– రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీ వేదికగా నిలేద్దాం
– మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్‌ సూచన
– కేటీఆర్‌, తలసాని తరహాలో ఎదురుదాడి చేయాలంటూ దిశా నిర్దేశం
– శాసనసభ సమావేశాల నాటికి అంకెలు, సంఖ్యలతో సిద్ధంగా ఉండాలంటూ ఆదేశం

కేంద్ర బడ్జెట్‌లో నిధుల పరంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై యుద్ధం చేయాలని టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం మార్చిలో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు విడుదల చేసిన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌ తదితరులు చేసిన వ్యాఖ్యలకు.. ప్రతిగా ఇటీవల రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, తలసాని ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో సన్నద్ధం కావాలంటూ కేసీఆర్‌ ప్రజా ప్రతినిధులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నాటికి ఇందుకనుగుణంగా ప్రిపేర్‌ కావాలంటూ ఆయన ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతున్నట్టు కనబడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాబడులు తగ్గటంతోపాటు బడ్జెట్‌ కేటాయింపుల్లో మోడీ సర్కార్‌ తెలంగాణకు కోతలు విధించటమే దీనికి కారణం. కేంద్ర వైఖరి పట్ల టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో నిరసనకు దిగారు. ప్రతిగా బీజేపీ నేతలు, ఆ పార్టీకి చెందిన సీనియర్‌ మంత్రులు కేసీఆర్‌ సర్కారుపై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిగా కౌంటర్లు ఇవ్వాలంటూ సీఎం దిశా నిర్దేశం చేసినట్టు తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరేండ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో వెల్లడించారు.

తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు రూ.లక్షా 50 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు ఆమె తెలిపారు. ఇందులో పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1,289 కోట్లు, స్థానిక సంస్థల కోసం రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం పేరిట రూ.1,916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1,500 కోట్లను తెలంగాణకు విడుదల చేసినట్టు ఆమె వివరించారు. తద్వారా తెలంగాణకు చేయాల్సినదంతా చేశామనీ, ఇవ్వాల్సినంతా ఇచ్చామంటూ కమలం నేతలు స్వరం పెంచారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్టం దుర్వినియోగం చేసిందంటూ వాదించటం మొదలుపెట్టారు. వారి వాదనలకు అధికార పార్టీ నేతలు కౌంటర్‌ ఇవ్వటం ప్రారంభించారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం.. కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా చెల్లించిందని గుర్తుచేశారు. ఆ డబ్బులోంచి కేంద్రం కేవలం రూ.లక్షా 13 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి చెల్లించిందని వివరించారు. ఈ రకంగా మనం కేంద్రానికి ఇచ్చిన నిధులు.. అక్కడి నుంచి మనకొచ్చిన నిధుల మధ్య రూ.లక్షా 57 వేల కోట్ల అంతరముందని స్పష్టం చేశారు.

2014-15 నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు (రూ.కోట్లలో) సం. రాష్ట్రం చెల్లించిన పన్నులు కేంద్రం తిరిగి చెల్లించింది
2014-15 40,727 15,307
2015-16 52,250 21,745
2016-17 57,276 24,628
2017-18 52,996 24,479
2018-19 69,677 26,695

Courtesy Nava Telangana