కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అదనంగా రేషన్ సరకులు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది జరిగి 6 రోజులు అయ్యింది. దేశం అన్ని రాష్ట్రాలలో రేషన్ షాపుల ద్వారా ఐదు కేజీల బియ్యం లేదా గోధుమ ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పింది. ఒకపక్క దేశవ్యాప్తంగా బంద్ కారణంగా కోట్లాదిమంది అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు, అందులోనూ దళిత బహుజనులు మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. చిన్ని షాపులు మూతపడ్డాయి. బండ్ల మీద కూరగాయలు పండ్లు వంటివి అమ్ముకునే వారిలో అత్యధికులు ఇప్పుడు రోడ్డున పడ్డారు ఇళ్లల్లో పనిచేసే పని మనుషులకు పని లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇస్తానన్నా ఉచిత బియ్యం మాత్రం ఎక్కడా కానరావడం లేదు అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉన్నట్లు ద హిందూ దినపత్రిక పరిశోధన బయట పెట్టింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సమన్వయంతో ఈ విషయంలో సత్వర చర్యలు చేపట్టడం అవసరం