•  నామకరణం చేసిన డబ్ల్యూహెచ్‌వో.. చైనాలో 1,016కు చేరిన వైరస్‌ మరణాలు
  • సోమవారమే 108 మంది మృతి
  • యూఏఈలో భారతీయుకి వైరస్‌
  • జపాన్‌ నౌకలోని వారితోటచ్‌లో ఉన్నామన్న ఎంబసీ

బీజింగ్‌, న్యూఢిల్లీ : చైనాను నిలువునా వణికిస్తూ ప్రపంచానికి వ్యాపించిన ‘నావెల్‌ కరోనా వైర్‌స’కు.. ‘కొవిడ్‌-19’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నామకరణం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానమ్‌ గెబ్రెయెసిస్‌ ప్రకటించారు. కరోనా, వైరస్‌, డిసీస్‌ ఇంగ్లిష్‌ పదాల్లోని తొలి రెండు అక్షరాలను తీసుకుని ‘కొవిడ్‌-19’గా పేరు పెట్టినట్లు తెలిపారు. కరోనా 2019 డిసెంబరు 31న వెలుగులోకి వచ్చింది. కాగా.. చైనాలో ఈ వైరస్‌ కారణంగా మరణాల సంఖ్య 1,016కు చేరింది. ఒక్క సోమవారమే 108 మంది మృతి చెందినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. వీటిలో 103 మరణాలు.. వైరస్‌ జన్మస్థానమైన వూహాన్‌ నగరం ఉన్న హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే చోటుచేసుకున్నాయి. మంగళవారంతో 42,638 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. చైనా అధికారులకు సహకరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం సోమవారం రాత్రి బీజింగ్‌ చేరుకుంది.

వీరు స్థానిక వైద్య నిపుణులతో బృందంగా ఏర్పడి విస్తృత పరిశోధనలు సాగించనున్నారు. జ్వర లక్షణాలున్నవారు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాల్లోనే పరీక్షలు చేయించుకోవాలని వూహాన్‌ వాసులకు అధికారులు సూచిస్తున్నారు. కరోనాను వెలుగులోకి తెచ్చిన వైద్యుడిని వేధించడం సహా తర్వాతి పరిణామాల నేపథ్యంలో హుబెయ్‌ అత్యంత సీనియర్‌ నేతలు/ఆరోగ్య అధికారులపై చైనా కమ్యూనిస్టు పార్టీ వేటు వేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 350 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌లలో ఒక్కొక్కరు చనిపోయారు. కరోనా క్రమంగా యూరప్‌ ఖండంలోని దేశాలకు విస్తరిస్తోంది. వైరస్‌ ప్రభావిత వ్యక్తిని కలిసిన ప్రవాస భారతీయుడు ఒకరు కరోనా బారినపడ్డట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తెలిపింది. జపాన్‌ తీరంలో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ఉన్న 138 మంది భారతీయులతో సంప్రదింపుల్లో ఉన్నామని ఎంబసీ తెలిపింది. ఈ నౌకలోని వారిలో 60 మందికి కరోనా ప్రబలినట్లు సోమవారం తేలగా.. ఆ సంఖ్య మంగళవారం 130కి చేరింది.

Courtesy Andhrajyothi