నిబంధనలకు విరుద్ధంగా నిధులపై కేంద్రం కన్ను
– అధిక డివిడెండ్‌ కోసం డిమాండ్‌..!

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలను పీల్చిపిప్పి చేసే పనిని మోడీ సర్కార్‌ కొనసాగిస్తుంది. ఇప్పటికే ఆర్బీఐ నిధులను తోడేసుకోవడంతో పాటుగా పీఎస్‌యూల్లోని వాటాలను వేగంగా విక్రయిస్తున్నది. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థల నిధులపై కన్నేసింది. పీఎస్‌యూలు ఆర్జిస్తున్న లాభాల్లోంచి అధిక మొత్తంలో తమకు డివిడెండ్‌ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం నిబంధనలు (బుక్‌ రూల్స్‌) పక్కన పెట్టి అయినా అధిక చెల్లింపుల కోసం కసరత్తు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు 100 శాతం డివిడెండ్‌ లేదా ప్రతీ షేర్‌పై రూ.10 చొప్పున డివిడెండ్‌ రూపంలో అందించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) నవంబర్‌ 9న పిఎస్‌యుల ముఖ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ త్రైమాసికం ఫలితాల సమయంలోనూ అందించాలని కోరింది. సాధారణం గా అర్థ వార్షికానికి ఓసారి చెల్లిం పులు చేస్తూ ఉంటాయి. కాగా.. వచ్చే బడ్జెట్‌ అంచనాలు రూపొం దించకముందే ఈ డివిడెండ్లను ప్రకటించడం ద్వారా ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉంటుందని దీపమ్‌ పేర్కొంది.

పీఎస్‌యూలు ముందు పేర్కొన్న వార్షిక డివిడెండ్‌లలో ఒక్కటి లేదా రెండు వాయిదాల్లో దాదాపుగా 90 శాతం చెల్లింపులు చేస్తున్నాయని దీపమ్‌ గణంకాలు చెబుతున్నాయి. ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చాలా వరకు పీఎస్‌యూలు ఫిబ్రవరి లేదా మార్చిలో కేంద్రానికి పూర్తి డివిడెండ్‌లను అందిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కంపెనీల నికర లాభాల్లో 30శాతం లేదా నికర విలువలో 5శాతం.. ఇందులో ఏది గరిష్టంగా ఉంటుందో దాన్ని ఆధారంగా డివిడెండ్‌ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ప్రతీ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాల తర్వాత పీఎస్‌యూలు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో వార్షిక మధ్యంతర డివిడెండ్లు చెల్లిస్తే బాగుంటుందని దీపమ్‌ మరో సూచన చేసింది.