•  తెలంగాణపై కేంద్రం వివక్ష
  • రావాల్సిన నిధుల్లో భారీ కోతలు..
  • పురోగతిపై ప్రతికూల ప్రభావం
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకూ నిధుల కొరత
  • పన్నుల్లో వాటా 41 శాతమే.. జీఎస్టీ పరిహారంపైనా స్పష్టత లేదు
  • కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. సీఎం కేసీఆర్‌ మండిపాటు
కేంద్రం మాటలకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతోంది. వారి మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం మోసం, దగా చేస్తోంది.
– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విషయంలో, నిధుల కేటాయింపులో మోదీ సర్కారు మోసానికి, దగాకు పాల్పడిందని ఆరోపించారు. గత ఏడాది బడ్జెట్‌లో ఇస్తామని చెప్పిన నిధుల్లో కోత విధించడమే కాకుండా.. తాజా బడ్జెట్‌లో అన్ని రంగాలకూ నిధులు కుదించారని విమర్శించారు. జీఎస్టీ పరిహారం ఇవ్వకపోవడం, రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్‌ సిఫారసులను అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందన్నారు. ఇది రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూసే అవకాశం ఉందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం మాటలకు, ఇచ్చే నిధులకు పొంతన లేకుండా పోతోందని, వారి మాటలను నమ్మితే శంకరగిరి మాన్యాలు తప్పవని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన 2020-21 బడ్జెట్‌ ప్రతిపాదనలపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్‌ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

పన్నుల వాటాలో భారీ తగ్గింపు..
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర్టాల వాటా రాజ్యాంగపరమైన హక్కు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని ఇస్తామని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. సవరించిన అంచనాల్లో దీనిని రూ.15,987 కోట్లకు కుదించారు. రూ.3,731 కోట్లు తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక తారుమారు అయింది. రాష్ట్రాలకు వాటా తగ్గించడం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థతే. 2019-20లో పన్నులు వసూలు చేసి, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సింది. ప్రతి సందర్భంలోనూ బడ్జెట్‌లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. కానీ, 2019-20కి సంబంధించి ఏకంగా 18.9 శాతం తగ్గడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ లోపానికి నిదర్శనం. దీని ప్రభావం రాష్ట్రంపై దారుణంగా పడింది.
రాష్ట్రానికి రెండు విధాలుగా నష్టం..
2020-21 బడ్జెట్‌ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది. ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. రెండు.. తెలంగాణకు గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటాగా రావాల్సిన నిధుల్లో రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి. ఇంత భారీగా నిధులు తగ్గించడం కచ్చితంగా వివక్షే. ఈ తగ్గుదల ప్రభావం రాష్ట్ర ప్రగతి ప్రణాళికలపై పడుతుంది. 2019-20కి సంబంధించి కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్రం.. 2020-21లో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. అంచనాలు సవరించే నాటికి ఎంత తగ్గిస్తారో తెలియదు. కేంద్రం మాటలకు, నిధులకు సంబంధం లేకుండా పోతోంది. వారి మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.
జీఎస్టీ విషయంలోనూ మోసం..
జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం మోసం, దగా చేస్తోంది. 14 శాతంలోపు ఆదాయ వృద్ధిరేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్లపాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణకు పరిహారంగా ఇంకా రూ.1137 కోట్లు రావాలి. ఈ నిధుల విడుదల పైనా స్పష్టత ఇవ్వలేదు. పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌ వచ్చేసరికి రూ.148 కోట్లు తగ్గించి.. కేవలం రూ.889 కోట్లు కేటాయించారు. 14.3 శాతం కోత పెట్టారు. భగీరథ, కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్లు సాయం చేయాల్సిందిగా నీతి ఆయోగ్‌ సిఫారసులు చేసింది. వీటిని అమలు చేయాలని కేంద్రానికి అనేకసార్లు విన్నవించాం. వారు పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించేందుకు పాజెక్టులు నిర్మించాం. వీటికి కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించినా నిధులు కేటాయించలేదు. తెలంగాణ అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత అందివ్వాలని కోరినా.. బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు.
అన్ని ప్రధాన రంగాలకూ కోతలు..
దేశంలో చాలా నెలలుగా నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలూ ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు నిధులు తగ్గించడం దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. వ్యవసాయ రంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21లో 3.39 శాతం మాత్రమే కేటాయించారు. వైద్య ఆరోగ్య రంగానికీ 2.24 శాతం నుంచి 2.13 శాతానికి, గ్రామీణాభివృద్ధికి 4.37 శాతం నుంచి 3.94 శాతానికి, విద్యా రంగానికి 3.37 శాతం నుచి 3.22 శాతానికి నిధుల కేటాయింపు తగ్గించారు’’ అని కేసీఆర్‌ విమర్శించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy Andhrajyothi