• ఆర్టీసీలో కేంద్రానికి వాటాలు.. జోక్యం తప్పదు
  • ఎండీ, అధికార్లను వారంలో ఢిల్లీకి పిలుస్తాం: గడ్కరీ
  • వారితో సమావేశమై చర్చలు జరుపుతా
  • సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకుంటా
  • సర్కారు కక్షసాధింపు ధోరణి విడిచిపెట్టాలి
  • షరతుల్లేకుండా కార్మికులను చేర్చుకోవాలి
  • రాష్ట్రానికి సూచించిన కేంద్ర రవాణా మంత్రి
  • ఆయనతో కిషన్‌ రెడ్డి, బీజేపీ ఎంపీల భేటీ
  • కార్మికులకు న్యాయం చేస్తానన్నారు: కిషన్‌రెడ్డి
  • దేశం దుర్మార్గపు సీఎంను చూసింది: అర్వింద్‌
  • కేసీఆర్‌ దొరతనం చూపించవద్దు: సంజయ్‌

న్యూఢిల్లీ: ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రం చూస్తూ ఊరుకోబోదని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆర్టీసీలో కేంద్రానికి వాటాలు ఉన్నాయని, ఆర్టీసీ ఇంకా విభజన కాలేదని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై వారం రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ఎండీని ఢిల్లీకి పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిని విడిచిపెట్టాలని, ఎలాంటి షరతులు లేకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అక్రమంగా లీజుకిచ్చిన ఆర్టీసీ భూములు, బస్సులపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌ గురువారం పార్లమెంటు భవనంలో గడ్కరీతో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కిషన్‌రెడ్డి బృందం చేసిన వినతికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏ సమయమైనా ఈ రోజు సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని, కార్మికులకు న్యాయం చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరం, ఎంపీ అర్వింద్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రికి వివరించామని, కార్మికుల ఆత్మహత్యలు, మరణాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మొండి వైఖరితో వ్యవహరిస్తూ చర్చలకు పిలవడం లేదని చెప్పామని వివరించారు. ఇకనైనా సీఎం స్పందించి సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలను ఆపాలని డిమాండ్‌ చేశారు. కాగా, కార్మికుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డికి సూచించారు.

గడ్కరీ చాలా బాధపడ్డారు: బండి సంజయ్‌
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి తాము చెప్పిన వివరాలు విని గడ్కరీ ఆశ్చర్యపోయారని, చాలా బాధగా ఉందని అన్నారని ఎంపీ బండి సంజయ్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కార్మికులకు భరోసా ఇవ్వాలని కోరామని తెలిపారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి బండారం దేశం మొత్తం చూసిందన్నారు. బేషరతుగా అవకాశమిస్తే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన నేపథ్యంలో విర్రవీగవద్దని సీఎం కేసీఆర్‌కు సూచించారు. కార్మికులు ఒక అడుగు వెనక్కి తగ్గి విధులకు హాజరవుతామని అన్నారని, అందుకు ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్‌ చేశారు. షరతులు లేకుండా సమ్మె కాలంనాటి జీతాలను చెల్లించాలని కోరారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలన్నారు. కేసీఆర్‌ దొరతనానికి వెళ్లవద్దని, తెలంగాణ ఆయన జాగీరు కాదని విమర్శించారు.

సీఎంను కలిసిన ప్రముఖులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో పలువురు నాయకులు, అధికారులు కలిశారు. వివాహ ఆహ్వాన శుభ పత్రికలను అందించారు. జీహెచ్‌ఎంసీ సిటీ చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి దేవేందర్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె పెళ్లికి రావాలని ఆహ్వానించారు. డెయిరీ ఫామ్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి తన మనుమరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. సిద్దిపేటకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు వుమూర్తి బాల్‌ రెడ్డి సీఎంను కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. కాగా, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Courtesy AndhraJyothy…