– రిజర్వుబ్యాంకు నిధులు కోరుతున్న కేంద్రం
– మొండిచేయి చూపుతున్న అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు
– బాండ్ల ద్వారా డౌటే…! కొండూరి వీరయ్య

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం మరోసారి రిజర్వుబ్యాంకు నుంచి డివిడెండ్‌ కోరుతున్నది. దీంతో 2019-20 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా ప్రభుత్వ ఆదాయం సమకూరటం లేదన్న విషయం తేటతెల్లమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1,76,000 కోట్లను డివిడెండ్ల రూపంలో ఆర్బీఐ నిధులు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,48,000 కోట్లు కూడా ఉన్నాయి. రోజురోజుకీ ప్రభుత్వ ఆదాయం పడిపోతుండటంతో అటు వివిధ శాఖలకు కేటాయించిన నిధులు విడుదల చేయటానికి వీలుకాక ప్రభుత్వం సతమతవుతున్నది. ఈ పరిస్థితుల్లో లోటు పూడ్చుకోవాలన్నా, ప్రభుత్వ వ్యయం తగ్గకుండా ఉండాలన్నా ప్రభుత్వం ముందున్న మార్గాలు మూడు. విదేశీ రుణాల కోసం జోలె పట్టుకోవటం. స్వదేశీ రుణాల కోసం బాండ్లు విడుదల చేయటం. ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వ నిధులు ఉపయోగించుకోవటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు ఏమంత సుముఖంగా లేవు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సైతం అందుకు అనుకూలంగా లేదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు తన నిబంధనలకు మించి భారతదేశానికి వివిధ పథకాల కింద రుణాలు ఇచ్చింది. అందువల్ల అదనపు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. అయినా అటువంటి విదేశీ రుణాలు నిర్దిష్ట ప్రాజెక్టు వ్యయాల కోసం వస్తాయి. నేరుగా కేంద్ర ఖజానాకు వచ్చే లోటును పూడ్చుకోవటానికి వెచ్చించేందుకు అంతర్జాతీయ నిబంధనలు అంగీకరించవు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) వంటి బహుళ దేశీయ ద్రవ్య సంస్థల నుంచి భారతదేశానికి రుణాలు వచ్చే మార్గం లేదు.

ఇక రెండో మార్గం దేశీయంగా బాండ్లు విడుదల చేయటం ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరించటం. ఇప్పటికే ప్రజల వద్ద పోగుపడాల్సిన పొదుపు మొత్తాలు పడిపోతున్నాయని 2019 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ పొదుపు రేటు పెంచేందుకు కొన్ని చర్యలూ సూచించింది. ఉపాధి లేదా మరో వనరు ద్వారా ప్రజలకు ఆదాయాలు వస్తే అందులో ఎంతోకొంత పొదుపు చేసుకునే అవకాశం ఉంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల కల్పన సామర్ధ్యం దారుణంగా పడిపోయింది. గత 42 ఏండ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో దేశాన్ని నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదని ప్రభుత్వ అధికారులు, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల వద్ద పొదుపు సొమ్ము పోగుపడటం, దాన్ని ప్రభుత్వం వివిధ అవసరాలకు వినియోగించుకోవటం సాధ్యం కాని పని. అంతే కాదు. నోట్ల రద్దు, డిపాజిటర్ల సొమ్ము బీమా బిల్లు వంటి రూపాల్లో ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. గత సంవత్సరం చివరకు డిపాజిటర్ల సొమ్ము బీమా బిల్లును ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వమే బాండ్లు విడుదల చేయటం ద్వారా నిధుల సమీకరించటం ఈ మార్గంలో ఉన్న ప్రత్యామ్నాయం. ఈ రకంగా బాండ్లు విడుదల చేయాలంటే కనీసం రెండు ప్రాతిపదికలుండాలి. ఒకటి ప్రభుత్వం మీద మదుపుదారులకు నమ్మకం. రెండోది ఆర్థికాభివృద్ది రేటు. గత ఆరేండ్లుగా ఆర్థిక వ్యవస్థ విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరించిన విధానాలతో ప్రభుత్వ ఆర్థిక సామర్ధ్యంపై ప్రజలకు నమ్మకం పోయింది. ఆర్థికాభివృద్ధి కూడా ఏడున్నర శాతం నుంచి ఐదుశాతానికి పడిపోతున్నదని స్వయంగా రిజర్వుబ్యాంకే చెప్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుతం బాండ్లు విడుదల చేయటం, ఆ బాండ్లను ప్రజలు కొనుక్కోవటం అంటే అసలు పెట్టుబడి కంటే తక్కువ మొత్తం తీసుకోవటానికి ప్రజలు సిద్ధం కావటమే. దీనికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి బాండ్లు విడుదల చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించటం లేదు. చివరకు మిగిలింది ఆర్బీఐ మూల నిధులు కాజేయటం.

ఆర్బీఐకి వివిధ కార్యకలాపాల ద్వారా ఆదాయం వస్తుంది. కొనుగోలు చేసిన ప్రభుత్వ బాండ్లు మీద వచ్చే వడ్డీ, విదేశీ మారకద్రవ్య నిల్వల అజమాయిషీలో వచ్చే లాభం, బ్యాంకులకు సమకూర్చే నిధులపై వచ్చే వడ్డీ ముఖ్యమైన మార్గాలు. ఈ విధంగా వచ్చిన ఆదాయంలో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా జోక్యం చేసుకోవటానికి కావల్సిన నిధులు పక్కన పెట్టి మిగిలిన సొమ్మును డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ బోర్డులోనే ఏకాభిప్రాయం లేదు. ఇలా ఇచ్చుకుంటూ పోతే సంక్షోభంలో పడినప్పుడు బ్యాంకింగ్‌ వ్యవస్థను ఆదుకోవటానికి ఆర్బీఐ వద్ద నిధులు ఉండవనీ, అదనపు కరెన్సీ అచ్చేసే స్థితికి నెట్టబడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అదనపు నోట్లు అచ్చేయటం అంటే 2008 సంక్షోభం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. 2008లో అమెరికాలో జేపీ మోర్గాన్‌ సహా ప్రధాన బ్యాంకులన్నీ కుప్పకూలాయి. వీటిని కాపాడటానికి అమెరికా ఫెడరల్‌ రిజర్వు (మన ఆర్బీఐ వంటిది) వద్ద గానీ అమెరికా ప్రభుత్వం వద్ద గానీ నిధులు లేవు. దీంతో కొత్త డాలర్లు అచ్చుకు సిద్ధమైంది. అదనపు డెవిడెండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నిస్తూ పోతే ఆర్బీఐ కూడా 2008నాటి అమెరికా రిజర్వు బ్యాంకు దుస్థితికి చేరనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా వివిధ మార్గాల్లో ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి రూ. 1,23,000 కోట్లను ఆర్జించిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కనీసం రూ. 35,000 కోట్ల నుంచి రూ. 45,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ రూపంలో కేంద్ర ఖజానాకు బదలాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐని కోరనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. యేటా ఈ విధంగా ఆర్బీఐ సొమ్మును స్వాహా చేయాలన్న ఆలోచన లేకపోయినా ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నందున ఈ మార్గం అనివార్యమైన మార్గంగా భావించినట్టు సదరు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిపాదనను ఈసారి కూడా అంగీకరిస్తే ఆర్బీఐ వరుసగా మూడేండ్ల పాటు కేంద్ర ఖజానా లోటు పూడ్చటానికి మధ్యంతర డివిడెండ్లు ఇచ్చి రికార్డు సృష్టించినట్టవుతుంది.

Courtesy Nava telangana