• న్యూస్‌ పోర్టల్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ
  • నెట్‌ఫ్లెక్స్‌, హాట్‌స్టార్‌లూ కేంద్రం కనుసన్నల్లోనే!
  • సమాచార శాఖ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు

న్యూఢిల్లీ : వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ల్లో ఇష్టానుసారం రాయడం, వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ఇకపై కుదరదు. డిజిటల్‌ న్యూస్‌, ఇతర ఆన్‌లైన్‌ కంటెంట్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టనుంది. న్యూస్‌ పోర్టళ్లు, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌ను కూడా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అయితే నియంత్రణ ఎలా ఉంటుంది, నిర్దిష్ట మార్గదర్శకాలుంటాయా, ఏదేనా ప్రత్యేక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా.. అన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆన్‌లైన్‌ న్యూస్‌, ఇతర కంటెంట్‌లపై పర్యవేక్షణకు ప్రత్యేక చట్టంగానీ, స్వయంప్రతిపత్తి గల సంస్థ గానీ లేదు. దీంతో సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ లేకుండానే ఓటీటీలపై సినిమాలు విడుదల చేసేస్తున్నారు. అలాగే వివిధ పోర్టళ్లలో విశృంఖల వార్తాకథనాలు వెల్లువెత్తుతున్నా యి. తాజా నోటిఫికేషన్‌తో ఇకపై న్యూస్‌, ఆడియో-విజువల్‌ కంటెంట్‌, ఓటీటీ వేదికలపై విడుదలయ్యే సినిమాలు, ఇతర అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను నియంత్రించే అధికారం సమాచార ప్రసార శాఖకు వస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ హాట్‌స్టార్‌, సోనీ ఎల్‌ఐవీ మొదలైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ పైనా కేంద్ర పెత్తనం ఉంటుంది. వార్తా వెబ్‌సైట్లను దీని పరిధిలోకి తేవడంతో ప్రభుత్వ వ్యతిరేక కథనాలను అప్పుడప్పుడూ ప్రచురిం చే ది వైర్‌, స్ర్కాల్‌ లాంటి అనేక వెబ్‌సైట్లను టార్గెట్‌ చేసే అవకాశం ఉందని విశ్లేషకులంటున్నారు. డిజిటల్‌ మీడియా ఇప్పటికే ఐటీ చట్ట నియంత్రణలో ఉందని, అయితే భావప్రకటన స్వేచ్ఛ హక్కుకు లోబడి ఉంటోందని చెబుతున్నారు. అనేక మంది జర్నలిస్టులు, రచయితలు, డైరెక్టర్లు ఈ నిర్ణయంపై విస్మ యం వ్యక్తం చేశారు. నియంత్రణ పేరుతో వార్తా స్వేచ్ఛను అడ్డుకొంటారా అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను ప్రశ్నించారు. సవివరమైన సమాచారాన్ని గురువారం వెల్లడిస్తామన్నారు. డిజిటల్‌ మీడియాపై నియంత్రణ రావాలంటూ దాఖలైన ఓ ప్రజాహిత దావాపై సుప్రీంకోర్టు నెలరోజుల కిందటే కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. నియంత్రణ ఉండాల్సిందేనని కేంద్రం కూడా తన అఫిడవిట్‌లో పేర్కొంది.

తాజా నిర్ణయం వల్ల కంటెంట్‌ను సృష్టించే రచయితలు, ఇతర ప్రొడక్షన్‌ నిపుణులు ఇబ్బందుల్లో పడతారని, ప్రపంచ దేశాల కంటే వెనకబడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘సృజనాత్మకతకు పెద్ద దెబ్బ. రచయితల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. ఇది ఆన్‌లైన్‌ రంగానికి మంచిది కాదు’’ అని వివిధ ఓటీటీ వేదికలపైనుంచి స్ట్రీమింగ్‌ కంటెంట్‌ను రూపొందిస్తున్న హంసల్‌ మెహతా, రీమా కగ్టీ, కరణ్‌ అన్షుమాన్‌ అభిప్రాయపడ్డారు. ‘దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు’’ అని అమెజాన్‌ ప్రైమ్‌ షోలో మేడ్‌ ఇన్‌ హెవెన్‌ అనే చిత్రాన్ని విడుదల చేసిన రీమా అన్నారు. ప్రభుత్వ సెన్సార్‌షి్‌ప ను ప్రజలు, మీడియా రంగం ప్రతిఘటించాలని మీర్జాపూర్‌, ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ లాంటి చిత్రాల్ని రూపొందించిన మెహతా పిలుపునిచ్చారు. ‘‘స్వయం నియంత్రణ పాటిస్తామని ఓటీటీ వేదికలన్నీ సమాచార మంత్రి జావడేకర్‌కు చెప్పాయి. ఆయన కూడా సరేనన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం తమ అధీనంలోకి ఎందు కు తీసుకున్నట్లు?’ అని ఆయన నిలదీశారు. ఓటీటీ వేదికలపై కంటెంట్‌ నియంత్రణకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలతో కూడిన కోడ్‌పై 8 వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ 2019 జనవరిలోనే సంతకం చేశాయి. జాతీ య పతాకం, చిహ్నాలు, సంస్కృతి మొదలైన వాటిని అవహేళన చేయడం, ఉగ్రవాదానికి ప్రోద్బలమివ్వడం, చైల్డ్‌ పోర్నోగ్రఫీని ప్రోత్సహించడం, మతపరమైన ఉద్రిక్తతలకు తావివ్వడం, ద్వేష రాజకీయాలు.. మొదలైన కంటెంట్‌ను ఈ కోడ్‌ ద్వారా నిషేధించారు. అయితే ఈ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు.

Courtesy Andhrajyothi