ముందే సంకేతాలున్నా పట్టించుకోని కేంద్రం
యస్‌ బ్యాంక్‌ పీకల్లోతు కష్టాల్లో మునిగాక చర్యలు
క్విడ్‌ప్రోకో సాగిందన్న మాజీ స్వతంత్ర డైరెక్టర్‌
ఆందోళనలో ఖాతాదారులు
కుప్పకూలిన షేర్‌ మార్కెట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు లబోదిబో

వాణిజ్య విభాగం : దేశంలో నాలుగో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్‌గా ఉన్న యస్‌ బ్యాంక్‌లో గత రెండేండ్ల నుంచి సంక్షోభ చాయలు కొట్టొచ్చినట్టు కనిపించినా.. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పట్టించుకోలేదని స్పష్టమవు తున్నది. మొండి బాకీలు అమాంతం పెరగడంతో పాటుగా కార్పొరేట్‌ పరిపాలన అత్యంత లోపభూయి ష్టంగా మారిందని సంకేతాలు వచ్చాయి. మరోవైపు ఈ బ్యాంక్‌ పరపతి రోజు రోజుకూ పడిపోవడంతో ఏ విత్త సంస్థలు కూడా మూలధనం అందించడానికి దైర్యం చూపించలేదు. గతేడాది నుంచి ఈ బ్యాంక్‌ మూలధన నిధుల కోసం అనేక విత్త సంస్థలను అభ్యర్థించింది. యస్‌ బ్యాంక్‌లో అనేక ప్రతికూల పరిణామాలు జరుగుతున్నా అటు కేంద్రం గానీ, ఇటు రెగ్యులేటరీ సంస్థలు గాని బ్యాంక్‌ పరిస్థితిపై దృష్టి సారించలేదు. ఫలితంగా ఖాతా దారుల కొంపముంచిందని ఆర్థిక విశ్లేషకులు అంటు న్నారు. ఆ బ్యాంక్‌ ఖాతాదారులు కేవలం రూ.50వేలు మాత్రమే ఉపసంహరించుకోవడానికి పరిమితి విధిస్తూ గురువారం ఆర్బీఐ అనుహ్యంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఆ బ్యాంక్‌ షేర్‌ అమాంతం తుడుచుకు పెట్టుకుపోయింది. డిపాజిట్‌దారుల సొమ్ము భద్రంగానే ఉందని ఆర్ధిక మంత్రి సీతారామన్‌ ప్రకటన చేసినప్పటికీ యస్‌ బ్యాంక్‌ షేర్‌కు పెద్ద ఉపశమనం లభించలేదు. ఈ విత్త సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసిన రిటైల్‌ మదుపర్లు భారీగా నష్టపోయారు.

ఏటీఎంల ముందు భారీ క్యూ..

డిపాజిట్‌దారులు తమ నగదును ఉపసంహరించుకోవడానికి యస్‌ బ్యాంక్‌ శాఖలు, ఏటీఎం ల వద్ద పెద్ద మొత్తంలో వరుస కట్టారు. ఆ బ్యాంక్‌ చాలా ఏటిఎంలు నగదు లేక వెలవెల పోయాయి. తమ అవసరాల కోసం దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోయిందని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు యస్‌ బ్యాంక్‌తో అనుసంధానం అయిన పేమెంట్‌ యాప్స్‌ సేవలు నిలిచి పోయాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తరహాలోనే..యస్‌ బ్యాంక్‌లోనూ అదే తరహా కష్టాలు ఎదురయ్యాయని ఖాతాదారులు వాపోయారు.

క్షీణించిన ప్రమాణాలు..

తమ బ్యాంక్‌లో తీవ్రమైన క్విడ్‌ప్రోకో కొనసాగుతుందని స్వతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ గడిచిన జనవరిలో తీవ్ర వ్యాఖ్యలు చేయడమే ఇందుకు నిదర్శనం. బ్యాంకు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, నిబంధనల అమలులో వైఫల్యం, యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు.. ముఖ్యంగా బ్యాంకు సీఈఓ రవనీత్‌ గిల్‌, సీనియర్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ రాజీవ్‌ ఉబోరు, లీగల్‌ హెడ్‌ సంజరు నంబియార్‌లపై విమర్శలు గుప్పించారు. నియంత్రణ సంస్థ నిర్దేశించిన పలు నిబంధనలు యస్‌ బ్యాంక్‌ ఉల్లంఘిస్తున్నదని మరోసారి ఉత్తమ్‌ ప్రకాశ్‌ ఏకంగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంకు సీఈఓపై గిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనైతిక విధానాలతో బ్యాంకు బోర్డుపై గిల్‌ ఆధిపత్యం సాధించారనీ, క్విడ్‌ ప్రో కో లావాదేవీలతో బోర్డు సభ్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

భారీ నష్టాలు..

ఆర్ధిక సంవత్సరం 2019-20 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.600.08 కోట్ల నష్టాలు చవి చూసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా రూ.1,506.60 కోట్ల నష్టాలు నమోదు చేసింది. గత సెప్టెంబర్‌ త్రైమాసికంలో యెస్‌ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 5.01 శాతం నుంచి 7.39 శాతానికి ఎగిశాయి. ఇదే సమయంలో నిరర్ధక ఆస్తుల కోసం ఈ బ్యాంకు రూ.1,336 కోట్ల కేటాయింపులు చేసింది. ముఖ్యంగా కార్పొరేట్లకు ఇచ్చి న అప్పులు రికవరీ కాకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారినట్టు ఆ వర్గాలు పేర్కొం టున్నాయి. మొండి బాకీల దెబ్బతో 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలు చవి చూసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బ్యాంక్‌ ఇప్పటికీ ఆ ఫలితాలను విడుదల చేయలేదు.

చిన్న ఇన్వెస్టర్లు విలవిల

యస్‌ బ్యాంక్‌ పనితీరు జోరు మీదున్న కాలంలో అంటే 2018 జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్‌ చేశారు. తదుపరి బ్యాంకులో అవకతవకలపై సందేహాలతో పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతూరాగా.. మరోవైపు చిన్న ఇన్వెస్టర్లు షేరు ధర అందుబాటులోకి వస్తున్న భావనతో కొనుగోలు చేశారు. వెరసి 2019 డిసెంబర్‌ త్రైమాసికానికి యస్‌ బ్యాంక్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా దాదాపు 48 శాతానికి చేరింది. 2018 జూన్‌లో ఈ వాటా 8.83 శాతమే కావడం గమనార్హం. తాజా పరిణామం వల్ల ఆ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టిన చిన్న ఇన్వెస్టర్లు విలవిలమంటున్నారు. నగదు ఉపసంహరణలపై పరిమితి విధించడంతో శుక్రవారం ఒక్క సెషన్‌లోనే యస్‌ బ్యాంక్‌ షేర్‌ 85 శాతం పైగా పతనమై రూ.37 నుంచి రూ. 5.7కు దిగజారింది. మంత్రి వ్యాఖ్యలతో కొంత పుంజుకుని తుదకు 54.85 శాతం లేదా రూ.20.20 క్షీణించి రూ.16.60 వద్ద ముగిసింది.

నిలిచిన పేమెంట్‌ యాప్స్‌..

యస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఫోన్‌పే సేవల్లో అంతరాయం ఏర్పడింది. తమ భాగస్వామ్య బ్యాంక్‌ అయిన యస్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ మారటోరియం విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ సంస్థ పేర్కొంది. అదే విధంగా యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు పేటీఎం సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎంఎఫ్‌లకు పెద్ద దెబ్బ..

ఆర్బీఐ నిర్ణయంతో యస్‌ బ్యాంకులో భారీగా వాటాలు కలిగిన మ్యూచువల్‌ ఫండ్‌లకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ విత్త సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఎస్బీఐ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌, నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు జనవరి 31వ తేదినాటికి యస్‌బ్యాంక్‌లో కోటి నుంచి 5కోట్ల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు అనేక ఎంఎఫ్‌ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

ఎస్బీఐకి
49 శాతం వాటా : మంత్రి సీతారామన్‌
యస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) కొనుగోలు చేయనుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందుకోసం ఆర్బీఐ ప్రతిపాదనలు రూపొందిస్తుందన్నారు. శుక్రవారం మంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 30 రోజుల్లో యస్‌ బ్యాంక్‌ను తిరిగి పూర్తిగా నిర్మాణంలోకి తీసుకు రానున్నామన్నారు. కాగా యస్‌ బ్యాంక్‌లో ఎస్బీఐ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని సమాచారం. దీనికి ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వం కూడా అనుమతించాల్సి ఉంటుంది. యస్‌ బ్యాంక్‌లోని డిపాజిట్‌ దారుల సొమ్ము ఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా ఉంటుందని మంత్రి సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో ఆర్బీఐతో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు విషయంలో ఆర్బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందుస్తు పరిష్కరం కోసం ఆర్‌బిఐ చాలా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకు ంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థ భద్రతే లక్ష్యంగా యస్‌ బ్యాంకు ఆంక్షల నిర్ణయం చాలా పెద్ద స్థాయిలో తీసుకున్నామనీ, వ్యక్తిగత సంస్థ స్థాయిలో కాదని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అన్నారు. అతి తొందరలోనే నెలరోజుల గడువు లోపే యస్‌బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు.

Courtesy Nava telangana