పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప నిధుల్లేవు
విభజన హామీలు అమలవలేదు
ప్రతి బడ్జెట్‌కు ముందు కేంద్రానికి తెలంగాణ అర్జీలు

తెలంగాణకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో బడ్జెట్‌ సాయం అందడం లేదు.  ఆరేళ్లుగా కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మినహా ప్రత్యేకంగా నిధులేమీ రావడంలేదు. విభజన హామీలూ విస్మరించారు.  కొత్త డిమాండ్లను పట్టించుకోలేదు. రాష్ట్రానికి రూ.24,205 కోట్లను ఇవ్వాలని నీతి ఆయోగ్‌ మూడేళ్ల క్రితమే సిఫార్సుచేసినా.. ఒక్క పైసా విడుదలవలేదు. ఏకంగా రూ.లక్ష కోట్లు ఖర్చవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, చేయూతనివ్వాలనే వినతికీ కేంద్రం స్పందించలేదు. మిషన్‌ భగీరథ, కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలను కేంద్ర అధికార బృందాలు పలుమార్లు పరిశీలించి, ప్రశంసించాయి. అయినా ఆయా పథకాలకు నిధుల భరోసా లేకపోవడం గమనార్హం. ఆరేళ్లుగా కేంద్ర తోడ్పాటుకు రాష్ట్రం విన్నవించుకుంటున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాపై పూర్తి స్పష్టత ఉంటుంది. ఈ మేరకు ప్రతినెలా రాష్ట్ర ఖజానాకు దిల్లీ నుంచి నిధులు అందుతాయి. గత ఏడాదిగా మాత్రం ఏ నెల ఎంతమేరకు వస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. బడ్జెట్‌ అంచనాలకు, వాస్తవంగా కేంద్రం ఇస్తున్న నిధులకు పొంతనలేకుండా ఉంది.
* 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతం. 2014-15 నుంచి 2017-18 వరకు ఈ వాటా పెరిగినా తర్వాత క్రమంగా తగ్గింది. దీనికి ఆర్థికమాంద్యం ప్రభావమే కారణమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేస్తోంది.
* 2018-19లో రాష్ట్రానికి అందిన నిధుల వాటాకంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.2 శాతం అధికంగా పెరుగుతుందని 2019-20 బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఆ స్థాయిలో పెరగకపోగా 2.19 శాతం మేర తగ్గింది. పైగా మరింత తగ్గుతుందనే అభిప్రాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ విభాగాలు పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో రాష్ట్రానికి   రూ.8,177 కోట్లు వస్తాయని అంచనా వేయగా డిసెంబరు వరకు రూ.7942 కోట్లు అందాయి.

ఇవి ఇవ్వండంటూ అర్జీలు
* బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి.
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి.
* కాజీపేటలో వ్యాగన్‌ మరమ్మతు కేంద్రం నిర్మించాలి.
* రాష్ట్రానికి పసుపు బోర్డు మంజూరు చేయాలి.
* మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు నిధులివ్వాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సులను అమలు చేయాలి.
* రాష్ట్రంలోని పూర్వపు 9 జిల్లాలు ఒక్కోదానికి  రూ.50 కోట్లు చొప్పున కేంద్రం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను అందిస్తోంది. ఇకపై కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇవ్వాలి.
రూ.24,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు
మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లను, మిషన్‌ కాకతీయకు రూ.5,000 కోట్లను తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ 2016లో సిఫార్సు చేసింది. వీటికోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ప్రయోజనం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయిన సందర్భంలోనూ నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా, పథకాలకు అందించే నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్రానికి ప్రత్యేక నిధులు అందలేదు.

Courtesy Eenadu