళన కలిగిస్తున్నది. మరీ ముఖ్యంగా దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఇది ప్రధాన సమస్యగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం కారణంగానే దేశంలో ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు 68శాతానికి పైగా నమోదయ్యాయి. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ కారణంతో మరణించిన చిన్నారుల సంఖ్య ఇక్కడే అధికంగా నమోదయ్యాయి. ఇందులో బీహార్‌ దారుణంగా ఉన్నది. తర్వాతి స్థానాల్లో అసోం, రాజస్తాన్‌, యూపీ లు ఉన్నాయి. ఇక ఈ విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళ మెరుగ్గా ఉన్నది. చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి సంబంధించి 1990 నుంచి 2017 మధ్య గల సమాచార నివేదికను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) తాజాగా విడుదల చేసింది. ఇందులో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటీష్‌ మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ లో దీనిని ప్రచురించారు. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య కారణంగా ఐదేండ్లలోపు చిన్నారుల్లో 68.2శాతం మరణాలు (7,06,000 మంది మరణించారు) సంభవించాయి. పౌష్టికాహార లోపంతో ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలు బీహార్‌లో అత్యధికంగా 72.2శాతంగా నమోదయ్యాయి. ఇక తర్వాతి స్థానాల్లో అసోం, రాజస్తాన్‌, యూపీ, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. కాగా, ఈ సమస్య కేరళలో తక్కువగా ఉండటం గమనార్హం. కేరళ తర్వాతి స్థానాల్లో మేఘాలయా, తమిళనాడు, మిజోరం, గోవా రాష్ట్రాలున్నాయి. అలాగే దేశంలో 17.3శాతం డిజెబులిటీ-అడ్జెస్టెడ్‌ లైఫ్‌ ఇయర్స్‌(డీఏఎల్‌వై) రేటు నమోదైంది. చిన్నారుల్లో పౌష్టికాహారానికి కారణమయ్యే డీఏఎల్‌వై రేటు అధికంగా యూపీలో ఉన్నది. తర్వాతి స్థానాల్లో బీహార్‌, అసోం, రాజస్థాన్‌లు ఉన్నాయి. ఈ విషయంలోనూ కేరళలో సమస్య తక్కువగా ఉన్నది.
పౌష్టికాహారం లోపం కారణంగా దేశంలో శిశువులు తక్కువ బరువుతో జన్మించడం ఆందోళనగా తయారయింది. 2017లో దేశంలో తక్కువ బరువుతో జన్మించిన శిశువులు 21.4శాతంగా ఉన్నారు. దేశంలో చిన్నారుల మరణాలకు ఇదే ప్రధాన కారణంగా మారింది. ఇక 2017లో.. పెరుగదల లోపించిన చిన్నారులు 39శాతం, తక్కువ బరువుగల చిన్నారులు 33శాతం, రక్తహీనత కలిగిన చిన్నారులు 63శాతంగా ఉన్నారు. ఇక మహిళల్లో రక్తహీనత సమస్య 54శాతంగా నమోదైంది. అధిక బరువుతో ఉన్న చిన్నారులు 12శాతంగా ఉన్నారు. 1990-2017 మధ్య ఇది ఐదు శాతం పెరగడం గమనార్హం.

Courtesy NavaTelangana..