– తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఐదు రాష్ట్రాలు
– తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌
– ఐజీఎస్టీ అడ్‌హక్‌ నిధులు ఇప్పించాలని తెలంగాణ వినతి
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లకు సంబంధించి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ఐదు రాష్ట్రాలు కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిపై ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌ల ఆర్థిక మంత్రులు రెండ్రోజుల క్రితం కేంద్రానికి ఉమ్మడిగా వినతిపత్రాన్ని అందజేశారు. వీరితో పాటు తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ అడ్‌హక్‌ నిధులనూ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రానికి చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. మరోవైపు కేంద్రం నుంచి తమకు రావాల్సిన జీఎస్టీ పరిహారం ఆలస్యమవుతుండటంతో తాము తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని ఐదు రాష్ట్రాల ఆర్థికమంత్రులు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అయితే జాప్యానికి గల కారణాలను సైతం కేంద్రం వెల్లడించడం లేదని వారు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. ఈ సమస్యను అక్కడే తేల్చుకుంటామనీ, కేంద్రం తీరును కోర్టులో ఎండగడతామని వారు చెబుతున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలకు సంబంధించి.. రాజస్థాన్‌కు రూ. 4,400 కోట్లు, ఢిల్లీకి రూ. 2,335 కోట్లు, పంజాబ్‌కు రూ. 2,100 కోట్లు, కేరళకు రూ. 1,600 కోట్లు, బెంగాల్‌కు రూ. 1,500 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. నవంబర్‌ ముగింపునకు వస్తున్నా ఆ రెండు నెలల చెల్లింపులే ఇంకా అందలేదు. అలాగే ఐజీఎస్టీ అడ్‌హక్‌ నిధుల కింద తెలంగాణకు రూ. 2,812 కోట్లు రావలిసి ఉంది.
దీనిపై కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ మాట్లాడుతూ… రాష్ట్రాలకు విధిగా జీఎస్టీ చెల్లింపులు చేయడానికి గానూ కేంద్రం ఓ మధ్యంతర యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. పంజాబ్‌ ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ స్పందిస్తూ.. జీఎస్టీ చెల్లింపులను తక్షణమే విడుదల చేయకుంటే తమ రాష్ట్రం ఓవర్‌డ్రాఫ్ట్‌(ఒ.డి)లో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి 60 శాతం పన్నులు రాష్ట్రాల నుంచే వస్తున్నా.. జీఎస్టీ పరిహారాన్ని ఆలస్యం చేయడం తగదని చెప్పారు. ఈ సమస్యను వచ్చే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలలో లేవనెత్తుతామని తెలిపారు.
ఆర్థిక మందగమనం నేపథ్యంలో కీలక రంగాల్లో వృద్ధి మందగిస్తున్నా కార్పొరేట్లకు తాయిలాలు, పన్నుల రేట్లు తగ్గించడం, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ మోసాలతో కేంద్ర ఖజానాకు భారీగా కోతపడింది. దీని ప్రభావం పరోక్షంగా జీఎస్టీపైనా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం గత త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. కార్పొరేట్లకు మినహాయింపులు ఇస్తున్న మోడీ సర్కారు.. రాష్ట్రాలకు విధిగా చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లింపులలో మాత్రం జాప్యం చేస్తున్నదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

Courtesy Navatelangana