– కరోనా సంక్షోభం ఎఫెక్ట్‌
– హోమ్‌ క్రెడిట్‌ ఇండియా సర్వే

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ నిబంధనలు అన్ని వర్గాల ప్రజలను అప్పుల పాలు చేసింది. ఉద్యోగాలు ఊడిపోవడం, అన్ని రంగాల పరిశ్రమల వేతనాల్లో కోత వల్ల మధ్య తరగతి ప్రజల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడిందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతీ నలుగురిలో ముగ్గురు వ్యక్తిగత రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. గృహ అవసరాలు, వాయిదాల చెల్లింపు కోసం ప్రతీ నలుగురిలో ఒక్కరు బందు, మిత్రుల నుంచి అప్పులు తీసుకున్నారని అంచనా. లాక్‌డౌన్‌ కాలంలో అనేక మంది తమ మిత్రులు, కుటుంబ సభ్యులు, విత్త సంస్థల అప్పులపై ఆధారపడాల్సి వచ్చిందని హోమ్‌ క్రెడిట్‌ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. యూరప్‌, ఆసియా వినియోగదారుల విత్త సేవలు కలిగిన ఈ సంస్థ దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, పాట్నా, భోపాల్‌, జైపూర్‌ లాంటి ఏడు నగరాల్లో సర్వే చేపట్టింది. ఇందులో దాదాపుగా వెయ్యి మంది అభిప్రాయాలను సేకరించింది. సర్వే వివరాలు.. ఉద్యోగాల కోతతో పాటు వేతనాల్లో తగ్గింపులు, వాయిదాల కారణంగా చాలా మంది అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.

తమ నెలవారీ వాయిదా చెల్లింపుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత లేదా తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత తీసుకున్న అప్పులు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు 50 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న మహిళలు అత్యధికంగా తమ మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి అప్పులు పొందినట్టు తెలిపారు. ముంబయి, భూపాల్‌లో అత్యధికంగా 27 శాతం మంది మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి అప్పులు తీసుకున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలో 26 శాతం, పాట్నాలో 25 శాతం చొప్పున రుణాలు పొందారు. హోమ్‌ క్రెడిట్‌కు దేశంలోని 350 పట్టణాల్లో 31,500 పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) కేంద్రాలున్నాయి.

Courtesy Nava Telangana