సజావుగా సాగుతున్న ప్రాజెక్టు పనులు
  గగన్‌యాన్‌ కోసం వాయుసేన నుంచి నలుగురి ఎంపిక
రష్యాలో త్వరలోనే వారికి శిక్షణ ప్రారంభం
ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వెల్లడి
బెంగళూరు

పట్టు వదలని విక్రమార్కుడిలా జాబిల్లిపైకి మరో యాత్ర చేపట్టేందుకు భారత్‌ సన్నద్ధమవుతోంది. ‘చంద్రయాన్‌-3’గా పిలిచే ఈ నూతన ప్రాజెక్టును వచ్చే ఏడాది చేపట్టే అవకాశాలున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. సంబంధిత పనులు సజావుగా సాగుతున్నట్లు తెలిపింది. బెంగళూరులో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. ‘చంద్రయాన్‌-3’ని 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం వెల్లడించిన సంగతి గమనార్హం.

చంద్రయాన్‌-3లో ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ వ్యవస్థ ఉంటాయని శివన్‌ తెలిపారు. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ ఏడేళ్లపాటు పనిచేస్తుందని, కొత్త ప్రాజెక్టుకూ దాని సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.615 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వేగ నియంత్రణలో వైఫల్యం కారణంగా చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై విజయవంతంగా దిగలేకపోయిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం వల్లే కూలిన ల్యాండర్‌ చిత్రాలను తాము విడుదల చేయలేదన్నారు. విక్రమ్‌ జాడను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన చెన్నైకి చెందిన ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణ్యన్‌ను శివన్‌ అభినందించారు. 2020లో మొత్తం 25 మిషన్లను చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

నావిక్‌ఈ ఏడాదే
‘చంద్రయాన్‌-3’తోపాటే ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టు పనులనూ ఏకకాలంలో పూర్తిచేస్తున్నట్లు శివన్‌ చెప్పారు. గగన్‌యాన్‌ కోసం వాయుసేనకు చెందిన నలుగురు పురుషులను ఎంపిక చేశామని, రష్యాలో ఈ నెల 3వ వారం నుంచి వారికి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రత్యేక జీపీఎస్‌ వ్యవస్థతో కూడిన ‘ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ (నావిక్‌)ను ఈ ఏడాదే ఆవిష్కరిస్తామని చెప్పారు. గత ఏడాది ప్రణాళికకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రయోగాలను ఈ ఏడాది మార్చిలోగా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు.

తూత్తుకుడిలో వేగంగా భూ సేకరణ
తమిళనాడులోని తూత్తుకుడిలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటు కోసం 2,300 ఎకరాల భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయని శివన్‌ వెల్లడించారు. తక్కువ వ్యయంతో రూపొందించే బుల్లి ఉపగ్రహ వాహక నౌకలను తొలి దశలో అక్కడి నుంచి ప్రయోగిస్తామని, తర్వాత భారీ వాహకనౌకల ప్రయోగాలకూ విస్తరిస్తామని తెలిపారు.

(Courtesy Eenadu)