వైద్య విద్యా సంస్థల్లో పడగలెత్తిన హైందవ నాగరాజు

బాగా చదువుకున్న డాక్టర్లలో కులవివక్ష ఉంటుందా? కులం-మతం పేరిట సహచర వైద్యుణ్ని వాళ్లు వేధిస్తారా! కొందరికి ఇది ఆశ్చర్యకరమైన విషయమే అయి ఉండవచ్చు గాక. కానీ 100% వాస్తవం. ముంబైలో డాక్టర్ పాయల్ ఆత్మహత్య ఈ కుల విద్వేష దారుణాన్ని మరోసారి మన ముందుకు తెచ్చింది.

మనం 21వ శతాబ్దంలో ఉన్నామని భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా మారగలదని ఒకపక్క పాలకవర్గాలు గొప్పలకు పోతుంటాయి. పట్టణీకరణ వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కుల, మత వివక్షలకు కాలం చెల్లిందని సోకాల్డ్ ఆధునికవాదులు వాదిస్తుంటారు. ఇదంతా బూటకపు మాటలని డా . పాయల్ ఉదంతం నిరూపిస్తున్నది.

కుల వివక్ష నేటికీ మన కార్యాలయాల్లో, ఫ్యాక్టరీల్లో వ్యాపార సంస్థలలో, విద్యాసంస్థల్లో, కాలనీల్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తూనే ఉన్నది. 2010లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చి ఢిల్లీఎయిమ్స్ లో ఎంబిబిఎస్ చదువుకుంటున్నబాలముకుంద్ భారతి అనే దళిత వైద్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. 2012లో అనిల్ కుమార్ మీనాది ఇదే పరిస్థితి. నిజానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని దళిత ఆదివాసీ విద్యార్థులపై జరుగుతున్న అగ్రకుల దాష్టీకాలపై అధ్యయనం చేయటానికి ప్రభుత్వం 2007లోనే ప్రొఫెసర్ సుఖదేవ్ థోరాట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. అధ్యాపకులనుండి తమకు సరైన సహకారం అందలేదంటూ 69శతం మందిఎస్సి, ఎస్టీ విద్యార్థులు ఫిర్యాదు చేసారు.టీచర్లు తమని చులకనగా చూస్తున్నారనిఅసలు అందుబాటులో ఉండటానికి ఇష్టపడరని 50 శాతం మంది విద్యార్థులుఅన్నారు. తమ పరీక్షా పత్రల్ని, సక్రమంగా మదించరని తమకు తక్కువ మార్కులు వేస్తున్నారనిపెద్ద సంఖ్యలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వాపోయారు. ఇది 76 నుంచి 86 శాతం వరకు ఉంది. ప్రాక్టికల్స్ వైవాలో కూడా తమ పట్ల వివక్ష చూపుతున్నారని 85%మంది అన్నారు. హాస్టల్స్ళ్లలో తాము తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నామని చెప్పారు విద్యార్థులే కాదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ కూడా ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారని థోరట్ పోరాట కమిటీ పరిశీలనలో వెల్లడైంది.

ఢిల్లీ వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాలలోనూ ఇలాంటి తరహా వివక్ష పోకడలను ముంగ్రేకర్ కమిటీ బయటపెట్టింది. విద్యార్థులను వేధిస్తున్న ఫ్యాకల్టీ సస్పెన్షన్ , బాధితులకు ఒక్కొక్కరికి రూ 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ రెండు కమిటీలు చేసిన సిఫార్సులు సక్రమంగా అమలు కావడం లేదు. తరతరాలుగా మన విద్యాసంస్థలు నిజానికి అన్నీ సంస్థలు కూడా అగ్రహారాలుగా మారిపోయాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లు ఈ అగ్రహారాల్ని ఎంతో కొంత బద్దలుకొట్టాయి. దళిత బహుజన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశం కల్పించబడింది దీంతో అగ్రవర్ణాల వారు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు పూనుకున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని అనునిత్యం రకరకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. రోహిత్ నుంచి డా . పాయల్ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే. చట్టాల పతిష్ట అమలు కోసం సంఘటిత పోరాటాలు, బహుజన మైనార్టీల ఐక్య సంఘటన, నిరంతర కార్యాచరణ మాత్రమే ఇలాంటి దారుణాలు మళ్లీ మళ్లీ కొనసాగకుండా అడ్డుకోగలదు

[avatar user=”bhaskar@desidisa.com” size=”thumbnail” align=”right” /]

బి. భాస్కర్ 

(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు),
మొబైల్ 9 9 8 9 6 9 2 0 0 1