నిలిచిపోయిన 1,600 ప్రాజెక్టులకు మోక్షం
కష్టాల్లో ఉన్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకునేందుకూ కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌) పేరుతో రూ.25,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలోని వివిధ నగరాల్లో మూలనపడిన 1,600కు పైగా రియల్టీ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తారు. ఫలితంగా వివిధ కారణాలతో ఆగిపోయిన 4.58 లక్షల గృహాలు పూర్తవుతాయని అంచనా. రెరా చట్టం కింద నమోదై, నికర ఆస్తుల విలువ సానుకూలంగా ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే ఈ నిధులు అందుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

 న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకునేందుకు పెట్టేందుకు రూ.25,000 కోట్లతో ప్రత్యేక సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక నిధికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెల్లడించారు. ఈ ప్రత్యేక నిధి కోసం ఉద్దేశించిన రూ.25,000 కోట్లలో రూ.10,000 కోట్లు ప్రభుత్వం నేరుగా సమకూరుస్తుంది. మిగతా రూ.15,000 కోట్లు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ సమకూరుస్తాయి. ఈ నిధుల ద్వారా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆగిపోయిన 1,600 స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 4.58 లక్షల గృహ యూనిట్లు పూర్తి చేయవచ్చని అంచనా.

రెరా కింద నమోదై నికర విలువ సానుకూలంగా ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టులకు మాత్రమే ఈ నిధి నుంచి నిధులు లభిస్తాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. స్థిరాస్తి రంగం కోసం ప్రకటించిన ఈ సహాయ ప్యాకేజీతో సిమెంట్‌, ఐరన్‌ అండ్‌ స్టీలు కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ పుంజుకోవడంతో పాటు ప్రధాన రంగాలపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. స్థిరాస్తి రంగం కోసం ఉద్దేశించిన ఈ ప్రత్యేక నిధిలో సావరిన్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్‌ సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకూ ప్రభుత్వం అనుమతించింది. మరిన్ని పెట్టుబడులు సమకూరితే ఈ ఫండ్‌లోని నిధులను మొండి బకాయిలుగా మారిన, దివాలా ప్రక్రియలో ఉన్న రియల్టీ ప్రాజెక్టుల కోసం ఉపయోగించవచ్చని నిర్మల సీతారామన్‌ చెప్పారు.

Courtyesy Andhra Jyothy..