కోడెపాక కుమారస్వామి, సామాజిక విశ్లేషకుడు.

ఇటీవల సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆధిపత్య కులాల్లోని ఆర్థిక బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన చట్టం చెల్లుబాటుకు సంబంధించిన కేసును విచారించి తుది తీర్పునకు ఐదుగురు జడ్జిలు కలిగిన ధర్మాసనానికి బదిలీ చేసింది. మొదట 1990లో కేంద్రం మండల్ కమిషన్ నివేదికను పాక్షికంగా అమలులో భాగంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఓ బి సి) 27% రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యతిరేకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు నివారణ చర్యల్లో భాగంగా అప్పటి పి వి నరసింహారావు ప్రభుత్వం 1991లో ఆధిపత్య కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ బి సి) 10% రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశ పెడుతూ ఉత్తర్వులను జారీ చేశారు. సుప్రీంకోర్టు 27% ఓబీసీ రిజర్వేషన్లను మరియు 10% ఈ బి సి రిజర్వేషన్ల సమస్యలపై తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం పూర్తిస్థాయి విచారణ చేపట్టి 16 నవంబర్ 1992న ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Indra Sawhany Vs Union of India) మధ్య జరిగిన కేసుపై తీర్పును వెల్లడిస్తూ 27% ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ 10% ఈ బి సి రిజర్వేషన్లను కొట్టివేసింది అందుకు కారణంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఎలాంటి రిజర్వేషన్ల కల్పనపై రాజ్యాంగంలో వెసలుబాటు లేదని తెలుపుతూ వర్టికల్ రిజర్వేషన్లు ప్రత్యేక పరిస్థితులలో తప్ప 50% శాతానికి మించకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 15(4), 15(5), 16(4), 335 ప్రకారం కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వారికి విద్య ఉద్యోగాలలో జనాభా దామాషా ప్రకారం 1947/1950 నుండి అమలు చేస్తుంది అదేవిధంగా 52% జనాభా కలిగిన సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓ బి సి) వారికి ఉద్యోగాలలొ 1993 నుండి విద్యా సంస్థల్లో 2008 నుండి సంపన్న శ్రేణి వారిని మినహాయించి రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు ప్రస్తుత అధికరణల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనులోమానుపాతంలో విద్యా ఉద్యోగాలలో లేనట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలుపుతుంది.

కేంద్రం 2006లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఏవిధంగానైనా కల్పించాలని జాతీయస్థాయిలో ఇద్దరు సభ్యులచే ఎస్ ఆర్ సిన్హో (S.R Sinho) అధ్యక్షతన కమీషన్ను నియమించింది సదరు కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం 2010లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తూ ఆధిపత్య కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సదుపాయాలు, ఉచిత విద్య తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది కానీ వీరికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని సూచించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 నాటికి ప్రభుత్వ శాఖలలో అన్ని అన్నీ కేటగిరీలను కలిపినట్లయితే ఎస్సీ 17%, ఎస్టీ 18%, ఓబిసి 21% ఆధిపత్య కులాల వాళ్లు 54% ప్రాతినిధ్యం ఉన్నట్లు లెక్క తీశారు అంటే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉందని గమనించాలి.

సుప్రీంకోర్టు నేటి వరకు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఎలాంటి చట్టాలనైనా/రాజ్యాంగ సవరణలనైనా పునసమీక్షించి కొట్టివేసి అధికారం ఉందని అనేక తీర్పులో తెలిపింది ఉదాహరణకు 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (Kesavananda Bharathi Vs State of Kerala) కేసులో 13 మంది జడ్జిల ధర్మాసనంలో 7:6 మెజార్టీ తీర్పు, 2007లో ఐ ఆర్ కోల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళ నాడు (I R Coelho Vs State of Tamil Nadu) కేసులో తొమ్మిది మంది జడ్జీలు ధర్మాసనం తీర్పులలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో 1973/1974 తర్వాత చేర్చిన ఎలాంటి చట్టాలను అయినా పునఃసమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని తెలిపింది, 2016లో సుప్రీంకోర్టు అడ్వకేట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Supreme Court Advocates Vs Union of India) మధ్య జరిగిన కేసులో కేంద్రం 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 124ఎ, 124బి, 124సి లను చేరుస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేస్తూ కొలీజియం వ్యవస్థను మార్చడంపై రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజార్టీ తీర్పునిస్తూ 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మారుస్తుందని తెలుపుతూ 99వ రాజ్యాంగ సవరణ చెల్లదని కొట్టివేసింది.

కేంద్రం విద్యా సంస్థల్లో రిజర్వేషన్లుకు సంబంధించి 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(5)ను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మైనారిటీ విద్యాసంస్థలు మినహాయించి ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేశారు, 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Ashok Kumar Thakur Vs Union of India) కేసు తీర్పులొ ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఓబీసీలకు 27% కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను ఆమోదిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల గురించి తేల్చలేదు, తిరిగి 2014లో ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Pramati Educational and Cultural Trust Vs Union of India) కేసు తీర్పులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా రిజర్వేషన్ల కల్పనకు ఆమోదం తెలిపింది, మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 25% రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం 2009 నుండి ప్రతిపాదించిన ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 2012లో సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల ధర్మాసనం అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Un-Aided Private Schools of Rajastan Vs union of India) కేసు తీర్పు ఆర్థికంగా వెనుకబాటు రిజర్వేషన్లను ఆమోదించింది.

కేంద్ర బిజెపి ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(6), 16(6)లను రాజ్యాంగంలో చేరుస్తూ గరిష్టంగా 10% ఆధిపత్య కులాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈ డబ్ల్యూ ఎస్) మతం, లింగ బేధంలేకుండా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇప్పటికే అమలు పరుస్తున్న రిజర్వేషన్లకు అధనంగా అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు, ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉన్నాయని ఇప్పటికే ఆధిపత్య కులాల వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 54% ప్రాతినిధ్యం ఉన్నారని సదరు రిజర్వేషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (Janahit Abhiyas Vs Union of India) మధ్య జరిగిన కేసు తీర్పులో త్రిసభ్య ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను నిలిపి వేయకుండా కేసు విచారణ నిమిత్తం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి నివేధిక సమర్పించింది తుది తీర్పు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.