• 1/ఏ3 ఐ అనే కొత్త వర్గం గుర్తింపు
  • ప్రపంచ దేశాల్లోని వైరస్‌ కంటే ఇది భిన్నం
  • సీసీఎంబీ పరిశోధనల్లో వెల్లడి
  • తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ‘భారతీయీకరణ’(ఇండియనైజ్‌) చెందిందా? భారతీయత వచ్చేసిందా..? ఇక్కడి పరిస్థితులు, మనుషుల్లో భిన్నమైన జన్యువులు, లక్షణాలకు అనుగుణంగా మార్పు చెందుతోందా? ఆయా మార్పులకు అనుగుణంగా కొత్త వైరస్‌ వర్గం (క్లాడ్‌) 1/ఏ3 ఐ ఏర్పడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. ప్రపంచంలో ప్రధానంగా 10 వైరస్‌ క్లాడ్‌లు వ్యాప్తిలో ఉండగా, ఇప్పటికే భారత్‌లో ఏ 2ఏ, ఏ3, బీ, బీ 4 అనే నాలుగు రకాల క్లాడ్‌లు కరోనా వైరస్‌లో కామన్‌గా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే కొత్తగా మరో వేరియంట్‌ 1/ఏ3 ఐ బయటపడింది. ఫిబ్రవరి నుంచే ఇది వ్యాప్తి చెందడం మొదలైందని, ప్రస్తుతం అన్ని వైరస్‌ వేరియెంట్లలో ఇది 42 శాతం ఉన్నట్లు, ప్రపంచవ్యాప్తంగా 3.5 శాతం ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది.

ఇప్పటికే దీనికి సంబంధించిన జన్యువులను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), పుణే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంయుక్తంగా విశ్లేషించాయి. తాజాగా సీసీఎంబీ జరిపిన తాజా పరిశోధనల్లో ఐదో రకం వైరస్‌ వర్గం ఉన్నట్లు గుర్తించింది. ఇది ఎక్కువగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి సంబంధించిన వైరస్‌ కేసుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో వీటి ఛాయలున్నట్లు తేల్చారు. ఈ జీనోమ్‌లు సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రూనే, కెనడా, చైనాలోని కేసుల్లో స్వల్పస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ వర్గం వైరస్‌లోనూ జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నందున దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తే మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

నాలుగో రకం చాలా ప్రమాదకరం.. 
ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల వైరస్‌ శాంపిళ్లు, వాటిలోని జీనోమ్‌లు, అవి ఏ విధంగా మార్పు చెందుతున్నాయన్న దానిపై పరిశోధనలు నిర్వహించారు. వీటిలో ప్రధానంగా 10 రకాల వేరియెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటికి తగ్గట్లు వైరస్‌ జీనోమ్‌ స్వభావాలు మారుతున్నట్లు గుర్తించారు. మనదేశం విషయానికొస్తే 361 నమూనాలను పరిశీలించారు. వాటిలో ఇప్పటికే 297 శాంపిళ్ల జన్యువు నమూనాలపై ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ, తదితర సంస్థలు పరిశోధనలు నిర్వహించాయి. వాటిలో నాలుగు వర్గాలు లేదా రకాల జీనోమ్‌లు ఏ1, ఏ2 బీ, బీ, బీ3 ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీటికి తోడు సీసీఎంబీ, ఢిల్లీకి చెందిన సీఎస్‌ఐఆర్‌ 64 శాంపిళ్ల పైనా జన్యు విశ్లేషణ జరపడంతో పాటు గతంలోని 297 నమూనాలు కూడా కలిపి మొత్తం 361 శాంపిళ్లను పరిశీలించినప్పుడు కొత్తరకం వైరస్‌ వర్గాన్ని కనుగొన్నారు. ఇలా భారత్‌లో ఐదవ, ప్రపంచంలో 11వ వర్గాన్ని గుర్తించారు.

దీని స్వభావాన్ని తెలుసుకునేందుకు జనవరి 22 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఐసీఎంఆర్‌ చేసిన ల్యాబ్‌ డేటాను విశ్లేషించగా, సీసీఎంబీ ఎక్కడైతే 1/ఏ3 ఐ వైరస్‌ ప్రాచుర్యంలో ఉందని చెప్పిందో (తెలంగాణ, మహారాష్ట్ర తదితరాలు)ఆ ప్రాంతాల్లో సెకండరీ ఇన్‌ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఐసీఎంఆర్‌ విశ్లేషణలను బట్టి ఏ1/ఏ3 ఐ వైరస్‌ వ్యాప్తి లక్షణం ఎక్కువగా ఉన్నట్లు భావించొచ్చు. 1/ఏ3ఐ వైరస్‌ స్వల్ప తేడాలతో 4 రకాలుగా ఉన్నట్లు గుర్తించారు. వాటిలో మూడు రకాలు ప్రమాదకరం కాదని, సీ13730టీ అనే రకం ప్రమాదకరమైందని గుర్తించారు. ఇది ఏ మేరకు వైరస్‌ స్వభావాన్ని మారుస్తుందనేది విశ్లేషించాల్సి ఉంది. ఈ కొత్తరకం వైరస్‌లోని ప్రమాదకరమైన నాలుగో వర్గానికి చెందిన స్వభావమే వివిధ రాష్ట్రాల్లోని వైరస్‌ వ్యాప్తిలో వ్యత్యాసాలకు కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. వలస కార్మికుల కారణంగా ఈ నాలుగో వర్గం వైరస్‌ ఆయా రాష్ట్రాల నుంచి కొత్త రాష్ట్రాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇది ఇండియన్‌ వైరసే
‘1/ఏ3ఐను ఇండియన్‌ వైరస్‌గానే పరిగణించాలి. వ్యాక్సిన్‌ కనుక్కోవడంలో భాగంగా ఇక్కడ ప్రబలిన, వ్యాప్తిలో ఉన్న వైరస్‌పై పరిశోధనలు జరిపితే ప్రయోజనం ఉంటుంది. ఈ రకం వైరస్‌ లక్షణాల వ్యాప్తి ఏ మేరకుంది అన్న దానిపై విస్తృతస్ధాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. సీసీఎంబీ వ్యాక్సిన్‌పై చేస్తున్న పరిశోధనలు ఈ వైరస్‌ లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నంగా భావించొచ్చు. భారతీయ వైరస్‌కు పరిష్కారం కూడా మనదేశానికి చెందినదై ఉంటేనే మనకు మంచిది.’

డా.కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యశాల

Courtesy Sakshi