ప్రభుత్వ పథకాలలోనూ లబ్దిదారుల తగ్గుదల : తాజా గణాంకాలు వెల్లడి
ప్రభుత్వ పథకాలలోనూ లబ్దిదారుల తగ్గుదల
తాజా గణాంకాలు వెల్లడి

న్యూఢిల్లీ : ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కింద ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నాయని ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఏంఈజీపీ), దీన్‌ దయాళ్‌ అంత్యోదయ యోజన-జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్‌ (డీఏవై-ఎన్‌యూఎల్‌ఎమ్‌) తదితర పధకాల ద్వారా ప్రత్యేకించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భర్తీ అయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశమున్నదని గణాంకాలు పేర్కొన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను వెల్లడించింది.

పీఏంజీపీలో
2018-19 సంవత్సరంలో పీఏంఈజీపీ కింద 5.87 లక్షల మందికి ఉపాధి కల్పించగా, ప్రస్తుత 2019-20 (డిసెంబరు 31, 2019) వరకు ఉపాథి పొందిన వారి సంఖ్య 2.57 లక్షలు మాత్రమే. 2017-18లో ఈ పధకం ద్వారా లబ్ది పొందిన 3.87 లక్షల మందితో పోలిస్తే ఇది తగ్గుదలేనని గణాంకాలు పేర్కొన్నాయి. 2016-17 సంవత్సరంలో 4 లక్షల మంది, 2015-16 సంవత్సరంలో 3.23 లక్షల మంది ఈ పధకం కింద లబ్ది పొందారు.

పీఏంఈజీపీ రుణ సబ్సిడీతో అనుసంధానమైన పధకం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ) ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. జాతీయ స్థాయిలో దీనికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.కేంద్రంలో మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2019-2020 సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య చాలా తక్కువగా నమోదయ్యింది.

మహారాష్ట్రలో సగానికి పైగా …
అసోంలో 2018-2019లో 29,896 మందికి ఉపాధి కల్పన జరిగితే 2019-20 సంవత్సరంలో అది 7,576కు తగ్గింది. జమ్ము కాశ్మీర్‌లో అయితే 60,232 నుంచి 20,336కు తగ్గింది. దాద్రా నగర్‌ హవేలితో కలిపి మహారాష్ట్రలో సగానికి పైగానే తగ్గింది. 2018-2019 సంవత్సరంలో 45,136 మంది ఉపాధి పొందితే, ప్రస్తుత సంవత్సరంలో కేవలం 20,032 మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాథి లభించింది. ఇక ఒడిషాలో అయితే 24,560 నుండి 9,136కు ఆ సంఖ్య పడిపోయింది.

డీఏవై-ఎన్‌యూఎల్‌ఎమ్‌లో
నైపుణ్యాలు కలిగిన యువత ఉపాధి కల్పించే డీఏవై-ఎన్‌యూఎల్‌ఎమ్‌ పథకం కింద లబ్ది పొందిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు వెల్లడించాయి. 2018-19 సంవత్సరంలో 1.78 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి 27 వరకు 44,066కు తగ్గింది. పీఏంఈజీతో కలిపి చూస్తే 2018-19 సంవత్సరంలో గత సంవత్సరాల కన్నా లబ్ది పొందిన వారి సంఖ్య అధికంగానే ఉంది. 2017-18 సంవత్సరంలో వీరి సంఖ్య 1,15,416 అయితే, 2016-17లో 1,51,901గా ఉంది. డీఏవై-ఎన్‌యూఎల్‌ఎమ్‌ అనేది ప్రభుత్వం నిర్వహిస్తున్న పేదరికాన్ని తగ్గించే పథకం. ఈ పథకంలో పట్టణ పేదలకు స్వయం ఉపాధి, నైపుణ్యం కలిగిన వారికి వేతనంతో ఉపాథి అవకాశాలు లభిస్తాయి.

ఈ పథకం కింద లబ్ది పొందిన వారి సంఖ్య ఈ ఏడాది జనవరి 27వరకు చూస్తే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో గణనీయంగా తగ్గింది. గుజరాత్‌లో అయితే 13,213 నుంచి 2,727కు తగ్గింది. మధ్యప్రదేశ్‌లో 2018-19లో 32,501గా ఉన్న లబ్దిదారుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,784కు పడిపోయింది.

గ్రామీణ ఉపాథి హామీ పధకంలో..
యూపీఏ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి¸ హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద లబ్ది పొందుతున్న వారి సంఖ్య కూడా 2019-20 సంవత్సరంలో తగ్గింది. 2018-2019లో 26,796 ఉండగా, ఈ ఏడాది 20,577కు తగ్గింది. ఇది 2015-16లో లబ్ది పొందిన వారి సంఖ్య కన్నా చాలా తక్కువ.
ఈ పధకం కింది వ్యక్తికి పని కల్పించిన రోజులు పరంగా చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య చాలా తగ్గింది. 2017-18లో లబ్ది దారుల సంఖ్య 23,373 ఉండగా, 2016-17లో 23,565గా ఉంది.

దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనలో
దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పధకం కింద నైపుణ్యం గలవారి నియామకాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. శిక్షణ పొందిన వారి సంఖ్య 2.4 లక్షల నుంచి 1.74 లక్షలకు పడిపోవడంతో, 2018-2019లో నియామకాలు పొందిన వారి సంఖ్య 1.35 లక్షలు ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో 1.10 లక్షలకు తగ్గింది. ఇందులో ఆసక్తికరమైన అంశమేమంటే 2018-2019 సంవత్సరంలో ఈ సంఖ్య పెరిగింది.

Courtesy Nava Telangana