పసికందును వదిలించుకున్న అమ్మ..
కన్న బిడ్డను అమ్మజూపిన మరో తల్లి
మహిళా దినోత్సవం రోజే చలింపజేసిన ఘటనలు

వికారాబాద్‌, పెద్దశంకరంపేట, మార్చి: పుట్టిన కొన్ని గంటల్లోనే ఓ శిశువును ముళ్ల పొదల్లో పడేసింది ఓ అమ్మ! మరోచోట.. నెలన్నర వయస్సున్న  తన బిడ్డను అమ్మకానికి పెట్టిందో తల్లి. మహిళా దినోత్సవం రోజు ఈఘటనలు వెలుగుచూశాయి.వికారాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి ప్రక్కన ముళ్లపొదల్లో ఆదివారం మధ్యాహ్నం నవజాత మగశిశువును మారుతీనగర్‌ బీసీ హాస్టల్‌ విద్యార్థులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారమిచ్చి శిశువును బయటకు తీసుకొచ్చారు. ఆ శిశువును పోలీసులు వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ శాంతప్ప వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు.

చైల్డ్‌లైన్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. శిశువు బరువు కిలోన్నర మాత్రమే ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, శిశువును పట్టణంలోని శిశుగృహలో ఉంచుతామని ఎస్సై లక్ష్మయ్య తెలిపారు. మెదక్‌ జిల్లా  పాపన్నపేటకు చెందిన సుశీల అనే మహిళ నెలన్నర వయసున్న తన బిడ్డను అమ్మేందుకు ప్రయత్నించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఆమెను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. తనకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, భర్త ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఉన్నాడని సుశీల తెలిపింది. సుశీల మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. ఆమె పిల్లలను  పాపన్నపేట ఐసీడీఎస్‌  అధికారులకు  అప్పగించారు. ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని పాపన్నపేట ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తెలిపారు.

Courtesy Andhrajyothi