– బయట కనిపిస్తే జైలుకే..
– వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌.. 519కు చేరిన కేసులు
– పూర్తి నిర్బంధంలో భారత్‌
– కరోనాకు జాతి, మతం లేదు : డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ : నానాటికీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినతరం చేశాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మూడు రోజులుగా ఒక్కో రాష్ట్రం ఎక్కడికక్కడ బంద్‌ ప్రకటిస్తుండగా.. దాదాపుగా దేశం మొత్తం కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. కాగా మంగళవారం నాటికి దేశంలో 519 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, పది మంది చనిపోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో నలభై మంది కోలుకున్నారనీ, మిగిలినవారిని వైద్యుల సమక్షంలో ఉంచామని తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, యూపీలలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలనీ, విదేశాల నుంచి వచ్చినవారు స్వీయ నిర్బంధంలోనే ఉండాలనీ, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌
కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌నే మార్గంగా ఎంచుకుంటున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటికీ 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. 548 జిల్లాలూ షట్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, బెంగాల్‌, బీహార్‌, తమిళనాడు, గోవా, రాజస్థాన్‌, అసోం, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో పూర్తిస్థాయి కర్ఫ్యూ కనిపిస్తుండగా.. మిగిలిన రాష్ట్రాల్లో పాక్షిక షట్‌డౌన్‌ కనిపిస్తున్నది. పరిస్థితిని కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడూ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాధి విస్తృతి అంతగా లేకున్నా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడా బంద్‌ కొనసాగుతున్నది. కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ అమలవుతున్నది. నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడట్లేదు.

ఉల్లంఘనులపై కేసులు
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలు అమలుచేస్తున్నా పలు ప్రాంతాల్లో జనాలు బయటతిరగడాన్ని ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినవారిని పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. దీంతో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయడమే గాక పలువురిని అరెస్టు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రాత్రిపూట బయట తిరుగుతున్న జనాలపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ముంబయిలో నిబంధనలు అతిక్రమించినవారిపై 31 కేసులు, కొల్హాపూర్‌లో 23 కేసులు పెట్టారు. యూపీలో సుమారు వేయి మందిపై 200 కేసులు దాఖలైనట్టు పోలీసులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో నిబంధనలు ఉల్లంఘించినవారి ద్విచక్రవాహనాలపై చలాన్లు వేశారు. రాజస్థాన్‌లో సెక్షన్‌ 144ను అతిక్రమించినందుకు గానూ పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఒడిషాలో దాదాపు వంద మందిపై, బెంగాల్‌లో 255, జార్ఖండ్‌లో 30, జమ్మూకాశ్మీర్‌లో 35 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. ‘నిబంధనలను ఉల్లంఘించినవాళ్లు సమాజానికి వ్యతిరేకం’ అంటూ పంజాబ్‌, యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో పోలీసులు సోషల్‌మీడియాలోనూ పట్టణాలు, గ్రామాల కూడళ్లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలెవరూ బయటకురావొద్దని గ్రామగ్రామాన మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప అనవరసరాలకు బయటకు రావొద్దని ప్రజలను కోరుతున్నారు.

మానవాళికి శత్రువు : ట్రెడోస్‌
కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్నదనీ, మొదటి లక్ష కేసులు నమోదవడానికి 67 రోజుల సమయం తీసుకుంటే తర్వాతి లక్ష మందికి సోకడానికి కేవలం 11 రోజులే పట్టిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ తెలిపారు. అంతేగాక మూడు లక్షల కేసులు చేరడానికి నాలుగు రోజులే పట్టిందనీ, దీన్ని బట్టి వైరస్‌ ఉధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ట్రెడోస్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘గణాంకాలు ముఖ్యం. అవి కేవలం గణాంకాలే కాదు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు. ఈ మహమ్మారికి జాతి, మతం, దేశం తేడా లేదు. అది అందరినీ నిర్దయగా చంపేస్తున్నది. కరోనా మానవాళికి శత్రువు. దీని నుంచి గట్టెక్కాలంటే తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అందరూ సామాజిక దూరాన్ని పాటించాలి. దానిపై అధునాతన పద్దతుల్లో పోరాటం చేయాలి’ అని టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు.

పంజాబ్‌లో 90 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు
వివిధ దేశాల నుంచి పంజాబ్‌కు 90 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు రావడంతో ఆ రాష్ట్రం కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నది. కరోనా బాగా ప్రబలిన ఇటలీ, స్పెయిన్‌, యూఎస్‌, యూకేల నుంచే వీరు అధికంగా ఉండటం.. వీరి ద్వారా వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి బిఎస్‌ సిద్దూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. ఎన్‌ఆర్‌ఐలందరూ ఈనెలలోనే రాష్ట్రానికి వచ్చారనీ, వారందరినీ పరీక్షించి ప్రత్యేక చికిత్స అందించడానికి తమకు తక్షణమే రూ. 150 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని కోరారు. ‘ఎన్‌ఆర్‌ఐలలో చాలా మందికి కోవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకముందే దాన్ని కట్టడి చేయాలి’ అని సిద్దూ తెలిపారు.

సామాజిక దూరమే రక్ష పాటిస్తే 62 శాతం కేసులు తగ్గే అవకాశం : ఐసీఎంఆర్‌
కరోనాను కట్టడి చేయడంలో సామాజిక దూరం కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్యులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సలహాలతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తే భారత్‌లో ఈ వైరస్‌ వ్యాప్తిని 62 శాతం దాకా అరికట్టే అవకాశాలున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. దేశంలో జనతా కర్ఫ్యూకు కొద్దిరోజుల ముందే ఐసీఎంఆర్‌ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబయిలలో దీన్ని నిర్వహించారు. దీని ప్రకారం సామాజిక దూరాన్ని పాటిస్తే వైరస్‌ వ్యాప్తి 4.9 వ్యక్తుల నుంచి 1.5 వ్యక్తుల మధ్యే ఉన్నదని ఐసీఎంఆర్‌ తెలిపింది.

దూకుడు కొనసాగించాలి : డబ్ల్యూహెచ్‌వో
కోవిడ్‌-19ను కట్టడి చేయడానికి భారత్‌ చేపట్టిన చర్యలు అభినందనీయమనీ, అయితే వైరస్‌ను కట్టడి చేయడానికి మరింత దూకుడుగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడిం చింది. ఈ మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ.. భారత్‌కు గతంలో స్మాల్‌పాక్స్‌, పోలియోను సమర్థవంతంగా ఎదుర్కున్న అనుభవం ఉన్నదని గుర్తు చేశారు. ‘చైనా మాదిరే భారత్‌ కూడా అత్యధిక జనాభా కలిగిన దేశం. కరోనా వైరస్‌ విస్తృతంగా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు భారత్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే దీన్ని ఇలాగే కొనసాగించాలి’ అని ఆయన అన్నారు.

కరోనా కీ బాత్‌..
– గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదు. అంతేగాక ఈ వైరస్‌ సోకినవారిలో ఐదుగురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. అలాగే రాజస్థాన్‌లోనూ ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
– ఢిల్లీలో వైద్యులు, నర్సులు అద్దెకుంటున్న ఇండ్లను ఖాళీ చేయమంటున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా అన్నారు. వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.
– ఢిల్లీ లాక్‌డౌన్‌తో పనులు కోల్పోయిన భవన నిర్మాణరంగ కార్మికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ. 5 వేల ఆర్థికసాయాన్ని అందించనున్నారు. అంతేగాక అద్దె చెల్లించని వారికి రెండు నెలల అద్దె కూడా చెల్లిస్తామని ప్రకటించారు.
– కోవిడ్‌-19పై పోరుకు గానూ పార్లమెంటు ఎంపీలు ప్రధాని సహాయనిధికి భారీ వితరణ ప్రకటిస్తున్నారు. వీరిలో లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిలు ఒక్కనెల జీతాన్ని, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ రూ. 25 లక్షలు ఇచ్చారు.
– మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
– కేరళలో పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర పోలీసులు ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడినుంచే నిత్యం సమీక్షలు చేస్తున్నారు.
– మాస్కులు, షానిటైజర్లు, ఐసీయూ కిట్లను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
– కర్నాటకలో అన్నార్థుల ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్‌లను మూసివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. క్యాంటీన్ల వద్ద జనం పెద్దఎత్తున గుమిగూడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
– ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే టికెట్లు బుక్‌ చేసుకున్నవాళ్లు టికెట్లు రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదనీ, ప్రయాణికులు చెల్లించిన నగదును తిరిగి వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
– గుజరాత్‌లో 11వేల మందికి పైగా స్వీయ నిర్బంధంలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ తెలిపింది. వీరిలో 224 మంది ఆస్పత్రుల్లో, పదివేలకు పైగా మంది గృహ నిర్బంధంలో ఉన్నారు.

Courtesy Nava Telangana