తాత కంటే మనవడి ఆస్తి విలువే ఎక్కువ

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్‌ ఎక్కువ ఆస్తిపరుడు. చంద్రబాబు ఆస్తులతో పోలిస్తే మనవడి ఆస్తుల విలువ రూ.15.55 కోట్లు ఎక్కువ. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువను ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గురువారం ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో ఆయన తమ కుటుంబసభ్యులు ఐదుగురితో పాటు, తమ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్‌ ఆస్తుల వివరాలు తెలిపారు. ఈ వివరాలన్నీ ఆయా ఆస్తుల్ని తాము కొన్నప్పుడు, పెట్టుబడులు పెట్టినప్పుడు ఉన్న విలువలని లోకేశ్‌ తెలిపారు. చంద్రబాబు కుటుంబం ఆస్తి విలువ రూ.88.67 కోట్ల నుంచి 102.49 కోట్లకు.. అంటే రూ.13.82 కోట్లు పెరిగింది. కుటుంబంలో తక్కువ ఆస్తి ఉన్నది చంద్రబాబుకే. మొదటిస్థానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, రెండోస్థానంలో దేవాన్ష్‌ ఉన్నారు. చంద్రబాబు కుటుంబం ఆస్తుల్ని ప్రకటించడం ఇది వరుసగా తొమ్మిదోసారి.

ఆయన కారు అంబాసిడరే..!
 ఇప్పటికీ చంద్రబాబు పేరుమీద ఉన్న కారు అంబాసిడర్‌ ఒక్కటే. దాన్ని 1993-94లో కొన్నారు. విలువ 1.52 లక్షలు.
 సేవింగ్స్‌ ఖాతాలో, నగదు రూపంలో కలిపి రూ.74.10 లక్షలు ఉంది.
 జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.65లో 1125 గజాల్లో చంద్రబాబు, లోకేశ్‌ కలిసి నిర్మించిన ఇంటి విలువ రూ.8,01,36,000
 2019లో చంద్రబాబు సేవింగ్స్‌ ఖాతాల్లోని నగదు రూ.70 లక్షలు పెరిగింది. బ్యాంకు రుణం రూ.18 లక్షలు తగ్గింది.
మొత్తం ఆస్తి రూ.9 కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు. నికర ఆస్తి రూ.3.87 కోట్లు.

భువనేశ్వరి వద్ద 3.5 కిలోల బంగారం
 భువనేశ్వరి వద్ద విలువైన రాళ్లు పొదిగిన 3,519 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1,27,16,000.
 రూ.8.97 లక్షల విలువైన 42.41 కిలోల వెండి ఉంది.
 హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 1,06,61,652 షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.19,95,49,000.
 పీఎఫ్‌ ఖాతాలో రూ.40 లక్షలు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.1.30 లక్షలు పెరిగాయి.
మొత్తం ఆస్తులు రూ.50.62 కో ట్లు, అప్పులు రూ.11.04 కోట్లు. నికర ఆస్తులు 39.58 కోట్లు.

లోకేశ్‌కు రెండు బుల్లెట్‌ఫ్రూఫ్‌ కార్లు
 జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.65లో 1285 గజాల్లో తండ్రితో కలసి నిర్మించిన ఇంటి విలువ రూ.10.35 కోట్లు.
 హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 47,32,800 షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.2.52 కోట్లు.
 ఒక ఫోర్డు ఫియెస్టా, 2బుల్లెట్‌ప్రూఫ్‌ ఫార్చూన ర్‌ కార్లు ఉన్నాయి. విలువరూ.92.49 లక్షలు.
 మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు, అప్పులు రూ.5.70 కోట్లు.నికర ఆస్తులు రూ.19 కోట్లు.
లోకేశ్‌కి మదీనాగూడ గ్రామపరిధిలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అది అమ్మమ్మ నుంచి బహుమతిగా వచ్చింది. దాని విలువ పేర్కొనలేదు.

బ్రాహ్మణికి 2.5 కిలోల బంగారం
 మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ జాగీరు గ్రామాల్లో స్థలాలున్నాయి
 హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 2,02,000 షేర్లు ఉన్నాయి. వాటి విలువ రూ.78.51 లక్షలు.
 నిర్వాణ హోల్డింగ్స్‌లో 1.62 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. లోకేశ్‌ తన పేరుమీద ఉన్న షేర్లను గతేడాది బహుమతిగా ఇచ్చారు.
 310.06 క్యారెట్ల విలువైన రాళ్లు, 2,591.34 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.15.95 లక్షలు.
మొత్తం ఆస్తుల విలువ రూ.15.68 కోట్లు. అప్పులు రూ.4.17 కోట్లు. నికర ఆస్తులు రూ.11.51 కోట్లు.

దేవాన్ష్‌కి బాలకృష్ణ బహుమతి
 తాత బాలకృష్ణ హెరిటేజ్‌ ఫుడ్స్‌లోని 26,440 షేర్లు దేవాన్ష్‌కి బహుమతిగా ఇచ్చారు. దాని విలువ ప్రకటించలేదు.
 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.2.49 కోట్ల నుంచి రూ.3.18 కోట్లకు పెరిగాయి.
 వెండి ఊయల విలువ రూ.2.87 లక్షలు.
 జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.65లో 1325.56 చ.గజాల స్థలం ఉంది. నిర్మాణం జరుగుతోంది. విలువ రూ.16.17 కోట్లు.
నికర ఆస్తి రూ.19.42 కోట్లు.

నిర్వాణ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
 హెరిటేజ్‌ ఫుడ్స్‌లో 51,45,684 షేర్లు ఉన్నాయి. విలువ రూ.10.82 కోట్లు.
 నిర్వాణకు గ్రూపు సంస్థల్లో పెట్టుబడులున్నాయి. అవన్నీ అన్‌లిస్టెడ్‌ కంపెనీలు.
 3ఫార్చూనర్లు, ఒక రేంజ్‌రోవర్‌, ఒక స్కార్పియో, ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ లాండ్‌క్రూయిజర్‌, ఒక రేంజ్‌రోవర్‌ ఆటో బయోగ్రఫీ, ఒక బుల్లెట్‌ప్రూఫ్‌ టాటా సఫారీ, ఒక టాటాసఫారీ వాహనాలు ఉన్నాయి.
 మొత్తం ఆస్తులు రూ.43.96 కోట్లు. అప్పులు రూ.34.85 కోట్లు. నికర ఆస్తులు రూ.9.11 కోట్లు.

Courtesy Eenadu