న్యూయార్క్‌: వాసన, రుచి చూసే సామర్థ్యం తగ్గిపోవడమే కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు మొదటి సూచిక అని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని అధ్యయనాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది స్క్రీనింగ్‌ సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. శ్వాస సంబంధమైన వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల సాధారణంగా వాసన చూసే శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌తో కలిగే వాపు ప్రక్రియ వల్ల ముక్కులో గాలి ప్రవాహ తీరుతెన్నులకు అవరోధాలు ఏర్పడతాయి. తద్వారా వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంది. ‘‘దక్షిణ కొరియా, చైనా, ఇటలీల్లో గట్టి ఆధారాలు లభించాయి. వైరస్‌ సోకినవారిలో వాసన చూసే శక్తి తగ్గిపోతోంది. దక్షిణ కొరియాలో 30 శాతం కేసుల్లో ఇదే ప్రధాన సమస్యగా ఉంది. ఇది మినహా వారిలో ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల కరోనా వైరస్‌ రోగుల్లో కనిపించే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు లేకున్నప్పటికీ అనుమానిత కేసులను ప్రాథమికంగా గుర్తించడానికి ఈ ‘వాసన పరీక్ష’ వీలు కల్పిస్తుంది’’ అని బ్రిటిష్‌ రైనోలాజికల్‌ సొసైటీ పేర్కొంది. రుచి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అమెరికా నిపుణులు కూడా ఈ అంశాన్ని ధ్రువపరిచారు.

Courtesy Eenadu