Image result for విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించిన సుబ్రమణియన్‌"ఆధునిక పరిజ్ఞానం లేకుండానే విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించిన సుబ్రమణియన్‌
రెండు ల్యాప్‌టాప్‌లు, నిశిత పరిశీలనే ఉపకరణాలు

చెన్నై: నిత్యం గంటల తరబడి క్షుణ్నంగా డేటా విశ్లేషణ.. అర్ధరాత్రి వరకూ కసరత్తు.. అమెరికా రోదసి సంస్థ (నాసా), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన దిగ్గజ శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేక పోయిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడను జాబిల్లిపై కనుక్కోవడానికి చెన్నై యువకుడు సుబ్రమణియన్‌ సాగించిన కఠోర శ్రమ ఇది. నిజానికి ఆయనకు ఇస్రోతో కానీ నాసాతో కానీ సంబంధం లేదు. ఆయన బంధువుల్లోనూ ఎవరికీ ఆ రంగంతో పరిచయం లేదు. అయితే విక్రమ్‌ జాడ కనిపించకపోవడం ఆయనను బాధించింది. సవాల్‌గా తీసుకొని దానిపై పట్టుదలగా అధ్యయనం మొదలుపెట్టారు. ఇందుకోసం ఎలాంటి అధునాతన పరిజ్ఞానాన్ని కానీ సాధనాలను కానీ ఆయన ఉపయోగించలేదు. రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌ సాయంతోనే ఈ ఘనత సాధించారు. మూడు వారాల పాటు నాసా విడుదల చేసిన గిగాబైట్ల కొద్దీ చిత్రాలను ఓపిగ్గా ఆయన పరిశీలించారు. విక్రమ్‌ కూలడానికి ముందు, ఆ తర్వాత చిత్రాలను లాప్‌టాప్‌లపై పోల్చి చూశారు.

అదే ధ్యాసగా..
ఒక ఐటీ సంస్థలో పనిచేసే సుబ్రమణియన్‌.. రోజూ ఆఫీసు నుంచి వచ్చాక రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ డేటాను విశ్లేషించేవారు. ఉదయం మళ్లీ 8 గంటల నుంచి 10 గంటల వరకూ అదే పనిలో నిమగ్నమయ్యేవారు. మొదట ఒక శకల ప్రదేశాన్ని గుర్తించిన ఆయన.. వ్యోమనౌక కూలిన ప్రదేశం అదేనన్న నిర్ధరణకు వచ్చారు. అయితే దీనిపై నాసాకు ఈమెయిల్‌ పంపడానికి ముందు ఒకటికి రెండు సార్లు దాన్ని ధ్రువపరచుకున్నారు.

సుబ్రమణియన్‌ స్వస్థలం తమిళనాడులోని మదురై. నిజానికి ఒక మెకానికల్‌ ఇంజినీర్‌. యాప్‌ డెవలపర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష రంగంపై ఆయనకు అమితాసక్తి. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలను చాలా ఆసక్తిగా పరిశీలించేవాడనని ఆయన చెప్పారు. అందువల్లే విక్రమ్‌ అన్వేషణ కసరత్తును చేపట్టిన్నారు. మెకానికల్‌ ఇంజినీర్‌ కావడం వల్ల రాకెట్‌ సైన్స్‌లో ఆయనకు కొంత ప్రవేశం ఉంది. ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినప్పుడు దాని వేగం, ఎత్తు వంటి వివరాల ఆధారంగా కొన్ని లెక్కలు కట్టి, అది దిగాల్సిన ప్రదేశాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఫొటోల్లో జల్లెడ పట్టారు. లక్షిత ప్రదేశానికి కిలోమీటరు దూరంలో మార్పులను గమనించి, విక్రమ్‌ కూలిన ప్రదేశాన్ని కనుగొన్నారు.

(Courtesy Eenadu)