– కరోనా రోగులకు ప్రాణవాయువు కోసం ఇబ్బందులు..
– మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌లపై ప్రభావం
– రాష్ట్రాల పైనే భారం వేసిన కేంద్రం

న్యూఢిల్లీ : మోడీ సర్కారుకు ముందుచూపు లోపించడంతో దేశంలోని ఆయా రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరించడంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్‌ రోగులకు శస్త్ర చికిత్స అందించడంలో కీలకమైన ఆక్సిజన్‌ నిల్వలు పడిపోయాయి. కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో దేశంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా కొద్దీ ఆక్సిజన్‌ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. దీంతో సదరు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఆక్సిజన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక కేంద్రం తీరు మాత్రం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నది. ఆక్సిజన్‌ లభ్యతపై బాధ్యతను మోడీ సర్కారు రాష్ట్రాలపై వేసింది. ఇందులో భాగంగా, ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్నది.

రాష్ట్రంలో కేసుల తీవ్రత నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే ఆక్సిజన్‌ వినియోగంపై ఆంక్షలను విధించారు. పరిశ్రమల్లో ఆక్సిజన్‌ వాడకాన్ని నియంత్రిస్తూ ఎపిడిమిక్‌ యాక్ట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి సంస్థలు 80శాతం ఆక్సిజన్‌ను రాష్ట్రంలో వైద్య వినియోగం కోసం, మరో 20 శాతం పరిశ్రమల వినియోగానికి సరఫరా చేయాలని మహా సర్కారు తన ఆదేశాల్లో వివరించింది. అయితే ఈనేపథ్యంలో కేంద్రం ఆదేశాలు రావడం గమనించాల్సిన అంశం. అయితే ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు 10 లక్షలకు పైగా దాటడంతో పాటు వేలాది మరణాలు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఆక్సిజన్‌ కొరత కారణంగానూ సంభవించిన మరణాలు ఇందులో ఉన్నాయి.

మహారాష్ట్రలో 24 ఉత్పత్తిదారులు రోజుకు దాదాపు 1000 మెట్రిక్‌ టన్నుల(ఎంటీలు) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావంతో రాష్ట్రంలో వైద్య పరంగా ఆక్సిజన్‌ డిమాండ్‌ 400 ఎంటీ ల నుంచి 900 ఎంటీ లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం 66 ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ యూనిట్లు ఉన్నాయి. అయితే మహారాష్ట్ర నిర్ణయంతో ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కోరుతున్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఆక్సిజన్‌ నిల్వలు లేక ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అయితే రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి 120 టన్నుల నుంచి ఈనెల 30 నాటికి 150 టన్నులకు పెరగుతుందని శివరాజ్‌సింగ్‌ తెలిపారు. అంతేకాకుండా, యూపీ, గుజరాత్‌ల నుంచి ఆక్సిజన్‌ సరఫరా కోసం ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచాలని సంస్థలకు అదేశాలు జారీ చేసింది. మరో ఆరునెలల్లో 200 టన్నుల ఆక్సిజన్‌ ప్లాంటును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.

ఇక పంజాబ్‌లో కరోనాకు ముందు మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ రోజుకు 15నుంచి 20 ఎంటీలుగా ఉండేది. అయితే అది ఇప్పుడు 100 ఎంటీలకు చేరుకున్నది. ఈనెల 30 ఆ నాటికి అది 165 ఎంటీలకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచడంతో తోడ్పాటును అందించాలంటూ హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు పంజాబ్‌ లేఖలు కూడా రాసింది. ఇక యూపీలోని పలు జిల్లాల్లోనూ ఆక్సిజన్‌ కొరత ఉన్నది. దీంతో కోవిడ్‌ రోగులు ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కేంద్రం ఇకనైనా రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టేలా కాకుండా పెద్దన్న పాత్ర పోషించి తన బాధ్యతను గుర్తెరగాలని వైద్యనిపుణులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

Courtesy Nava telangana