ప్రభాత్‌ పట్నాయక్‌

‘ఫెడరలిజం’ (సమాఖ్య వ్యవస్థ) భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలలో ఒకటి. రాజ్యాంగ పరిషత్‌లో ప్రొ.కే.టీ.షా ”ఫెడరల్‌”, ”సెక్యులర్‌” (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చాలని కోరాడు. కానీ డాక్టర్‌ అంబేద్కర్‌, రిపబ్లిక్‌ యొక్క ‘సెక్యులర్‌’, ‘ఫెడరల్‌’ లక్షణాలు దానిలోనే ఇమిడి ఉన్నాయి కాబట్టి, ఆ పదాలను ప్రత్యేకంగా పొందుపర్చాల్సిన అవసరంలేదని ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల అధికారాల పరిధిని రెండు జాబితాల్లో, రెండింటి ఉమ్మడి అధికార పరిధిని మూడవ జాబితాలో వివరించింది. అప్పటి నుంచి కేంద్రం నిత్యం రాష్ట్రాల అధికారాల పరిధిలోకి చొచ్చుకొని వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఉంది. ఈ ధోరణి ఇప్పుడు బాగా బలం పుంజుకుంది. ప్రస్తుతం మన దేశం చట్ట సమ్మతం కాని కేంద్రీకృత రాజ్యం దిశగా నెట్టబడుతుందన్న వాదనలో ఎలాంటి అతిశయోక్తి లేనట్టు కనిపిస్తున్నది.

రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఉన్న పన్నుల విధింపు అధికారాలను వదిలేయమని రాష్ట్రాలను ఒప్పించిన కేంద్రం, దానికి గాను రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాలను చెల్లిస్తామని వాగ్దానం చేసి, జీఎస్టీ పన్నుల నిర్వహణను చూస్తున్న జీఎస్టీ కౌన్సిల్‌ పైన ఆదిపత్యం చెలాయిస్తూ, ఇప్పుడు చేసిన ఒప్పందం అమలుకు తిలోదకాలిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రాలకు (మూడింటి పైన మినహాయిస్తే) పన్నులు విధించే అధికారాలు లేవు, నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చేసిన వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు.

కేవలం కేంద్రీకరింపబడిన వనరులపై అదుపు మాత్రమే కాకుండా, కేంద్రం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా విధాన నిర్ణయాధికారాలను కూడా కేంద్రీకరిస్తున్నది. ఉదాహరణకు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది, కానీ ఇటీవల ఒక నూతన విద్యా విధానాన్ని కేంద్రం రాష్ట్రాలతో ఏ విధమైన సంప్రదింపులు చేయకుండానే ప్రవేశ పెట్టింది. రాష్ట్రాలు కేంద్రాన్ని అనుసరిస్తూ, నూతన విద్యా విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికారాల పరిధిలో ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేయకుండానే పార్లమెంట్‌ ద్వారా మూడు వ్యవసాయ బిల్లులను ఆదరాబాదరాగా చట్టాలను చేసింది. ఈ చట్టాల వల్ల దేశంలోని వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ప్రభావం రైతులతో పాటు రాష్ట్రాల ఆదాయాలు కూడా భారీగా కోల్పోవాల్సి ఉంటుంది.

కేంద్రం కేవలం రాష్ట్రాల అధికారాల పరిధిలోకి చొచ్చుకొని వెళ్ళడమే కాకుండా, ఇప్పుడు వాటి ఉనికినే ఏకపక్షంగా మార్చి వేస్తున్నది. రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా జమ్మూ కాశ్మీర్‌ను రెండు ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పుడే ఇది స్పష్టం అయ్యింది. ఆ సమయంలో ఆ రాష్ట్రం గవర్నర్‌ పాలనలో ఉంది కాబట్టి, ఈ విభజనకు కేంద్రం నియమించిన గవర్నర్‌ ద్వారా అనుమతి పొందాల్సి వచ్చింది. ఈ సాంప్రదాయంతో ఏ రాష్ట్రమైనా రాష్ట్రంగా ఉనికిలో లేకుండా ఏ సమయంలోనైనా దానిని కేంద్రంచే నియమించబడిన గవర్నర్‌ పాలనలో (గవర్నర్‌ అనుమతి అంటే, రాష్ట్ర శాసనసభ అనుమతితో సమానం కాబట్టి) ముక్కలు చేయవచ్చు. ఒక రాష్ట్రం ఉనికి కేంద్రం విచక్షణపై ఆధారపడే విషయంగా మారడంతో, కేంద్రీకృత రాజ్యం దిశగా కేంద్రం ఒక దఢమైన చర్యను తీసుకుంటుంది.

భారత దేశాన్ని ఒక చట్ట సమ్మతం కాని కేంద్రీకృత రాజ్యంగా మార్చడం, హిందూత్వ, ప్రపంచ ద్రవ్యపెట్టుబడితో ఏకం అయిన కార్పొరేట్‌ ద్రవ్యపెట్టుబడిదారీ కూటమి ఎజెండా. అందువల్లనే ప్రస్తుతం భారతదేశ రాజకీయాలలో ఆధిపత్యం చెలాయిస్తున్న కార్పొరేట్‌- హిందూత్వ కూటముల ఉమ్మడి ఎజెండాలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా ఏర్పాటు అయ్యింది.

భారతదేశం యొక్క సమాఖ్య స్వభావం, ప్రతీ భారతీయుని లక్షణాన్ని చెప్పే ద్వంద జాతీయ చైతన్యాన్ని అనుసరిస్తుంది. ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ భాషా సమూహానికి చెందిన వారమనే చైతన్యం, అది ఒక ఒడియా, ఒక బెంగాలీ, ఒక మళయాళీ, ఒక గుజరాతీ, ఒక తమిళుడు. వీరంతా భారతదేశానికి చెందిన వారు అనే చైతన్యం .ఈ రెండు రకాల చైతన్యాలు వలస – వ్యతిరేక పోరాట కాలంలో బలపడినాయి.
వలసరాజ్య అనంతర రాజ్యం కూడా ఈ రెండు రకాల చైతన్యాలను ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సమాఖ్య లక్షణం ఉండే రాజకీయ పరిష్కారాల ద్వారా కల్పించింది. ఈ సమాఖ్య లక్షణాన్ని కాపాడాలంటే ఈ రెండింటి మధ్య సున్నితమైన సమతుల్యతను పాడైపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక దానిపై మరొక దాని ఏకపక్ష ప్రాధాన్యత రెండింటి మధ్య ఉండే సమతుల్యతను భగం చేస్తుంది. ఫలితంగా దేశ సమైక్యతకు అంతరాయం ఏర్పడుతుంది. ఉదాహరణకు, ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోకుంటే, అదనపు కేంద్రీకరణ వారి వ్యతిరేకులను వేర్పాటు వాదం దిశగా ప్రోత్సాహించినట్టే అవుతుంది.

కానీ హిందూత్వ భాగస్వాములు భారతదేశం యొక్క సంక్లిష్టమైన ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోరు. వలసరాజ్య వ్యతిరేక పోరాటంలో వారు పాల్గొనని రోజుల నుంచి భారతదేశం, తయారు చేసే జాతి కాదు, కానీ ”హిందూజాతిని” ఏర్పరచిన భూమి అని వారి దృష్టిలో ప్రాచీన కాలం నుంచి ఉంది. కాబట్టి, వారు ప్రాంతీయ-భాషా చైతన్యం, దానిపై నిర్మితమైన అనేక భాష, సంస్కృతీ, సాంప్రదాయాలతో సమ్మిళితమైన చైతన్యం అంతగా ఆలోచించ దగిన విషయాలు కాదని అంటారు. వారు ప్రతి ఒక్కరిపై ‘ఒకే భాష’, ‘ఒకే సంస్కృతి’ లాంటి ఏకరూపతను విధించాలని కోరుకుంటారు. వారు అంతటా వ్యాపించి ఉన్న ఒక తాత్వికమైన ”భావవాద ఐక్యత”ను కోరుకుంటారు. వారు కోరుకున్న వాటిలో ఏది ఆ మార్గం నుంచి తప్పినా అది ”జాతి వ్యతిరేక చర్య” అవుతుంది. దీని నుండే సమాఖ్య లక్షణానికి వ్యతిరేకత వచ్చింది, ఈ అవగాహనలో సమాఖ్య, ”జాతి”ని బలహీన పరుస్తుంది.

హిందూత్వ భాగస్వాములు కేవలం అవకాశవాద కారణాల కేంద్రీకరణ కోసం మాత్రమే కాకుండా, వారు అంతర్గతంగా, ప్రతీ చోటా సమాఖ్యకు వ్యతిరేకంగా, కేంద్రీకృత రాజ్యానికి (మత ప్రాతిపదిక గల రాజ్యానికి) అనుకూలంగా ఉన్నారు.

అదేవిధంగా కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ కూటమి కూడా కేంద్రీకరణకు అనుకూలంగా ఉంది. గుత్త పెట్టుబడిని నడిపించే ఈ కూటమి ఆర్థిక వ్యవస్థ కేంద్రీకరణకు ప్రాతినిధ్యం వహించి, తన ఆశయాలను నిజం చేస్తుంది. కానీ దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. సమాఖ్య రాజ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల ప్రభుత్వం కన్నా మహానగర (మెట్రోపాలిటన్‌) పెట్టుబడితో పాటు గుత్త పెట్టుబడి పట్ల తక్కువ అనుకూలత ఉండే పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో గుత్త పెట్టుబడి లేక మహానగర పెట్టుబడి (సమకాలీన ప్రపంచం యొక్క లక్షణాలు తీవ్రమైన అంతర్‌- సామ్రాజ్యవాద శత్రుత్వం వల్ల ఎలా ఉంటాయో చెప్పలేదు కాబట్టి, రెండు పదాలను ఉపయేగిస్తున్నాం) కేంద్రాన్ని బలహీన పరచి, ఆ ప్రాంతాలను బలోపేతం చేయాలనుకుంటుంది. సమాఖ్య నిర్మాణంలో అది అధికారాల సంక్రమణను, వనరులను, నిర్ణయాధికారాన్ని కోరుతుంది. చివరకు అది ఆ ప్రాంతాల్లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సాహిస్తుంది. ఆ రకంగా అది పెద్ద సమాఖ్య రాజ్యం విడిపోవడం ద్వారా తన స్వప్రయోజనాల కోసం కొత్తగా ఏర్పడిన కేంద్రీకృత రాజ్యాన్ని ఉపయోగించుకుంటుంది.

ఇక్కడ విడిపోయిన యుగోస్లేవియా ఒక మంచి ఉదాహరణ. ఉమ్మడి యుగోస్లేవియాలో కేంద్ర ప్రభుత్వంపై ఆధిపత్యం సాధించాలన్న ఆశ జర్మన్‌ పెట్టుబడికి తక్కువగా ఉంది. సెర్బియాకు నాజీ వ్యతిరేక పోరాట చరిత్ర ఉంది. జర్మన్‌ పెట్టుబడికి ఉన్న ఆశయం పట్ల అనుమానం కూడా ఉన్న సెర్బియా ఏ ఉమ్మడి దేశంలోనైనా ఒక బలమైన శక్తిగా ఉంటుంది కాబట్టి జర్మన్‌ పెట్టుబడి యుగోస్లేవియా విడి పోయేందుకు ప్రోత్సహించింది.

ఎక్కడైతే భారతదేశంలాగా కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌- ద్రవ్యపెట్టుబడిదారీ కూటమి యొక్క ప్రయోజనాలు ముందుకు తీసుకు వెళ్ళేందుకు సానుకూలంగా ఉంటుందో, అక్కడ ఈ కూటమి సమాఖ్య నిర్మాణాన్ని బలహీన పర్చేందుకు, అధికారాలు, వనరులు, నిర్ణయాధికారాల కేంద్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలతో ఏ విధమైన సంబంధం లేకుండానే అది తన ఆశయాలను ముందుకు తీసుకొని పోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌లను స్థానికులకు, లేదా ప్రభుత్వ రంగానికి అప్పగించే ఆలోచనలు చేయవచ్చు. రైతుల నుంచి తీసుకున్న భూములకు నష్ట పరిహారాన్ని ఇప్పించే ఆలోచనలు కూడా రాష్ట్రాలు చేయవచ్చు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ కూటమికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాంట్రాక్టు వ్యవసాయం, క్రమబద్ధీకరణలేని మార్కెట్ల ద్వారా రైతుల వ్యవసాయం పైన కార్పొరేట్‌ ఆక్రమణకు మార్గాన్ని సుగమం చేసిన ఇటీవల చట్టాలుగా మార్చిన వ్యవసాయ బిల్లులను అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించి ఉండేడివి కాదు. చట్టబద్ధతపై అనుమానాలకు తావిచ్చే కేంద్ర ప్రభుత్వ చట్టాలను బలవంతంగా రుద్ది కేంద్రం రాష్ట్రాల గొంతు నొక్కుతున్నది. చట్టబద్ధతపై అనుమానం ఉన్నప్పటికీ ఇలాంటి చట్టాన్ని విధించడం అనేది కేంద్ర ప్రభుత్వం కన్నా న్యాయవ్యవస్థ తన స్వతంత్రతను కోల్పోయిందన్న సూచిక వాస్తవం.

భారతదేశాన్ని చట్ట సమ్మతం కాని కేంద్రీకృత రాజ్యంగా మార్చే అంశం ఉండటంతో హిందూత్వ శక్తులు, కార్పొరేట్‌-ద్రవ్యపెట్టుబడిదారీ కూటమి ఏకమైనాయి. కార్పొరేట్‌-హిందూత్వ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సహజంగానే ఈ ప్రణాళికను ముందుకు తీసుకొనిపోవడంలో నిమగమై ఉంది. ఈ వైఖరి కేంద్రం, రాష్ట్రాల రాజకీయ, ఆర్థిక సంబంధాలలో మాత్రమే కాక, విద్యా సాంస్కృతిక రంగాలలో కూడా అదే విధమైన సమాంతర వైఖరి స్పష్టం అవుతుంది. నూతన విద్యా విధానంలో హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని నేర్చుకోవాలనే నిబంధన విధిస్తూ నేర్పుగా చేసిన ప్రయత్నాన్ని ప్రతిఘటించారు, కానీ మళ్ళీ దానిని పునరుద్ధరణ చేస్తారు. నూతన విద్యా విధానంలో బోధనాంశాలను రాష్ట్రాలతో ఏ విధమైన సంప్రదింపులు చేయకుండానే కేంద్రం నిర్ణయించాల్సి ఉంటుంది. భారతదేశంలోని భిన్నత్వం స్థానంలో ”ఒకే సంస్కృతి”ని విధించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇవన్నీ సూచికలు.

వాస్తవమైన ప్రాంతీయ-భాషా చైతన్యాన్ని పూర్తిగా నిరాకరిస్తూ, విస్మరించే ఏకరూపతకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన భవిష్యత్తుకు ప్రమాదకర మైన మార్గాలను సృష్టిస్తుంది.

అనువాదం:బోడపట్ల రవీందర్‌

Courtesy Nava Telangana