‘‘మూక్ నాయక్’’కి వందేళ్లు (31-01-1920-2020)

మనోజ్ శర్మ 

న్యూఢిల్లీ:- బి.ఆర్.అంబేద్కర్ జీవితం గురించి అశోక్దాస్ ఎంతో అనర్గళంగా మాట్లాడతాడు. రాజ్యాంగ పితగానే కాక ఓ ఎడిటర్ గా, జర్నలిస్టుగా కూడా అంబేద్కర్ అశోక్ దాస్ లో స్ఫూర్తిని రగిలించారు‌. దళిత్ దస్తక్ అనే మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడైన 35 ఏళ్ల అశోక్ దాస్ ఈస్ట్ ఢిల్లీలోని పాండవ్ నగర్లోని తన ఆఫీసులో కూర్చుని “అంబేద్కర్ జర్నలిస్టుగా చేసిన సేవలు ఎవరికీ పెద్దగా తెలీకుండా పోయాయి” అన్నారు. అశోక్ దాస్ ఆఫీసులో గోడకి అంబేద్కర్ చిత్రపటం,ఆయన స్థాపించిన మూక్ నాయక్ అనే వార్తాపత్రిక మొదటి పేజీ చిత్రపటం వేలాడదీసి ఉంటాయి. “ఇండియా 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా,అంబేద్కర్ జర్నలిజాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ జనవరి 31 తేదీని దళితులు తమ భావవ్యక్తీకరణ స్వేచ్ఛని సాధించిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాం”.

1920,జనవరి 31 న అంబేద్కర్ మూక్ నాయక్ వార్తాపత్రికని ప్రారంభించి వందేళ్లు పూర్తికానున్నాయి ఆ రోజుకి. తర్వాత అంబేద్కర్ గారు బహిష్క్రిత్ భారత్,జనతా మరియు ప్రబుద్ధ భారత్ అనే ఇంకో మూడు మరాఠీ వార్తాపత్రికలనీ ప్రారంభించారు.

“అంబేద్కర్ పై పూర్తిస్థాయిలో విశ్లేషణ జరగలేదు. ఆయన్ని కేవలం దళిత చిహ్నంగా,రాజ్యాంగ రచయితగా మాత్రమే చిత్రీకరించారు” అంటారు జవహర్ లాల్ యూనివర్సిటీలో సోషియాలజీ అధ్యాపకుడు ప్రొఫెసర్ వివేక్ కుమార్. “మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్షపాత ధోరణులు గమనించి స్వాతంత్ర్య పోరాటం,దళితులపై జరిగే అఘాయిత్యాలని ప్రజల ముందుకి తీసుకురావాలని భావించి తనే సొంతంగా ఆ వార్తాపత్రికలన్నీ ప్రారంభించారు”.

ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఓ చిన్న ఆఫీసులో మరాఠీ పక్షపత్రిక మూక్ నాయక్ ప్రారంభించే నాటికి అంబేద్కర్ వయసు 29 ఏళ్లు. ఆ పత్రిక కోసం రాసిన మొదటి సంపాదకీయంలో “మనపై జరుగుతున్న అరాచకాలని ఎదుర్కోవాలంటే వార్తాపత్రికలని మించిన ఆయుధం మరొకటి లేదు. మనపై జరిగిన,జరుగుతున్న, భవిష్యత్తులో కూడా జరగబోయే అఘాయిత్యాలకి వ్యతిరేకంగా పోరాడుతూ న్యాయ సాధనలో మనకి తోడ్పడతాయి” అని రాసారు.

తన వార్తాపత్రికలో అంటరానితనం గురించి డజన్ల కొద్దీ సంపాదకీయాలు అంబేద్కర్ గారు రాసారు. ఇండియాకి గనక స్వరాజ్యం సిద్ధిస్తే కులాల వారీగా జనాలకి ప్రాతినిధ్యం లభించాలని డిమాండ్ చేసారు. “స్వరాజ్యం కోసం పోరాడుతున్న నాయకులు,అంబేద్కర్ ఆ దిశగా జరుగుతున్న పోరాటానికి అడ్డంకిగా మారాడని భావించారు,అందుకే వారికి మూక్ నాయక్ పట్ల సదభిప్రాయం ఉండేది కాదు” అని ఢిల్లీ యూనివర్సిటీ హిందీ అధ్యాపకుడు ప్రొఫెసర్ షియోరాజ్ సింగ్ బేచైన్ పేర్కొన్నారు. ఆయన “దళిత జర్నలిజంపై జర్నలిస్ట్ అంబేద్కర్ ప్రభావం” అనే అంశంపై పీహెచ్డీ రీసెర్చ్ నిర్వహించారు.

కొల్హాపూర్ పాలకుడు ఛత్రపతి షాహూ మొదటి పెట్టుబడి 2500 రూపాయలతో ప్రారంభమైన మూక్ నాయక్ పత్రిక 1922 లో ఆయన చనిపోవడంతో మూతపడింది.

పేరులో ఏముంది?. : ఐతే అక్కడితోనే అంబేద్కర్ జర్నలిజం అంతమవ్వలేదు. 1927 ఏప్రిల్ లో విరాళాలు సేకరించి ఓ ప్రింటింగ్ ప్రెస్ కొని దానికి భారత్ భూషణ్ ప్రింటింగ్ ప్రెస్ అని పేరు పెట్టారు. తాగునీరు అందరికీ అందాలనే డిమాండ్ తో జరిగిన పోస్ట్ మహద్ నిరసనల సమయంలోనే తన ఇంకో పక్షపత్రిక బహిష్క్రిత్ భారత్ ని అంబేద్కర్ ప్రారంభించారు.

1927,మార్చి 20న అంబేద్కర్ నాయకత్వంలో బయల్దేరిన మహద్ సత్యాగ్రహ, మహారాష్ట్రలోని మహద్ ప్రాంతంలో పబ్లిక్ ట్యాంక్ నీటిని అంటరాని వారు కూడా వాడుకునే అనుమతినివ్వాలని డిమాండ్ చేసింది.

బహిష్క్రిత్ భారత్ లో ఆయన రాసిన సంపాదకీయాల ద్వారా అంటరానితనంపై పోరాటం ఎలా జరగాలో వివరించారు. దళితులకి తాగునీటి ట్యాంకుల దగ్గరా,గుడులలోకి ప్రవేశం గురించి తన పేపర్లో చాలాసార్లు డిమాండ్ చేసారు.

ఐతే ఆర్థిక ఇబ్బందులతో బహిష్క్రిత్ భారత్ కూడా 1929 లో మూతపడింది. 1930 లో అంబేద్కర్ జనతా అనే ఇంకో పక్షపత్రికని ప్రారంభించారు. 1954 లో ప్రబుద్ధ భారత్ గా పేరు మార్చి,1956 నాటికి తన అనుచరులందరూ బుద్ధిజం స్వీకరించే ప్రక్రియ సందర్భంగా ప్రబుద్ధ భారత్ ని వారపత్రిక గా కూడా మార్చారు.

అంబేద్కర్ ఎప్పటికప్పుడు కొత్త పేర్లతో వార్తాపత్రికలని ప్రారంభించేవారని,ఆ పేర్లు ఆయా కాలాల పరిస్థితులని ప్రతిబింబించే విధంగా ఉండేవని,ఆ పరిస్థితులు మారగానే తన వార్తాపత్రికల పేర్లూ మార్చేవారని ప్రొఫెసర్ బేచైన్ అన్నారు. తమకంటూ ఓ స్వరం లేని స్థానం నుంచి విద్యావంతులుగా ఎదిగే స్థాయికి దళితులు చేరుకున్న ప్రయాణాన్ని అంబేద్కర్ వార్తాపత్రికలు ప్రతిబింబించాయి.

మూక్ నాయక్,బహిష్క్రిత్ భారత్ వ్యవహారాలన్నీ అంబేద్కర్ గారే స్వయంగా చూసుకున్నా,1930 తర్వాత మాత్రం తన సీనియర్ కొలీగ్స్ ఐన దేవ్ రావ్ విష్ణు నాయక్,బి.ఆర్.కద్రేకర్,జి.ఎన్.సహస్త్ర బుద్ధే,ఆర్.డి.భండారే మరియు బి.సి.కాంబ్లేలకి అప్పజెప్పారు. ఇందులో నాయక్,కాంబ్లే,సహస్త్ర బుద్ధే దళితులు కారు‌.

అంబేద్కరైట్ జర్నలిజంలో కొత్త తరంగం: దళిత్ దస్తక్ ఆఫీసులో అశోక్ దాస్ పలు ఫోన్ కాల్స్ తో బిజీగా ఉన్నారు. జనవరి 31 న ఢిల్లీలోని డాక్టర్.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో తను నిర్వహించబోయే ఈవెంట్ గురించి వివిధ దళిత పబ్లికేషన్స్ ఎడిటర్లతో చర్చల్లో మునిగిపోయారు. ఈవెంట్లో అంబేద్కరైట్ సంచికలూ,జర్నల్స్ పై చర్చతో పాటూ వందేళ్ల అంబేద్కర్ జర్నలిజంపై సెమినార్ కూడా ఉంటుంది.

“తమకంటూ ఓ స్వరం లేని వారందరికీ అంబేద్కర్ తన మూక్ నాయక్ ద్వారా ఓ అవకాశం కల్పించారు. ఆయన దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో మీడియా సంస్థలు ప్రారంభించాలనుకునే యువతకి స్ఫూర్తి అని అశోక్ దాస్ పేర్కొన్నారు. దాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో జర్నలిజం చదివి ఏడేళ్ల క్రితం దళిత్ దస్తక్ అనే మాసపత్రిక ప్రారంభించారు. తన మ్యాగజైన్ ని,సుమారు ఆరు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించడానికి దాస్ దగ్గర ఐదుగురు సిబ్బంది కూడా పనిచేస్తున్నారు‌.

ఈ సంచిక ప్రారంభించే ముందు నేను చాలా హిందీ న్యూస్ రూమ్స్ లో చాలా వివక్షని ఎదుర్కొన్నానని దాస్ అన్నారు‌. అంబేద్కర్ తన పత్రిక మొదలుపెట్టి వందేళ్లైనా నేటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దళిత అంశాలని కవర్ చేసే తీరులో ఎలాంటి మార్పూ రాలేదని వాపోయారు‌. అందుకే చదువుకున్న దళితులందరూ తామే స్వంతంగా మీడియా సంస్థలని మొదలుపెడుతున్నారు. ఇంటర్నెట్ వల్ల ఇది మరింత సులభతరం కూడా అయ్యింది.

ప్రస్తుతం సుమారు 150 వరకూ దళిత్ దస్తక్,నేషనల్ దస్తక్,ఫర్క్ ఇండియా,రౌండ్ టేబుల్ ఇండియా,ఫార్వర్డ్ ప్రెస్,జస్టిస్ న్యూస్,వెలివాడ,దళిత్ కెమెరా,దళిత్ న్యూస్ నెట్వర్క్ లాంటి ప్రింట్,ఆన్ లైన్ పబ్లికేషన్స్,యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. అన్నింట్లోనూ షెడ్యూల్డ్ కాస్ట్,వెనుకబడిన వర్గాల వారికి సంబంధించిన అంశాలపై అబిప్రాయాలూ,వార్తలూ ప్రచురితమౌతున్నాయి.

ఈ సంస్థల వ్యవస్థాపకులందరూ వృత్తిపరంగా జర్నలిస్టులే ఐనప్పటికీ 33 ఏళ్ల వైభవ్ కుమార్ లాంటి కొంతమందికి మాత్రం జర్నలిజంలో ఎలాంటి పూర్వానుభవమూ లేదు. ఆయన రెండేళ్ల క్రితం ఎల్ ఐ సీ లో డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ మానేసి దళిత్ న్యూస్ నెట్వర్క్ అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. “మేము అగ్రకులాలని దూషించము,ఎందుకంటే అది కులభావనని మరింత వృద్ధి చేస్తుందే తప్ప తగ్గించదు. దళిత అంశాలపై గ్రౌండ్ రిపోర్ట్స్,విశ్లేషణలు అందిస్తుంటాం” అని వైభవ్ కుమార్ అన్నారు.

అశోక్ దాస్ లాగే చాలామంది తమ స్వంత వెంచర్స్ ని ప్రారంభిస్తున్నారు‌. 32 ఏళ్ల వేద్ ప్రకాశ్ ఐఐఎంసీలో హిందీ జర్నలిజం చదివి చాలా వార్తాపత్రికల్లో పనిచేసారు. ఆ తర్వాత 2017 డిసెంబర్ లో యాక్టివిస్ట్ వేద్ అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు.

“నేను ఒక టీచర్ ని, దళితులకి సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమైన విషయాలని అందరికీ చేరవేయాలని జర్నలిస్టుగా మారాలని నిర్ణయించుకున్నా. ఐతే మెయిన్ స్ట్రీమ్ మీడియా లో చేరాక నా స్టోరీలేవీ ప్రచురితం కాకపోతుండడంతో నిరాశ చెందాను” అని వేద్ చెప్పారు‌.

2016 లో జాబ్ మానేసి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. సుమారు ఆరు లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈ ఛానల్ ని వేద్ ఒక్కరే నిర్వహిస్తారు. మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు రికార్డ్ చేస్తారు. యూట్యూబ్ అడ్వర్టైజింగ్ ద్వారా వారికి ఆదాయం వస్తుంది. “ఈ ఛానల్ ఇంత విజయవంతం అవుతుందని నేను ఊహించలేదు,అంబేద్కర్ జర్నలిజం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది,ఆయనే మొట్టమొదటి దళిత జర్నలిస్టు” అని వేద్ ప్రకాష్ అన్నారు.

పాట్నాలోని నవాడా ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ ఛత్రవాస్ లో వేద్ ప్రకాష్ మరికొంతమంది జర్నలిస్టులతో కలిసి జనవరి 31 న బహుజన పత్రకారిత దివస్ ని జరుపుకోబోతున్నారు. “త్వరలోనే నేను నా టీమ్ ని విస్తరించబోతున్నాను” అని ప్రకాష్ అంటున్నారు.

ఈ వెంచర్స్ అన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి‌. “అంబేద్కర్ తన వార్తాపత్రికలని ప్రారంభించినప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా ఉండడం చాలా విచారకరం” అని మీడియా మే దళిత్ పుస్తక రచయిత సంజయ్ కుమార్ వాపోయారు.

ఐతే ఇంటర్నెట్ మూలంగా తమ రోల్ మోడల్ అంబేద్కర్ లాగా ఇప్పటి తరానికి చెందిన దళిత మీడియా,జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవడం లేదు

Courtesy: Hindustan times