కొండూరి వీరయ్య

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాణాల రీత్యా చూసినప్పుడు భారతదేశం మూడో దశలో ప్రవేశించింది. ఇదేదో ప్రజలను భయపెట్టి ఇండ్లకు పరిమితం చేయటానికి మోడీ చెప్పిన మాటలాంటిది కాదు. ప్రధాని నేతృత్వంలో మార్చి 24న జరిగిన కోవిద్‌ ఆస్పత్రుల టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా ఉన్న డాక్టర్‌ గిరిధర్‌ గ్యాని చెప్పిన మాట. ఈ దశలో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దాని మూలాలు వెతకట మరింత కష్టమవు తుంది. అంతేకాదు. గతంలో వైరస్‌ బారిన పడిన వ్యక్తులకు కూడా రోగ లక్షణాలు బయటపడతాయి. దాంతో పరీక్షలు, చికిత్స చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 118 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 15 వేలమందికి రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. చిన్న జిల్లాల్లో కనీసం మూడు వందలకు తగ్గకుండా పెద్ద జిల్లాల్లో 3000కు తగ్గకుండా పడకలు సిద్ధం చేయాలన్న ఆదేశాలు కూడా వచ్చాయి. ఇవన్నీ దేశంలో వైరస్‌ విస్తరణ ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో తెలియచెప్పే హ్చెరికలు. ఈ వైరస్‌ వ్యాప్తి మూడో దశకు చేరకుండా భారతదేశంలో నివారించలేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు వివిధ దేశాల్లో వైద్యవిజ్ఞాన రంగంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. రెండు సార్లు దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కానీ పరిస్థితి ఇంత తీవ్ర స్థాయికి చేరుకోవటానికి కారణమేమిటన్న కీలకమై వాస్తవాన్ని మాత్రం తన వాక్చాతుర్యంతో కప్పిపెట్టారు.

వైరస్‌ నివారణ, నియంత్రణ పట్ల కేంద్ర ప్రభుత్వం గత మూడునెల్లుగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించటం వల్లనే నేడు దేశం ఈ దుర్గతి పాలైంది. కనీసం 15 కోట్ల నుంచి 30 కోట్ల మంది ప్రజలు వివిధ స్థాయిలో కరోసా పీడితులుగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. ఈ రెండు నెల్ల వెనక్కి వెళ్లి చూస్తే భారతం కరోనాపై పోరాటంలో నేడున్న దుస్థితికి ఎందుకు చేరిందో అర్థమవుతుంది. దేశంలో మొదటి కరోనా రోగిని జనవరి 30న గుర్తించారు. ఫిబ్రవరి 5నాటికి చైనా నుంచి తిరిగి వస్తున్న ప్రయాణీకులను మాత్రమే విమానాశ్రయా ల్లో పరీక్షించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. మార్చి 17 నాటికి ఏ దేశం నుంచి వచ్చే ప్రయాణీకుడినైనా పరీక్షించా లని ఆదేశించింది. ఈ మధ్య కాలంలో కేంద్ర కాబినెట్‌ కార్యదర్శి వెల్లడించిన వివరాలు ప్రకారం దాదాపు 12 లక్షల 29 వేల 363 మంది విదేశీయులు, లేదా విదేశీ ప్రయాణాలు ముగించుకుని వచ్చిన భారతీయులు దేశంలోని వివిధ విమానా శ్రయాల్లో దిగి తమతమ గమ్యస్థానాలకు చేరారు. అయితే ఈ విధంగా గమ్యస్థానం చేరుకున్న ప్రయాణీకులను గృహనిర్భంధం లో ఉంచాల్సిన అవసరంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించలేకపోయింది. మరో దౌర్భాగ్యం ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడ్డాయన్న వాస్తవం కండ్లముందు ఉన్నప్పటికీ కేవలం నాలుగైదు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను మాత్రమే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించటం.

ఈ నిర్లక్ష్యం ఖరీదెంత? ఈ 12.29 లక్షలమంది దేశంలో వివిధ ప్రాంతాల్లో తమ దైనందిన కార్యకలాపాలకు హాజరవు తూనే ఉన్నారు. ఎంతమందిని కలిశారో, ఎన్ని ఊళ్లు తిరిగారో, ఎన్ని బస్సులు, రైళ్లు, విమానాలెక్కారో లెక్కలేదు. ఈ 12.29 లక్ష మందిలో వైరస్‌ పీడితులైన కొందరికి రోగ లక్షణాలు బయటపడే సమయం ఇది. కానీ వీరికి విమానా శ్రయాల్లో ఏర్పాటు చేసిన తనిఖీలు కూడా జ్వరం లేకుండానే శరీరంలో వైరస్‌ ప్రభావం ఉంటే గుర్తించగలిగిన సామర్థ్యం ఉన్న పరికరాలు కాదు. కనీసం ఈ 12.29 లక్షలమంది ప్రయాణీకులను రెండు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉంచారా అంటే అదీ లేదు. కీలకమైన సమయంలో కీలకమైన నియంత్రణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమమైన ప్రభుత్వం ఈ సమస్యకు ఇచ్చిన పరిష్కారం ఏమిటి? మార్చి 22న దేశ ప్రజలందరినీ గృహనిర్భంధానికి గురి చేయటం. నాటి నుంచీ మరో మూడు వారాలు పాటు 130 కోట్లమందిని లాక్‌డౌన్లో బంధించటం. రెండోసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మూడు వారాలు గడువు ఇస్తే దేశంలో వ్యాధి విస్తరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మూడు వారాలు జనవరి, ఫిబ్రవరిలో ఆ 12.29 లక్షల మందిని అదుపులో ఉంచటానికి వెచ్చిం చాల్సిన సమయం. ఆ పని చేయ లేదు. ఇప్పుడు దేశమంతా నిర్భంధంలో ఉంది.

ఈ మొత్తం క్రమాన్ని పరిశీలిస్తే మోడీ ప్రభుత్వపు రెండు నిర్ణయాలు గుర్తు కొస్తున్నాయి. దేశంలో నల్లధనం ఎక్కడెక్కడ ఉందో పట్టుకోవటంలో చిత్తశుద్ధి లోపించిన కేంద్ర ప్రభుత్వం ప్రజలందరి సొమ్ము స్వాధీనం చేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించారంటున్న వాళ్లను గుర్తించలేక దేశ ప్రజలందరి పౌరసత్వం నిరూపించు కోమంటోంది. తాజాగా దేశంలోకి ప్రవేశించిన 12.29 లక్షలమందిని గుర్తించి వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించి వాళ్లను ఇండ్లకు పరిమితం చేయటం ద్వారా వ్యాధి విస్తరణను నియంత్రించటంలో నిర్లక్ష్యం ప్రదర్శించి ఇప్పుడు 130 కోట్ల మందీ ఇండ్లకు పరిమితం కావాలని ఆదేశించింది.

మనం చర్చించుకోవాల్సిన రెండో కీలకమైన అంశం ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్‌ ప్యాకేజి గురించి. కేంద్ర ప్రభుత్వం 1.70 లక్షల కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ ప్యాకేజిలో ఉన్న వివిధ భాగాలు, వాటి స్వరూ స్వభావాలు జాగ్రత్తగా గమనిస్తే పొట్ట విప్పి చూడ… సామెతను గుర్తు చేస్తుంది. కరోనా పీడితులకు నికరంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం 35 వేల కోట్లకు మించి లేదు అన్నది అక్షర సత్యం. మిగిలింది బడ్జెట్‌ ద్వారా వివిధ పథకాలకు కేటాయించిన నిధుల నుంచి ప్రజలకు చెల్లిస్తున్నవే తప్ప వైరస్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారిని, వారి కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేకించి అందిస్తున్న సహాయం కాదు. ఈ విషయాన్ని నిర్థారించుకోవటానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిలో రెండు విషయాలు పరిశీలిస్తే సరిపోతుంది.

రైతాంగానికి రెండు వేల రూపాయలు ఖాతాల్లో ముందుగానే వేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ రెండు వేలు 2019 ఎన్నికలకు ముందు కేంద్రం ప్రారంభించిన పథకంలో భాగమే తప్ప అదనంగా ఇస్తున్నది కాదు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అందులో నుంచి రెండు వేలు ఇప్పుడు జమ చేస్తున్నారు. ఉపాధి హామీ కార్మికులకు ఇచ్చే దినసరి వేతనాన్ని రూ.182 నుంచి 202లకు పెంచటం కూడా ఈ పథకంలో భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇక్కడ ఓ చిన్న మెలిక ఉంది. ఉపాధి హామీ చట్టం కింద పని చేసిన వారికి ఈ వేతనాలు అందుతాయి. కానీ దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు సామాజిక దూరం పాటించటమే ఆరోగ్యరక్షణకు ప్రథమ సూత్రంగా మారినప్పుడు దేశమంతా మార్చిలో మొదలవ్వాల్సిన ఉపాధి హామీ పనులు నేటికీ ఎక్కువ రాష్ట్రాల్లో మొదలు కాలేదు. అక్కడక్కడా మొదలైనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇప్పుడు ఆ పనులు కూడా జరగటం లేదు.

ఆర్థిక మంత్రి లెక్కలో ఐదు కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులకు అందాల్సిన ఈ మొత్తం అందే అవకాశమే లేదు. కనీసం ఈ సీజన్‌లో ఉపాధి చట్టం కింద దక్కాల్సిన పనిదినాల్లో 30 పనిదినాలు కోల్పోయారు. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో లేదు. భవన నిర్మాణ కార్మికులకు సుమారు 30 వేల కోట్ల రూపాయల సంక్షేమ నిధి నుంచి ఖర్చు చేయాలని ఆదేశించింది. ఈ నిధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలతో జమపడిన నిధి కాదు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు తమ వేతనాల నుంచి కొంత మొత్తం సెస్‌ రూపంలో పక్కన పెడితే పోగుపడ్డ నిధి. కార్మికుల సొమ్ము కార్మికులకు చెల్లించటాన్ని కూడా తమ దాతృత్వంగా చెప్పుకోవటం సిగ్గు చేటు. చివరిగా వలస కార్మికులు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వలస కార్మికులు స్వగ్రామాలకు పయనం అయ్యారు.

గుజరాత్‌ నుంచి రాజస్థాన్‌, హైదరాబాద్‌ నుంచి ఒరిస్సా, బీహార్‌, బెంగాల్‌లకు, మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లకు, పంజాబ్‌, హిమాచల్‌ నుంచి బీహార్‌కు ఈ ప్రయాణాలు సాగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన సహాయక చర్యల్లో ఈ వలస కార్మికులకు స్థానం లేదు. పని చేసే చోట్ల వీరికి గుర్తింపు లేదు. రేషన్‌కార్డు లేదు. నివాస ధృవీకరణ అసలే లేదు. ఈ దేశంలో అమలు జరిగే సంక్షేమ పథకాలన్నీ నివాస ప్రాంతాల ప్రాతిపదికనే అమలు జరిగే పథకాలు తప్ప పని ప్రదేశాలు కేంద్రంగా అమలు జరిగే పథకాలు కాదు. ఈ పరిస్థితుల్లో కోట్లాదిమంది వలస కార్మికులు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ చర్యలతో లబ్ద పొందే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజిలో రూ.40-50 వేల కోట్లకు మించి అర్హులు, అన్నార్తుల దగ్గరకు చేరే అవకాశం లేదు.

చివరిగా మరో కీలకమైన అంశం. దేశంలో కరోనా పీడితుల సంఖ్య తక్కువగా నమోదు కావటానికి కారణం రోగ నిర్ధారణ కోసం జరుగుతున్న పరీక్షల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో పాటు రోగ నిర్ధారణ చికిత్సలను పర్యవేక్షిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన వ్యక్తిగత భద్రతా సాధనాలు అందుబాటులో లేకపోవటం. ఇప్పటికే అనేక మంది ప్రయివేటు ఆస్పత్రులు నడుపుతున్న వైద్యులు ఆస్పత్రులు మూసేసి ఇండ్లల్లో ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బంది వద్ద రోగ నిర్దారణకు కావల్సిన పరికరాలు కొరతయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ విషయంలో కూడా కొట్టొచ్చిట్టు కనిపిస్తోంది. దేశంలో జనవరి చివరి వారంలో మొదటి కరోనా కేసు నమోదు అయ్యింది. మార్చి రెండోవారం నాటికి 100 దేశాలను ఆ వైరస్‌ పీడిస్తోందని ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. అయినా రోగ నిర్ధారణ చేసేందుకు కావల్సిన పరికరాల తయారీకి ప్రభుత్వం ఆదేశించలేదు.

అహ్మదాబాద్‌లో ఉన్న ఒకే ఒక్క కంపెనీకి మార్చి 20న అటువంటి పరికరాల తయారీకి కావల్సిన అనుమతులు ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఓ లేఖ జారీ చేసింది. ఇంత పెద్ద విశాల దేశంలో ఒక స్టార్టప్‌ కంపెనీ తయారు చేసే పరికరాలతోనే రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలంటే ఎంత కాలం పడుతుంది? ప్రధాని ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ లెక్క ప్రకారం రోజుకు 15వేలకంటే ఎక్కువ మందికి ఈ పరీక్షలు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరించే ఏ ప్రభుత్వం అయినా రోగ నిర్ధారణ పరికరాల తయారీకి వివిధ ప్రభత్వరంగ సంస్థలను పురమాయిస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇందుకు సిద్ధం కాలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ గతి లేక అహ్మబాద్‌ కంపెనీపైనే ఆధారపడే పరిస్థితిని తెచ్చి పెట్టింది. ఇటువంటి నిర్లక్ష్యం, ప్రణాళికలేని, హడావుడి చర్యలతో ప్రపంచాన్ని పీడిస్తున్న వైరస్‌ను అదుపులో ఉంచటం సాధ్యమయ్యే పని కాదు. ఈ కేంద్ర ప్రభుత్వ నేరానికి 130కోట్లమంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి.

Courtesy Nava Telangana