కరోనా వైద్యానికి డబ్బులు కక్కాల్సిందే
జాబితాలోని ఆస్పత్రుల్లోనూ అదే పోకడబిల్లులు పెట్టుకోవాలంటూ సూచనలు
ప్రభుత్వ రేట్లకు ఏడింతలు వసూళ్లు
ఐసీయూలో రోజుకు 50 వేల వసూలు
వెంటిలేటర్‌ పెడితే రూ.60-70 వేలు
సాధారణ గదికి రోజుకు రూ.20 వేల ఫీజు
పది రోజుల చికిత్సకు రూ.6-7 లక్షల ఖర్చు
సీరియస్‌ కేసులొస్తే తిప్పి పంపేస్తారు
ఆందోళనలో మధ్యతరగతి ప్రజలు

హైదరాబాద్‌: అనారోగ్యం వచ్చినపుడు ఆదుకుంటాయని రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు భారీ ఎత్తున ఆరోగ్య బీమా పథకాలకు డబ్బులు కడుతున్నారు. బిల్లులు పెట్టుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం కావడంతో ఎక్కువ మంది నగదు రహిత ఆరోగ్య బీమాకే మొగ్గు చూపుతున్నారు. కరోనా రాకముందు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత హెల్త్‌ కార్డులుంటే రెడ్‌ కార్పెట్‌ పరిచేవారు. కొన్ని సేవలకు మాత్రమే డబ్బులు కట్టించుకొని మొత్తం బీమా వర్తించే విధంగా ఆసుపత్రులు సహాయపడేవి. అయితే, కరోనా కష్టకాలంలో పరిస్థితి మారింది. క్యాష్‌లెస్‌ ఆరోగ్య బీమా సామాన్యుడిని ఆదుకోవడం లేదు. ఆసుపత్రులు తాము అంగీకరించే బీమా ఉన్నప్పటికీ డబ్బులు కడితేనే చేర్చుకుంటున్నాయి. కావాలంటే బిల్లులిస్తాం… క్లెయిమ్‌ చేసుకోమంటున్నాయి.

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో నివాసముంటున్న ఓ ఉద్యోగి భార్యకు ఇటీవల కరోనా పాజిటివ్‌ అని తేలింది. కుటుంబం కోసం ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీ హెల్త్‌కార్డు ద్వారా ఆమెను ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించాడు. బీమా సంస్థ జాబితాలో సదరు ఆస్పత్రి ఉంది. అయితే, ఆ బీమాలో కరోనా చికిత్సకు అవకాశం లేదని, నగదు చెల్లిస్తేనే చికిత్స చేస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో అదే ఆస్పత్రిలో రూ.లక్ష డిపాజిట్‌ చేసి భార్యకు 5రోజుల నుంచి చికిత్స ఇప్పిస్తున్నాడు. తర్వాత మరో లక్ష చెల్లించాడు. మొత్తంగా రూ.2.5 లక్షలు కట్టాల్సి వస్తుందని ఆయన చెప్పాడు. ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకన్నా ఎన్నోరెట్లు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. టెస్టింగ్‌ ఐసొలేషన్‌కు రూ.4 వేలు, ఐసీయూలో ఒక్క రోజుకు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తే రూ.9వేలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే కొన్ని ఆస్పత్రులు.. సాధారణ గదికి పది రోజులకు రూ.2 లక్షలు, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ.30-50 వేలు, శ్వాసకోశ సమస్య, డయాలసిస్‌ బాధితులకు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ.60 నుంచి రూ.70 వేలు తీసుకుంటున్నాయి. పది రోజుల చికిత్సకు రూ.6-7 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాదుడుపై మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఇతర వ్యాధులున్న వారు కరోనాతో వస్తే
హన్మకొండకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి రెండేళ్లుగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో కీమోథెరపీ చేయించుకుంటున్నారు. జూన్‌ 15న న్యూమోనియాతో బాధపడుతూ అంబులెన్స్‌లో హన్మకొండ నుంచి తాను చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు రాగా బెడ్లు లేవని వైద్యులు తిరస్కరించారు. దీంతో అతడి కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆ సమాధానమే వచ్చింది. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు.

శ్వాసకోశ సమస్యలు, కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నవారు కరోనాతో వస్తే బెడ్లు ఖాళీలేవని గట్టిగా చెప్పి పంపిస్తున్నారని చెప్పేందుకు ఈ ఘటన నిదర్శనం. కాగా.. భారీగా ఫీజుల వసూలు చేయడాన్ని ప్రైవేటు వైద్యులు సమర్థించుకుంటున్నారు. కరోనా వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్న వారికి అత్యవసర చికిత్స కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని చెబుతున్నారు. డబ్బుల్లేని వారు కార్పొరేట్‌ ఆస్పత్రికి రావడం ఎందుకని, గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

Courtesy AndhraJyothy