ఎన్‌ 95 మాస్కులు లభించక ప్రజల ఆందోళన
ముడిపదార్థాలకు అత్యధికంగా చైనాపై ఆధారపడడమే ప్రధాన కారణం

కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి వైద్యులు మొదలుకొని సామాన్యులు వరకు ప్రత్యేక మాస్కు కోసం పరుగులు పెడుతున్నారు.  ‘ఎన్‌ 95’ పేరిట లభించే ఈ మాస్కులు ప్రస్తుతం అత్యధిక ఔషధ దుకాణాల్లో అందుబాటులో లేవు.  పైగా రూ.35-40 లభించాల్సిన వాటిని  రూ.100-150 వరకు విక్రయిస్తున్నారు.  మాస్కుల కొరతను పరిష్కరించాలంటూ ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి  నిర్వహించిన సమీక్షలోనూ రాష్ట్ర ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం.

ఏమిటీ మాస్కు ప్రత్యేకత?

 సాధారణ మాస్కులో రెండు పొరల అడ్డుకట్ట ఉంటే.. ఈ ఎన్‌ 95 మాస్కుల్లో ఆరు పొరల నియంత్రణ వ్యవస్థ ఉంటుంది.
 ఇందులో అత్యాధునిక శ్వాస వడపోత వాల్వులుంటాయి.
 సాధారణ దుమ్మూధూళీతో పాటు వైరస్‌లు, బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములు గాలి ద్వారా శరీరంలోకి వెళ్లకుండా ఈ మాస్కులోని పొరలు అడ్డుకుంటాయి.
 గాలి ద్వారా వ్యాప్తి చెందే సూక్ష్మక్రిముల్లో సుమారు 95 శాతం సూక్ష్మక్రిములను విజయవంతంగా నియంత్రిస్తుంది కాబట్టే.. దీన్ని ‘ఎన్‌ 95’ అని పిలుస్తారు.
ఇది అంతర్జాతీయంగా ఆమోదం పొందిన మాస్కు.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

 తెలంగాణలో ఎన్‌ 95 మాస్కు ఉత్పత్తి సంస్థల్లేవు.
 ఒక అమెరికా ఉత్పత్తి సంస్థ కూడా ఇక్కడికి తమ ఉత్పత్తులను దిగుమతి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
 వీటి తయారీలో వినియోగించే ముడి పదార్థాలు చైనాలో తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో.. అక్కడి నుంచి ఈ ముడిసరకుల దిగుమతి ఎక్కువగా జరుగుతోంది. చైనాలో కరోనా దెబ్బకు దిగుమతులను నిలిపివేయడంతో.. మాస్కుల తయారీకి అడ్డంకులేర్పడ్డాయి.
 ప్రస్తుతం విమానాశ్రయంలో పరీక్షలు, ఫీవర్‌, గాంధీ, ఛాతీ ఆసుపత్రుల్లో కరోనా అనుమానితుల చికిత్సల కోసం ఏర్పాట్లు చేసి ఉండడంతో.. ఇక్కడ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ధరించడానికి వీలుగా వైద్యఆరోగ్యశాఖ 11,570 ఎన్‌ 95 మాస్కులను అందుబాటులో ఉంచింది.
దేశీయ ముడిసరకు ద్వారా ఎన్‌ 95 మాస్కుల తయారీని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.

సాధారణ మాస్కులు రెండు వాడుకుంటే చాలు
డాక్టర్‌ లక్ష్మి, నిమ్స్‌, విశ్రాంత మైక్రోబయాలజీ ఆచార్యులు

కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించిన దాని కంటే శరీర భాగాలను తాకడం ద్వారా త్వరగా వ్యాపిస్తుందని తెలుస్తోంది. దీన్ని నిరోధించాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. ఎన్‌ 95 మాస్కుల వల్ల రక్షణ ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్‌ అనుమానితులకు సన్నిహితంగా మెలిగేవారు తప్పనిసరిగా వీటినే వినియోగించాలి. అయితే ఇవి లభ్యం కానంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ మాస్కులను రెండింటిని ఒకేసారి కలిపి వాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మాస్కులను ఒకసారి మాత్రమే వినియోగించాలి. దళసరి వస్త్రాన్ని ముఖానికి అడ్డుగా కూడా కట్టుకోవచ్చు. నిత్యం ఆ వస్త్రాన్ని శుభ్రపర్చుకోవాలి.

Courtesy Eenadu