– కరోనా సంక్షోభంలోనూ రెండంకెల పెరుగుదల
– యూబీఎం-పీడబ్ల్యూసీ రిపోర్ట్‌
– సాధారణ ప్రజలు అష్టకష్టాలు

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంతో సాధారణ ప్రజలు కనీసం తినడానికి కూడా అష్టకష్టాలు పడుతుండగా.. అదే సమ యంలో ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్లు, కుబేరుల సంపద మాత్రం ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా పెరుగుతుండటం గమనార్హం. కరోనా కాలంలో అనేక మంది బిలియనీర్ల సం పద నూతన గరిష్ట స్థాయిలకు చేరిందని యూబీఎం -పీడబ్ల్యూసీ ఫౌండ్‌ సంయుక్తగా నిర్వహించిన రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. ముఖ్యంగా టెక్నాలజీ, వైద్యరంగాల్లోన్ని కంపెనీల షేర్లు భారీ ర్యాలీ చేయడంతో చాలా మంది ప్రపంచ కుబేరుల సంపద 10 లక్షల కోట్ల (దాదాపు రూ.750 లక్షల కోట్లు) డాలర్లకు చేరింది. ఈ రిపోర్ట్‌లో 2,000 మంది బిలియనీర్ల సంపదను పరిశీలనలోకి తీసుకున్నారు. ఇందులో 98 శాతం మంది సంపద కూడా పెరిగింది. కరోనా తొలి మాసాల్లో కంటే జులై ముగింపు నాటికి వీరి సంపద 10.2 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగింది. ఇంతక్రితం 2019 ముగింపు సమయంలో 8.9 లక్షల కోట్ల డాలర్లు (రూ.670 లక్షల కోట్లు)గా ఉంది. గడిచిన 25 ఏండ్లలో వీరి సంపద 5 నుంచి 10 రెట్ల మేర ఎగిసిందని యూబీఎం-పీడబ్ల్యూసీ రిపోర్ట్‌ పేర్కొంది.

25 ఏండ్ల క్రితం వీరి సంపద లక్ష కోట్ల డాలర్లు (రూ.75వేల కోట్లు)గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 7 నుంచి జులై 31 మధ్య కాలంలో అన్ని పరిశ్రమల కుబేరుల సంపద రెండంకెలు పెరిగినట్టు ఈ అధ్యయనంలో తేలింది. టెక్నాలజీ, వైద్య రంగంలోని కార్పొరేట్ల సంపద అత్యధికంగా 36 శాతం నుంచి 44 శాతం మేర పెరిగినట్టు వెల్లడించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచానికి 7.2 బిలియన్‌ డాలర్లు (రూ.54వేల కోట్లు) అవసరం అవుతాయని అనేక మంది బిలియనీర్లు బహిరంగంగా చెప్పారు. కానీ కరోనా కాలంలో వైద్య సహాయానికి ఆయా కార్పొరేట్‌ కంపెనీలు చేసిందేమీ లేదని ఈ అధ్యయనం పేర్కొంది. కరోనా కాలంలో భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ గంటకు రూ.90 కోట్లు సంపాదించినట్టు ఇటీవల ఓ రిపోర్ట్‌లో వెల్లడయిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana