– బడ్జెట్‌ దిశగా -1
– రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చు తగ్గించుకునే యత్నం
– ఇప్పటికే మంత్రిత్వశాఖలకు లేఖలు.. 25 శాతం ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
– సంక్షేమరంగంలో కోత
కొండూరి వీరయ్య

జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి వస్తున్న వార్తలన్నీ కేంద్ర ఖజానాలోటు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాజీ ఆర్థిక శాఖ సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ మొదలుకుని మాజీ రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌, మాజీ కేంద్ర గణాంక శాఖ కార్యదర్శి ప్రణబ్‌సేన్‌ వరకు గత ఆరేండ్లుగా బీజేపీ అనుసరించిన విధానాల కారణంగా ఖజానాకు పడుతున్న చిల్లు గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. దేశమంతా పౌరసత్వ నిరసనల్లో మునిగి ఉంటే ప్రభుత్వం ఇదే అదునుగా తీసుకుని ప్రజలపై మరిన్ని భారాలు మోపే విధానాలను సిద్ధం చేస్తున్నది. బడ్జెట్‌కు ముందు ఆర్థికవ్యవస్థలోని వివిధ భాగస్వాములతో ఆర్థిక మంత్రి నిర్వహించాల్సిన కసరత్తును ఏకంగా ప్రధాని నిర్వహిం చటమే ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వం అనురించనున్న వైఖరికి నిదర్శనంగా భావించవచ్చు.

ప్రభుత్వం తలపెట్టిన ఖర్చుకు, ఆశించిన ఆదాయానికి మధ్య ఉన్న లోటే ఆర్థిక లోటు. గత రెండేండ్లల్లో ప్రభుత్వం ఆశించినంత ఆదాయం జమపడలేదు. ఈ సంవత్సరం కూడా ఆశించిన ఆదాయం మరింతగా కోతపడనుంది. అయినా ద్రవ్యలోటు పెరగకుండా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆదాయం లేనప్పుడు లోటు లేకుండా చేయగలిగే ఒకే ఒక్క మార్గం ఖర్చు తగ్గించుకోవటం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పని ఇదే. చివరి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా జరగాల్సిన ఖర్చులను తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ మేరకు జనవరి మొదటివారంలో ఆర్థిక శాఖ వివిధ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసింది. ప్రతి శాఖ తన ఖర్చులను 25 శాతానికి పరిమితం చేయాలన్నది ఈ లేఖ సారాంశం. అంటే రానున్న మూడునెలల్లో వివిధ శాఖలు, విభాగాల కింద ప్రతిపాదించిన ప్రజోపయోగ పనులకు అవసరమైన నిధులు విడుదల చేయరాదన్నది ఈ లేఖ ఆచరణాత్మక కోణం. దీన్నే ప్రభుత్వం ముద్దుగా పొదుపు చర్యలు అని పిలుస్తున్నది. ఈ పొదుపు చర్యల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివిధ శాఖలకు జారీ చేసిన లేఖ ద్వారా అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం గత సంవత్సరం వివిధ శాఖలు, సంక్షేమ అవసరాల కోసం కేటాయించిన నిధుల్లో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యే అవకాశం లేదన్న మాట.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పన్ను ద్వారా వచ్చే ఆదాయం 18 శాతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. తదనుగుణంగానే వివిధ శాఖలకు నిధులు కేటాయించింది. కానీ అనేక కారణాల వల్ల ఈ నిధులు 1 శాతం కంటే ఎక్కువగా పెరగలేదని కేంద్ర ప్రభుత్వం అకౌంట్స్‌ కంప్ట్రోలర్‌ జనరల్‌ అంచనా వేసింది. ఈ లోటు పూడ్చుకోవటానికి ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మాలనీ నిర్ణయించింది. ఈ మార్గంలో మరో లక్ష కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో కేవలం రూ. 17 వేలకోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థలను మాత్రమే మార్కెట్లో అమ్మకానికి పెట్టగలిగింది. అంటే ప్రయివేటీకరణ ద్వారా సంపాదించదల్చుకున్న ఆదాయంలోనూ సుమారు రూ. 80 వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం కనిపించటం లేదు.

కేంద్రప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం… వివిధ మంత్రిత్వ శాఖలు ఇప్పటికే ఖర్చు చేయాల్సిన మోతాదులో ఖర్చు చేయలేదు. ఆర్థిక సంవత్సరంలో 12నెలలను 4 భాగాలుగా విభజిస్తే ప్రతి మూడు నెలలకు ఆయా శాఖలు తమకు కేటాయించిన నిధుల్లో 25 శాతం చొప్పున ఖర్చు పెడుతూ రావాలి. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిదినెలలు ముగిశాయి. అంటే ఆయా శాఖలు తమ కేటాయింపుల్లో 75 శాతం ఖర్చు చేసి ఉండాలి. కానీ బ్లూంబర్గ్‌ క్వింట్‌ సమాచారం ప్రకారం వివిధ శాఖలు తాము ఖర్చు చేయాల్సిన లక్ష్యం కంటే తక్కువే ఖర్చు చేశాయి. అదనంగా మరో పాతిక శాతం ఖర్చుల నియంత్రణ అంటే బడ్జెట్‌ కేటాయింపుల్లో మెజారిటీ మొత్తం ఖర్చు కాకుండా మిగిల్చి బడ్జెట్‌ లోటు ఖాతాకు జమవేసేందుకు, తద్వారా ప్రతికూల పరిస్థితుల్లో సైతం ద్రవ్యలోటును అదుపులో ఉంచినట్లు చెప్పుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయాసపడుతున్నది. మచ్చుకు కొన్ని శాఖలు, పథకాల కేటాయింపులు, ఈ తొమ్మిది నెలల్లో చేసిన, గత సంవత్సరం ఇదే తొమ్మిది నెలల్లో చేసిన ఖర్చులు పోల్చి చూద్దాం.

మంత్రిత్వ శాఖ కేటాయింపు 2018-19 2019-20 గత సంవత్సరం కంటే
వ్యవసాయ శాఖ 138564 70 శాతం 49 శాతం 30 శాతం తగ్గింది
పౌరవిమానయాన శాఖ 4500 83శాతం 39 శాతం 42 శాతం తగ్గింది
గ్రామీణాభివృద్ధి శాఖ 119874 74 శాతం 70 శాతం 4 శాతం తగ్గింది
వైద్య ఆరోగ్య శాఖ 64559 71 66 5 శాతం తగ్గింది
ఆహార భద్రత 194512 83 69 14 శాతం తగ్గింది
స్త్రీ శిశు సంక్షేమం 29164 58 60 2 శాతం పెరిగింది
మానవ వనరుల శాఖ 94853 47 61 14 శాతం పెరిగింది

(Courtesy Nava Telangana)