– ట్యాంక్‌బండ్‌కు వెళ్లకుండా అరెస్టులు, గృహనిర్బంధాలు
– 36వ రోజూ కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు
యంత్రాంగం

చలో ట్యాంక్‌బండ్‌ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న కార్మికులను, అఖిలపక్ష నేతలను పోలీసులు నిర్బంధించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వారిని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డగింతలూ అరెస్టులూ కొనసాగించారు. ఈ బలవంతంపు అరెస్టులను నిరసిస్తూ పలుచోట్ల సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 36వ రోజూ ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. శనివారం జిల్లాల్లో వందలాది మందిని అరెస్ట్‌ చేసి పోలీసులు స్టేషన్లకు తరలించారు. మిలియన్‌ మార్చ్‌కు కంటోన్మెంట్‌ నుంచి భారీ సంఖ్యలో నాయకులు తరలి వెళ్తుండడంతో తిరుమలగిరి, కార్ఖానా, బోయినపల్లి, బొల్లారం పోలీసులు ఎక్కడికక్కడ నాయకులను అరెస్టు చేసి లాలాగూడ, బొల్లారం పీఎస్‌లకు తరలించారు. జవహర్‌నగర్‌లో ముందస్తుగానే అఖిలపక్ష నాయకులను వారివారి ఇంటి వద్దనే అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలంలోని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను తెల్లవారుజామునే ఇంటి తలుపుతట్టి అరెస్టులు చేశారు.

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో లాఠీచార్జిని నిరసిస్తూ హుజూరాబాద్‌ పట్టణంలో రాస్తారోకో చేశారు. సిరిసిల్ల, వేములవాడ డిపోల వద్ద దీక్షలో ఉన్న కార్మికులను, వారికి మద్దుతు తెలుపుతున్న రాజకీయ పార్టీల నాయకులను అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 350 మంది ఆర్టీసీ కార్మికులు, బీజేపీ, కాంగ్రెస్‌, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ సంజరు నేతృత్వంలోని కార్మిక బృందం పోలీసు బందోబస్తు వలయాలను తప్పించుకుని ట్యాంక్‌బండ్‌ వరకు తరలివెళ్లింది. ట్యాంక్‌బండ్‌ వద్ద గోషామహాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా సుమారు 1500 మంది కార్మికులు హైదరాబాద్‌కు తరలివెళ్లినట్టు సమాచారం. కామారెడ్డి నుంచి పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు కార్లు, రైళ్లలో హైదరాబాద్‌ తరలివెళ్లారు.

మంచిర్యాల జిల్లా జన్నారంలో కార్మికులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు.మెదక్‌ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం నేతృత్వంలో వెళ్తుండగా మార్గమధ్యలో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైటాయించడంతో ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నించగా తోపులాట జరిగింది. జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో అఖిలపక్ష నేతలను అరెస్ట్‌ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల నాయకుల అరెస్టులు జరిగాయి.

న్యూడెమోక్రసీ, ఇఫ్టూ, పీవోడబ్ల్యూ, ఏఐకెఎంఎస్‌ నాయకులను ఖమ్మం రైల్వేస్టేషన్‌ వద్ద అరెస్ట్‌ చేసి, వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులను బస్టాండ్‌లో అరెస్టు చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము నుంచే అరెస్టుల పర్వం సాగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఖమ్మం, సూర్యాపేట నుంచి వస్తున్న జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మోట కొండూరులో సీపీఐ(ఎం), సీపీఐ నాయకులను, మునగాలలో సీపీఐ(ఎం) నాయకులను శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రాత్రి మొత్తం పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు.

Courtesy Navatelangana..