• తొలి టీకా ‘కోవ్యాక్సిన్‌’భారత్‌దే.. ప్రధాని సమీక్షలో దీనిపై చర్చ
  • అనుమతి రాగానే వేగవంతమైన పంపిణీకి
  • సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న మోదీ 
  • ధర అందుబాటులో ఉండేలా చూడాలని సూచన
  • భారత సంయుక్త డ్రగ్స్‌ కంట్రోలర్‌

న్యూఢిల్లీ : కొవిడ్‌-19ను నిరోధించే తొలి టీకా భారత్‌ నుంచే రానుందని.. సంయుక్త డ్రగ్స్‌ కంట్రోలర్‌ (ఇండియా) డాక్టర్‌ ఎస్‌.ఈశ్వర్‌ రెడ్డి తెలిపారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు దశల్లో మానవ పరీక్షలు (ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌) చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. అంతా అనుకున్నట్టే జరిగితే.. మరో మూడు నెలల్లో ఆ వ్యాక్సిన్‌ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు రావడంతో మానవ పరీక్షలకు అనుమతిఇచ్చినట్టు వెల్లడించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి కనీసం ఆరేళ్లు పడుతుందని.. కానీ, మన దేశంలో అతివేగంగా పరిశోధనలు, ప్రయోగాలు జరిపి 3 నెలల్లోనే వ్యాక్సిన్‌ను మానవ పరీక్షలకు సిద్ధం చేశారని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు కరోనా టీకా కోసం పరిశోధనలు చేస్తున్నా.. అందరికన్నా ముందు భారత్‌లోనే వ్యాక్సిన్‌ లభ్యమవుతుందని ఈశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోవ్యాక్సిన్‌గా పిలిచే ఈ టీకాను భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వేరు చేసిన కరోనా స్ట్రెయిన్‌తో, హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో అభివృద్ధి చేశారు. కొందరు స్వచ్ఛంద కార్యకర్తలకు ఈనెలలో ఈ టీకా ఇస్తారు.

పంపిణీకి ప్రణాళికలు
ప్రధానమంత్రి మంగళవారం ఉన్నత స్థాయి సమావేశంలో ఈ టీకాపై సమీక్ష జరిపారు. అది అందుబాటులోకి రాగానే ప్రజలకు వేగంగా టీకాలు ఇవ్వడానికి రూపొందించాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటుకు, పౌరులకు పాత్ర కల్పించాలన్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి, కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన వారికి, వైరస్‌ బారిన పడిన వారికి టీకాలు ఇవ్వడంలో ప్రాఽధాన్యంఇవ్వాలని చెప్పారు. అలాగే.. ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ టీకాలిచ్చేలా చూడాలని, ధర కూడా అంద రూ భరించదగ్గ స్థాయిలోనే ఉండేలా చూడాలని అన్నారు.

ఐసీఎంఆర్‌కి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వేరు చేసిన కరోనా స్ట్రెయిన్‌తో, హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో కోవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.

Courtesy Andhrajyothi