హర్షమందర్‌పై చార్జీషీట్‌ను ఖండించిన పౌరసమాజం

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ రాజధానిలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ప్రముఖ సామాజిక, హక్కుల కార్యకర్త హర్షమందర్‌ పేరును చార్జీషీటులో చేర్చడాన్ని పౌర సమాజం ఖండించింది. ఇది ‘ప్రేరేపిత, దురుద్దేశపూరితమైన కేసు విచారణ’ అంటూ తీవ్రంగా మండిపడింది. చార్జీషీటు నుంచి తక్షణమే ఆయన పేరును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. హర్షమందర్‌కు సంఘీభావంగా పలువరు విద్యావేత్తలు, హక్కుల కార్యకర్తలు, మేధావులు, నటులు బహిరంగ లేఖ విడుదల చేశారు.గాంధేయవాది అయిన హర్షమందర్‌.. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో చేసిన ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉన్నదనీ, ఇదే అల్లర్లకు దారి తీసిందని ఆరోపిస్తూ పోలీసులు ఆయన పేరును చార్జీషీటులో చేర్చారు. అయితే ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయనీ, అందులో ఆయన రాజ్యాంగ హక్కులు, అహింస గురించి మాట్లాడారే తప్ప హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలేమీ చేయలేదని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. కావాలంటే అందుకు సంబంధించిన వివరాలను పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. అయితే పలువురు బీజేపీ నాయకులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కొద్దిరోజుల క్రితం హర్షమందర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం చార్జీషీటులో ఆయన పేరును చేర్చడం గమనార్హం.

Courtesy Nava Telangana