• గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద బీభత్సం
  • కారు కింద పడి మహిళ దుర్మరణం
  • డ్రైవర్‌ సహా నలుగురికి గాయాలు
  • 105 కిలోమీటర్ల వేగం వల్లే దుర్ఘటన
  • రెడ్‌ సిగ్నల్‌ వల్ల తప్పిన భారీ నష్టం
  • మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభమైన
  • 20 రోజుల్లో మూడో ప్రమాదం
  • వంతెన మూసివేతకు కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: సమయం మధ్యాహ్నం 1:04 గంటలు. అది.. హైదరాబాద్‌ గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్కు వద్ద మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్‌. ఖాజాగూడ జంక్షన్‌వైపు నుంచి ఓ వోక్స్‌ వ్యాగన్‌ కారు.. గంటకు 105కిలోమీటర్ల వేగంతో ఆ ఫ్లై ఓవర్‌పై దూసుకొచ్చింది! అదే వేగంలో అదుపు తప్పింది.. ఫ్లై ఓవర్‌ మలుపు వద్ద రెయిలింగ్‌ను ఢీకొట్టి.. గాల్లోకి ఎగిరి.. 60 అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డు మీద పడింది!! మళ్లీ బంతిలా గాల్లోకి లేచి పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పడింది. ఆ ధాటికి చెట్టు నిట్టనిలువునా కూలిపోయింది! ఫ్లై ఓవర్‌పైకి కారు ఎక్కడం మొదలు.. వంతెనపై నుంచి పడటం అంతా కూడా 5-6 సెకన్లలోనే జరిగిపోయాయి! అంతెత్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ కారు పడటంతో కింద ఉన్న జనం హాహాకారాలు చేశారు. ప్రాణభయంతో తలోదిక్కున పరుగులు తీశారు! కొద్దిసేపటికి చూస్తే.. కారు కింద ఓ అభాగ్యురాలు. మెడ భాగం సగం దాకా తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ బీభత్సాన్ని కళ్లారా చూసిన జనం గజగజ వణికిపోయారు. కొన్ని గంటల పాటు తేరుకోలేకపోయారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సీసీ టీవీల ద్వారా నిర్ధారించారు.

ఫ్లై ఓవర్‌పై నిబంధనల ప్రకారం గంటకు గరిష్ఠంగా 40కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన కారు.. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లినట్లు తేల్చారు. ఈ ఘటనలో దుర్మరణంపాలైన మహిళను మణికొండకు చెందిన కృష్ణవేణి (40)గా గుర్తించారు. పక్కనే ఉన్న ఆమె కూతురు ప్రణీత ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుంది. ముదావత్‌ బాలాజీ అనే ఆటో డ్రైవర్‌కు కాలు విరగ్గా… చెట్టు సమీపంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. అతడిని జూబ్లీహిల్స్‌కు చెందిన కల్వకుంట్ల శ్రీధర్‌ రావు కుమారుడు, కృష్ణ మిలన్‌ (27)గా గుర్తించారు. అతడి తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అంతెత్తు నుంచి కారు పడ్డా లోపల ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో అతడి ప్రాణాలు దక్కాయి. అతడిని, మిగతా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

నిస్సాన్‌ షోరూమ్‌ సమీపంలోనే పడటంతో దాని ఎదురుగా ఉన్న కార్లలో రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరకొని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఫ్లై ఓవర్‌ను 20 రోజుల క్రితమే ప్రారంభించారు. ఆ తర్వాత ఒకటి తర్వాత మరొకటి ఇప్పటివరకు మూడు ప్రమాదాలు జరిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాపాడిన చెట్టు.. రెడ్‌ సిగ్నల్‌
ఫ్లై ఓవర్‌ నుంచి పడిన కారు మరెంత విధ్వంసం సృష్టించేదో గానీ.. సమీపంలోని చెట్టు, ఆ సమయంలో పడిన రెడ్‌ సిగ్నల్‌ భారీ ప్రాణనష్టాన్ని నివారించాయి. ఫ్లై ఓవర్‌ నుంచి నేరుగా నేల మీద పడిన కారు ఓ పల్టీ కొట్టి.. ఎగిరి చెట్టుపై పడింది. విరిగిన చెట్టు కొమ్మలు కారును చుట్టేయంతో కారు బీభత్సానికి అక్కడితో పుల్‌స్టాప్‌ పడింది. ఆ చెట్టే లేకపోతే.. కనీసం ఐదారు పల్టీలైనా కొట్టివుండేదని, సమీపంలో ఉన్న జనంలో నలుగురైదురుగు ప్రాణాలు కోల్పోయేవారని.. షో రూం ఎదుట ఉన్న కార్లూ ధ్వంసమయ్యేవని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. కారు కిందపడిన సమయంలో బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద హైటెక్‌ సిటీ వెపు రెడ్‌ సిగ్నల్‌ పడింది. దాంతో అటువైపు వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయాయి. దాంతో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

త్రుటిలో తప్పించుకున్న యువతి
వంతెనపై నుంచి కారు కిందకు పడిపోతున్న క్రమంలో కింద రోడ్డుపై ఓ యువతి ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్తోంది. కారు ప్రమాద ధాటికి వంతెనపై నుంచి సైన్‌బోర్డు(సూచిక) కిందకు పడుతోంది. దీన్ని చూసి అక్కడున్న వారు పెద్దగా అరవడంతో ఆ యువతి పైకి చూసింది. భయంతో ఒక్క అడుగు వేసేంతలో ఆ బోర్డు కిందపడింది. ఆ అప్రమత్తతే ఆమెను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడింది.

కేటీఆర్‌ దిగ్ర్భాంతి
ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రారంభమైన 20 రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరగడంతో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసి వేయాలని, వేగ నిరోదక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీని ఆదేశిస్తూ ట్వీట్‌ చేశారు. వేగ నియంత్రణ, భద్రతా ప్రమాణాల కోసం సూచనలు ఇచ్చేందుకు స్వతంత్ర కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు.

Courtesy AndhraJyothy..