-విద్యా హక్కు చట్టం కింద ఉచిత విద్య అందించే నిబంధనకు చెల్లుచీటీ?
-ఆవాసాలకు పాఠశాలల దూరం నిబంధన మార్పుకు విద్యాశాఖ ప్రతిపాదన

హైదరాబాద్‌
విద్యాహక్కు చట్టంలో పాఠశాల దూరం నిబంధనలో మార్పు చేయాలన్న విద్యాశాఖ తాజా ప్రతిపాదన అమలైతే ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు ఇక అటకెక్కినట్లే. ప్రస్తుతం ఉన్న ఈ నిబంధనను అమలు చేయాలని ఎవరూ న్యాయస్థానాలు ఆశ్రయించకుండా విద్యాహక్కు చట్టం జీఓలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీని ఫలితంగా సర్కారు బడులు అందుబాటులో లేకుంటేనే ప్రైవేట్‌ పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు.

ప్రస్తుత నిబంధన
విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్‌ 12(సి) ప్రకారం అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో(ప్రైవేట్‌) 1వ తరగతిలో ఉన్న సీట్లలో 25 శాతం సీట్లను పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు, ప్రతికూల సమూహాల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం పాఠశాలలకు చెల్లించాలి. విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జారీ చేసిన జీఓ 20 ప్రకారం విద్యార్థులుండే ఆవాసానికి కిలోమీటరు దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ.లోపు ప్రాథమికోన్నత, 5 కి.మీ.లోపు ఉన్నత పాఠశాల ఉండాలన్నది నిబంధన. ఒకవేళ ఆ దూరంలో ప్రభుత్వ పాఠశాలలున్నా పరిసర ప్రాంతంలోని ప్రైవేట్‌ బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడగవచ్చు. దీనిపై ఇప్పటికీ ఒకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మార్పు ఇదీ…
పట్టణ, నగర ప్రాంతాల్లో 1, 3, 5 కిలోమీటర్ల నిబంధన తొలగించి 5 కిలోమీటర్ల పరిధిలో ఒక పాఠశాల ఉండేలా జీఓ 20కి సవరణ చేయాలని విద్యాశాఖ ఆలోచన. నగర ప్రాంతవాసులు ఎవరైనా తమ పిల్లలకు ప్రైవేట్‌లో సీటు ఇప్పించాలని న్యాయస్థానానికి వెళితే…చట్టంలోని నిబంధన వర్తింపజేయాలి. ప్రస్తుతం ఉన్న ఆవాస దూరం ప్రకారం కొన్ని చోట్ల సర్కారు బడులు లేవు. ఉన్న చోటే ఒకటికి మించి ఉన్నాయి. అందుకే 5 కిలోమీటర్ల దూరంలోపు ప్రభుత్వ పాఠశాల లేకుంటేనే నిబంధన వర్తించేలా విద్యాశాఖ రంగం సిద్ధంచేస్తోంది.

కర్ణాటక బాటలో…
ప్రైవేట్‌ బడుల్లో 25 శాతం సీట్ల నిబంధన అమలు చేయాలని కర్ణాటకలో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మార్చుకుంది. సర్కారు బడులు అందుబాటులో ఉంటే ప్రైవేట్‌ బడుల్లో 25 శాతం సీట్ల నిబంధన వర్తించదని నిబంధనలను సవరించుకుంది. అదే ప్రకారం ఇక్కడా మార్చుకునే ఉద్దేశంతో దూరం నిబంధనను 5 కిలోమీటర్లుగా మారుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 1,3,5 కి.మీ. దూరాల్లో పాఠశాలలున్నాయి. అందువల్ల సమస్య లేదు.

Courtesy Eenadu..