• కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌ 
  • అధికారులపై జరిమానాల్లేవు, చర్యల్లేవు 
  • ‘సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌’ నివేదికలో వెల్లడి 

హైదరాబాద్‌ : తెలంగాణలో సమాచార హక్కు చట్టం అమలు అధ్వాన్నంగా ఉందని సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీ్‌స(సీఈఎస్‌), సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌(ఎ్‌సఎన్‌ఎస్‌) సంస్థల సంయుక్త అధ్యయన నివేదిక తెలిపింది. అన్ని రాష్ట్రాల సమాచార కమిషన్ల పనితీరుపై అధ్యయన నివేదికను మంగళవారం విడుదల చేశారు.

ఏప్రిల్‌-2019 నుంచి జులై-2020 వరకు కమిషన్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించామని ఆ సంస్థల కో-ఆర్డినేటర్లు అంజలి భరద్వాజ్‌, అమ్రిత జోహరి తెలిపారు. నిర్ణీత వ్యవధిలో సమాచారం ఇవ్వని ప్రభుత్వ శాఖల అఽధికారులకు రూ.25 వేల వరకు జరిమానా విధించే అధికారం సమాచార కమిషనర్లకు ఉంది.

తెలంగాణలో మాత్రం 15 నెలల్లో ఒక్క అధికారికీ జరిమానా విధించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని వారు పేర్కొన్నారు. అధికారులు సమాచారం ఇవ్వడం లేదంటూ తెలంగాణ ప్రజలు కమిషన్‌ను ఆశ్రయిస్తే వాటి పరిష్కారానికి రెండేళ్లు పడుతోందన్నారు. రాష్ట్ర కమిషన్‌లో మార్చి-2019 నాటికి ఉన్న 8,829 పెండింగ్‌ కేసులు జూలై-2020 నాటికి 9,795కి పెరిగాయన్నారు. కేసులను త్వరగా పరిష్కరించడంలో కమిషన్‌ విఫలమవుతోందని వారు వ్యాఖ్యానించారు.

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో తెలంగాణ కమిషన్‌ 47 రోజుల పాటు విచారణలు నిలిపి వేసిందని, అత్యవసర కేసులను సైతం విచారించలేదని తెలిపారు. సమాచారం అందించని ప్రభుత్వ అధికారులకు షోకాజ్‌ నోటీసుల జారీలో గుజరాత్‌(9080 నోటీసులు) ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణ షోకాజ్‌ నోటీసులే జారీ చేయని రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ అధికారికీ జరిమానా విధించలేదని, ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదని నివేదిక వెల్లడించింది.

Courtesy Andhrajyothi