లండన్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. తగిన ఆదాయాలు లేక కరోనా తర్వాత దాదాపు 100 కోట్ల మంది మేర పేదరికంలోకి బతుకులు ఈదాల్సిన పరిస్థితులు నెలకొందని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, అస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ అధ్యయన నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవాళ్ల ఆదాయం రోజుకు 50 కోట్ల డాలర్లు తగ్గిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఆసియా దేశాల్లోని భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, పిలిప్పైన్స్‌లలో పేదల సంఖ్య మరింతగా అవకాశం ఉందని, కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కరోనా వైరస్‌ చాలా వేగంగా ఆర్థిక సంక్షోభంగా మారుతోందని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ ఆండీ సమ్నర్‌ అన్నారు. ఆసియా దేశాల తర్వాత 30 శాతం మేర లేదా 11.9 కోట్ల మంది పేదలతో ఆఫ్రియా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ కరోనా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అన్ని దేశాల నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆధ్యయనానికి చెందిన పరిశోధకులు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 6 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉందని ఆర్గనైజేషన్‌ ఫర్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఓఇసిడి) పేర్కొంది. సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు, నాటకీయ పరిణామాలను చూడలేదని అభిప్రాయపడింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని, పేదలు, యువకులను ఈ సంక్షోభం మరింత దారుణంగా దెబ్బకొట్టిందని, అసమానత్వాన్ని పెంచిందని పేర్కొంది.

Courtesy Nava Telangana