జాదవ్‌పూర్‌ వర్సిటీ ఘటన ప్రచురించినందుకు ..
క్షమాపణలు చెప్పాలని బాబుల్‌ సుప్రియో డిమాండ్‌
న్యూఢిల్లీ : జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని చొక్కాపట్టుకుని కొడుతున్నట్టుగా ఉన్న ఫొటోతో వార్త ప్రచురించినందుకు ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక ఎడిటర్‌ను కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో బెదిరింపులకు గురిచేశారని టెలిగ్రాఫ్‌ పత్రిక ఆరోపించింది. దీనికి సంబందించిన కాల్‌ వివరాలను టెలిగ్రాఫ్‌ పత్రిక బహిర్గతం చేసింది. దీనిపై ఎడిటర్‌ రాజగోపాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి పదవిలో ఉండీ బెదిరింపులకు గురిచేస్తూ, అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడుతున్నారనేదానికి ఈ ‘కాల్‌’ సమాచారం నిదర్శనమని తెలిపారు. ‘శనివారం సాయంత్రం వార్తా సమావేశం జరుగుతుండగా.. కేంద్ర మంత్రి నుంచి కాల్‌ వచ్చింది. జాదవ్‌పూర్‌ వర్సిటీ ఘటనకు సంబంధించి వార్త ప్రచురణ విషయంలో ఎడిటర్‌, వార్తా పత్రిక తరఫున క్షమాపణలు చెప్పాలని మంత్రి బాబుల్‌ సుప్రియో బెదిరింపులకు పాల్పడ్డారు’ అని ఎడిటర్‌ తెలిపారు.
దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. తాను ఒక విద్యార్థి షర్టు పట్టుకుని ఉండగా ఫొటో తీసి మొదటిపేజీలో తప్పుడు కథనం ప్రచురించారని ట్వీట్‌ చేశారు. తర్వాతి రోజు ముద్రణలో క్షమాపణలు కోరుతూ వార్తా కథనం గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వారికి లీగల్‌ నోటీసులు పంపుతానని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి దీటుగా పత్రిక స్పందిస్తూ.. ‘మేము ప్రచురించిన కథనంలో ఎలాంటి తప్పులు లేవు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు. కేసులు పెట్టుకొవచ్చు’ అంటూ బెదిరింపులకు పాల్పడిన కాల్‌ సమాచారంతో కూడిన కథనం ప్రచురించింది.
మంత్రి నన్ను బెదిరించారు: జాదవ్‌పూర్‌ వర్సిటీ సెక్యూరిటీ గ్వార్డ్‌
వర్సిటీలో మంత్రి వచ్చిన రోజున క్యాంపస్‌లో ఆందోళన సందర్భంగా బాబుల్‌ సుప్రియో తనను బెదిరించారని వర్సిటీ సెక్యూరిటీ గ్వార్డ్‌ నిర్నిమేష్‌ రారు చెప్పారు. ‘నేను ఎవరో తెలుసా? నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేయగలను’ అంటూ తనను బెదిరించారని వివరించారు. ఈ ఘటనపై రారు మాట్లాడుతూ.. ‘మంత్రి అలా మాట్లాడటం చూసి నేను షాక్‌కు గురయ్యాను. నేను విద్యార్థులు ఆందోళన ఎక్కువగా వున్నదని, వీసీ చెప్పినట్టుగా ఆయన ఆఫీస్‌లోకి వేళ్దాం అని వివరించే ప్రయత్నం చేస్తుండగా నన్ను మంత్రి బెదిరించారు. మరో సెక్యూరిటీ గ్వార్డ్‌ కేంద్ర మంత్రికి దూరంగా ఉండటం మంచిదని చెప్పడం బాబుల్‌ సుప్రియో ప్రవర్తించిన తీరును నిదర్శనమంటూ’ వివరించారు.
మంత్రికి అనుకూలంగా ఏబీవీపీ ర్యాలీ..
అడ్డుకున్న ప్రొఫెసర్లు, విద్యార్థులు
కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు అనుకూలంగా ఏబీవీపీ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ వర్సిటీలో ర్యాలీ నిర్వహించడాన్ని వర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి వర్సిటీ గేటు మందు మానవహారంగా ఏర్పాడి వారిని అడ్డుకున్నారు. దీంతో సోమవారం ఆ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు సమయానికి రావటంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, వర్సిటీలో గురువారం కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఓ విద్యార్థిని చొక్కాపట్టుకుని కొడుతున్న ఫొటోతో కూడిన వార్తా కథనాన్ని ప్రచురించిన ‘టెలిగ్రాఫ్‌’ పత్రికను సదరు మంత్రి బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. ఏబీవీపీ సదరు మంత్రికి అనుకూలంగా ర్యాలీ చేయడం ఆందోళనకర పరిస్థితులకు దారీతీస్తున్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava telangana…

Tags-india, central, minister, Babul Supriyo, warned ,The Telegraaf, newspaper, Editor, on, Jadavpur, University, violence, coverage