వినియోగదారుల కొనుగోలు సర్వే విడుదలచేయం
నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ చైర్మెన్‌
సర్వేను బయటపెట్టాలనుకున్నా కుదర్లేదు : చైర్మెన్‌ బిమల్‌ రారు
ప్రభుత్వం ఇలా చేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి : గణాంక నిపుణులు

వినియోగదారుల కొనుగోలుసర్వే గణాంకాలు అత్యంత కీలకమైనవి. ఈ సర్వే గణాంకాల్ని ఆధారంగా చేసుకొని జీడీపీతో సహా వినియోగదారుల ధరల పట్టిక, ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరలు, రూపాయి సామర్థ్యం, స్థిరత్వం, లేబర్‌ మార్కెట్‌…వంటివన్నీ నిర్ణయిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సర్వే వివరాల్ని మోడీ సర్కార్‌ విడుదల చేయనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వతంత్ర సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) నివేదికను అడ్డుకోవటం బహుశా దేశ చరిత్రలో ఇంతకుముందెన్నడూ జరగలేదని గణాంక నిపుణులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ : ఎన్‌ఎస్‌ఓ 2017-18 ‘వినియోగ దారుల కొనుగోలు’ సర్వే కొద్ది నెలల(నవంబరు, 2019లో) క్రితమే లీకైంది. అయితే అధికారికంగా బయటకు రాలేదు. ఇంతకీ ఆ సర్వేలో ఏముందంటే, భారతదేశంలోని వినియోగదారుల కొనుగోలు శక్తి పడిపోయింది. 2011-12లో సగటు పౌరుడి నెలవారి కొనుగోలు రూ.1501 ఉంటే, 2017-18నాటికి రూ.1446కి పడిపోయింది. 40ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పౌరుల కొనుగోలు 3.7శాతం పడిపోయింది. ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉండే ఆస్కారముంది. ఇదీ..’ఎన్‌ఎస్‌ఓ’ జరిపిన ‘వినియోగదారుల కొనుగోలు శక్తి’ సర్వేలో తేలిన ముఖ్యమైన అంశం. దేశ ఆర్థిక పరిస్థితికి సంబం ధించి ఇది చాలా కీలకమైన సర్వే. సూక్ష్మఆర్థిక రంగానికి సంబంధించి వివిధ గణాంకాల రూపకల్పనలో (బేస్‌ ఇయర్‌) ఈ సర్వే కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి ఈ సర్వే వివరాలు బయటకు వెల్లడించటం లేదని ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’ (ఎన్‌ఎస్‌సీ) చైర్మెన్‌ బిమల్‌ కుమార్‌ రారు మంగళవారం వెల్లడించారు.

కమిషన్‌ సభ్యులు అడ్డుకున్నారు : చైర్మెన్‌ బిమల్‌ రాయ్
సర్వే ఎందుకు చేశారు? ఎందుకు విడుదల చేయటం లేదు? అని బిమల్‌ కుమార్‌ రాయ్ను విలేకర్లు ప్రశ్నించగా… ”వినియోగదారుల కొనుగోలు సర్వేలోని గణాంకాలు నాలుగు దశాబ్దాల కనిష్టస్థాయికి పడిపోయాయి. వాస్తవానికి ఆ సర్వేను విడుదల చేయడానికి ప్రయత్నించాను. ఈ ఏడాది జనవరి 15న జరిగిన కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ) సభ్యుల సమావేశంలో ప్రతిపాదన కూడా పెట్టాను. అయితే మిగతా సభ్యుల నుంచి నాకు మద్దతు లభించలేదు. ఒక చైర్మెన్‌గా ప్రతిపాదన పెట్టగలిగాను. ఇంతకుమించి నేను మీకు ఏమీ చెప్పలేను” అని అన్నారు.

కమిషన్‌ తీరు వివాదాస్పదం!
సర్వే బయటకు రాకుండా కమిషన్‌లోని ముఖ్య గణాంకాధికారి అడ్డుకున్నారని వార్తలు వెలువడ్డాయి. మరో సభ్యుడు సర్వేలో తేలిన గణాంకాలపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఇది బయటకు రావడానికి వీల్లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో కమిషన్‌(ఎన్‌ఎస్‌సీ) తీరు పారదర్శకంగా లేదన్న మాటలు వినపడుతున్నాయి. అందులోని సభ్యులు మోడీ సర్కార్‌ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఆపే ప్రయత్నం వారు చేస్తున్నారని తెలిసింది.

నిపుణులు ఏమంటున్నారు?
మనదేశంలో ‘వినియోగదారుల కొనుగోలు పడిపోవటం’ ఇదే మొదటిసారి. దేశంలో పేదరికం పెరిగిందనే విషయం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వేలోని గణాంకాల్ని ఆధారంగా చేసుకొని దేశ ఆర్థికస్థితిని తెలియజేసే ఇతర సూచికలు రూపొందిస్తారు. కానీ అది జరి గే అవకాశం లేదు. వినియోగదారుల ధరల పట్టిక, ద్రవ్యోల్బణం, నిత్యా వసర సరుకుల ధరలు, రూపాయి సామర్థ్యం, స్థిరత్వం…మొదలైన వాటి గణాంకాల రూపకల్పనలో ‘వినియోగదారుల కొనుగోలు’ సర్వేను పక్కకు పెట్టాలని కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ) ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

లీకేజ్‌ అయితే గానీ తెలియలేదు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్వతంత్ర హోదా ఉన్న సంస్థ ‘నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌’. ‘జాతీయ గణాంక కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) ద్వారా దేశ ఆర్థికరంగానికి సంబంధించి అనేక సర్వేలు నిర్వహిస్తారు. తద్వారా దేశానికి సంబంధించి అనేక ఆర్థిక గణాంకాల్ని రూపొందిస్తారు. వీటిని పరిగణనలోకి తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. వివిధ కార్యక్రమాల్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన ‘వినియోగదారుల కొనుగోలు’ సర్వేను కేంద్రం విడుదల చేయలేదు. 2012తో పోల్చుకుంటే 2018నాటికి పౌరుల కొనుగోలు శక్తి పడిపోయిందని (3.7శాతం) సర్వే తేల్చింది. ఈ నివేదిక గత ఏడాది నవంబరులో లీకేజ్‌ అవ్వటంతో వాస్తవాలు బయటకొచ్చాయి.

Courtesy Nava Telangana