కొత్త కాలేజీలు, వర్సిటీల ప్రస్తావనే లేని కేంద్ర బడ్జెట్‌
ప్రయివేటు కాలేజీలదే హవా
మొత్తం బడ్జెట్‌లో విద్యారంగం వాటా 4.1శాతం నుంచి 3.3శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ : ఉన్నతవిద్యారంగానికి ఇటీవల జరిపిన బడ్జెట్‌ కేటాయింపులు, మోడీ సర్కార్‌ ఇస్తున్న ప్రాధాన్యతపై విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగాన్ని క్రమ క్రమంగా ప్రయివేటుకు వదిలేయాలన్న దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం కళాశాలల్లో 77శాతం ప్రయివేటువే ఉన్నాయి. ప్రభుత్వరంగంలో వర్సిటీలు, కాలేజీల సంఖ్య పెరగక…రెండింట మూడొంతుల విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయివేటు వైపు చూడాల్సి వస్తున్నది. మరోవైపు వర్సిటీల్లో ఫీజులు పెంచుతున్న తీరు గ్రామీణ పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేస్తున్నది. అనేక కుటుంబాలు అనివార్యంగా…ఆస్తులు కుదవపెట్టి తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాల్సి వస్తున్నది. వాస్తవ పరిస్థితులు ఓవైపు ఇలా ఉంటే, ఉన్నత విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యాతా దక్కలేదనీ, వ్యయాన్ని తగ్గించుకునే ఆలోచనలోనే పాలకులు ఉన్నారనీ విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘నేషనల్‌ మిషన్‌ ఫర్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌’కు జరిగిన నిధుల కేటాయింపును వారు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ పథకానికి 2018-19లో రూ.2100కోట్లు కేటాయించగా, చేసిన వ్యయం (సవరించిన అంచనా) రూ.1380కోట్లు మాత్రమే.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం
-‘ నేషనల్‌ మిషన్‌ ఫర్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ‘ కార్యక్రమం కింద గత బడ్జెట్‌లో ఎస్సీ విద్యార్థులకు రూ.412కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.50కోట్లు ఇచ్చి…’మమ’ అనిపించారు.
– అలాగే ఎస్టీ విద్యార్థులకు గత బడ్జెట్‌లో రూ.222కోట్లు కేటాయించగా, ఈసారి రూ.25కోట్లకు తగ్గించారు.
– ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు గతంలో రూ.39కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.15కోట్లకు తగ్గించారు.
– అలాగే ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌కు కూడా నిధుల కేటాయింపు రూ.19కోట్ల నుంచి రూ.8కోట్లకు తగ్గించారు.

బేటీ బచావో…బేటీ పడావో’ గురించి మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోగా, ఆ శ్రద్ధ బడ్జెట్‌లో మాత్రం కనిపించలేదనే చెప్పాలి. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.280కోట్లుకాగా, ఖర్చు అయిన మొత్తం (సవరించిన అంచనాలు) రూ.200కోట్లు. తాజా బడ్జెట్‌లో(2020-21) నిధుల్ని మరింత తగ్గించి కేవలం రూ.220 కోట్లు మాత్రమే కేటాయించారు. 2018-19లో చేసిన వ్యయం కన్నా ఇది తక్కువ.
– మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి గతంలో 4.1శాతం (2014-15) వాటా దక్కితే…నేడు అది 3.3శాతానికి తగ్గింది. వార్షిక జీడీపీలో…విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం 0.55శాతం నుంచి 0.44శాతానికి పడిపోయింది. పాఠశాల విద్య కోసం ‘సమగ్ర శిక్షా అభియాన్‌’ కార్యక్రమాలకు కావాల్సిన నిధులన్నీ ప్రజలు సమకూర్చినవే. పెట్రోల్‌, డీజిల్‌ సహా అనేక వస్తువులపై, సేవలపై ‘ఎడ్యుకేషన్‌ సెస్‌’ను కేంద్రం వసూలుచేస్తున్నది. ఈవిధంగా సమకూరిన నిధుల్ని సైతం సమర్థవంతంగా వినియోగిస్తున్నారా? అంటే అనుమానమే?

Courtesy Nava Telangana