భయంతో ప్రజల ముందస్తు కొనుగోళ్లు
 కొరత ఏర్పడే ప్రమాదం ఉండడంతో సర్కారు దృష్టి
 సంబంధిత వైద్యుల చీటీ ఉంటేనే విక్రయించాలని ఉత్తర్వులు
 ఇష్టానుసారం వాడితే దుష్ఫలితాలు
 స్పష్టం చేస్తున్న నిపుణులు

కరోనా వైరస్‌ ముప్పు ఉన్నవారు.. నివారణకు ఫలానా ఔషధాలు వినియోగించవచ్చనే ప్రచారంతో అవసరం లేకున్నా పలువురు వాటిని ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. ఔషధ దుకాణదారులు కూడా వైద్యుల సూచన లేకపోయినా విచ్చలవిడిగా వాటిని విక్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో.. నిజంగా అవసరమైనవారికి ఆ ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం తలెత్తడంతో తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హులైన వైద్యులు రాసిచ్చిన చీటి ఉంటే తప్ప వాటిని విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఔషధ నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ సంచాలకులు డాక్టర్‌ ప్రీతిమీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

నిర్దేశించిన వారికే వినియోగించాలి
మన దేశంలో ముందస్తుగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి నిర్దేశించిన వ్యక్తుల్లో ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ను వినియోగించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా బాధితులు, అనుమానితులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది, బాధితుల కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేస్తున్నారు. దీంతోపాటు  కరోనా నివారణకు ‘లొపినవిర్‌/రిటొనవిర్‌’ ఔషధాలను వినియోగించవచ్చనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతగా వ్యాప్తిలో ఉండడంతో.. వీటిని ముందస్తుగా వాడడానికి కొందరు మొగ్గుచూపుతున్నారు. సాధారణంగా ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ను కొన్ని రకాల మలేరియా జ్వరాల్లో, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లూపస్‌ వంటి జబ్బులకు వినియోగిస్తారు. ఇది మలేరియాకు సాధారణంగా వినియోగించే ‘క్వోరోక్విన్‌’కు అనుబంధంగా ఉత్పత్తి చేసిన ఔషధమే. ‘క్లోరోక్విన్‌’తో పోల్చితే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’లో దుష్ఫలితాల శాతం కొంత తక్కువని నిపుణులు చెబుతున్నారు.

‘లొపినవిర్‌/రిటొనవిర్‌’ ఔషధాలను హెచ్‌ఐవీ రోగుల్లో వినియోగిస్తారు. ఈ ఔషధాలతో కరోనా వైరస్‌ను నివారించడం, నయం చేయడం సాధ్యమవుతుందా? అనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ కచ్చితమైన నిర్ధారణకు రాకపోయినా.. వేర్వేరు దేశాల్లో వేర్వేరు రీతుల్లో వీటిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ‘ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో తాజాగా ప్రచురితమైన ఒక వైద్యపరిశోధన పత్రంలో ‘రిటొనవిర్‌/లొపినవిర్‌’ ఔషధాలతో కరోనా చికిత్సలో ఆశించనరీతిలో సానుకూల ఫలితాలు వెల్లడవలేదని పేర్కొన్నారు.

Courtesy Eenadu